Sabarimala Makara Jyothi 2025: శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
Makara Jyothi Darshanam 2025: ఏటా మకర సంక్రాంతికి శబరిమలలో మకరజ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు పోటెత్తుతారు. ఆ జ్యోతిపై ఎన్నో సందేహాలు, మరెన్నో సమాధానాలు? ఇంతకీ వాస్తవం ఏంటి?
Sabarimala Makara Jyothi 2025 Date
శబరిమలలో దర్శనమిచ్చే మకరజ్యోతి నిజమా-కాదా?
అయ్యప్ప స్వామి జ్యోతి స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తాడా - ఎవరైనా ఆ జ్యోతిని వెలిగిస్తున్నారా?
ఎన్నో ఏళ్లుగా ఈ ప్రశ్నలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి..వీటికి సమాధానాలు చెబుతూనే ఉన్నారు..
ఇంతకీ ఆ జ్యోతి నిజమా - కాదా?
ఈ కథనం పూర్తిగా చదివితే.. మీకు మకర జ్యోతిపై స్పష్టత వచ్చేస్తుంది..
అయ్యప్పస్వామి రాజ్యం నుంచి మణికంఠుడిగా వెళ్లిపోతున్న సమయంలో తండ్రికి ఓ మాట చెబుతాడు..
ప్రతివర్షేతు సంక్రాంతౌ మాఘమాసస్య పార్థివః
మహోత్సవః త్వయాకార్యాః సహ్యపృష్టే మమాశ్రమే
గమిష్యంతి చ యే తత్ర చోత్సవే మన సన్నిధౌ
సర్వతే సుఖినో భూప భవిష్యంతి నసంశయః
దీని అర్థం ఏంటంటే..ఏటా సహ్యాద్రి దగ్గర మకర సంక్రాంతి రోజు ఉత్సవాన్ని నిర్వహించండి. ఆ ఉత్సవానికి వచ్చేవారికి సకల శుభాలు కలుగుతాయి. అంతే కానీ స్వామివారు తాను జ్యోతి స్వరూపంలో కనిపిస్తానని చెప్పినట్టు లేదు..
Also Read: శబరిమల యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైంది .. అయ్యప్ప స్వామి మొదటి ఆదాయం ఎంతో తెలుసా!
మకర జ్యోతి అంటే అయ్యప్ప కాదా?
మకర జ్యోతి - మకరవిళుక్కు రెండున్నాయ్. మకర విళుక్కు అనేది చేత్తో వెలిగించే దీపం... ఏటా సంక్రాంతికి ఆటవికులు ఓ తిథి రోజు అడవిలోకి వెళ్లి పూజచేస్తారు. ఇప్పటికీ సంక్రాంతికి దేవస్థానం వాళ్లు అక్కడ దీపం వెలిగిస్తారు..దానిని మకరవిళుక్కు అంటారు.
మకర జ్యోతి అంటే?
అయ్యప్పస్వామి ఆ తర్వాత మరో అవతారంలో వచ్చినట్టు అయ్యప్ప జన్మరహస్యంలో ఉంది. మొదటి అవతారాన్ని మణికంఠుడు అని అంటారు. ఈ అవతారంలో 18 మెట్లు ఎక్కిన తర్వాత అయ్యప్ప జ్యోతి రూపంలో అంతర్థానం అయిపోయాడని చెబుతారు. ఆ తర్వాత అవతారాన్ని అయ్యనార్ అని అంటారు. అప్పట్లో కేరళలో దొంగలు ప్రజల్నిచాలా ఇబ్బందులు పెట్టేవారు. ఆ సమయంలో అయ్యనార్ ఆ దొంగల్ని సంహరించి ప్రజల్ని రక్షించాడని ప్రతీతి. ఆ తర్వాత అందరూ చూస్తుండగానే అయ్యప్ప జ్యోతి రూపంలో మారిపోయాడట. ఆ రోజు మకర సంక్రాంతి కావడంతో ఏటా మకర సంక్రాంతి రోజు అయ్యప్ప జ్యోతి రూపంలో వస్తాడని భక్తుల విశ్వాసం...దానినే మకర జ్యోతిగా ఆరాధిస్తున్నారు..
Also Read: 12 ఏళ్లకోసారి విభీషణుడు సందర్శించే ఆలయం ఇది.. ధనుర్మాసంలో స్వామి వైభవం చూసితీరాల్సిందే!
మకర జ్యోతి వెనుకున్న సైన్స్ ఇదే!
1980-1981లో ఓ ఏడాది మకర సంక్రాంతి రోజు నిజంగానే మకర జ్యోతి కనిపించింది. అయితే అప్పుడు అది దైవ మహిమ కాదు ఖగోష శాస్త్రానికి సంబంధించిన విశేషం అంటారు శాస్త్రవేత్తలు. ధూళిమేఘంపై వాతావరణ రేణువులు పడి వెలుగుముద్ద ఆకారంలో ఏర్పడిందని అదే జ్యోతిలా కనిపించిందని సోవియట్ శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు. అలా ఒక్క ఏడాది మకర సంక్రాంతి రోజు వెలుగు జ్యోతి కనిపించింది. ఆ తర్వాత కేరళ అయ్యనార్ లీనమైనప్పుడు జ్యోతి కనిపించింది. అప్పటి నుంచి అయ్యప్ప జ్యోతి రూపంలో వస్తాడనే ప్రచారం సాగుతోంది.
మకర జ్యోతి కనిపించే ప్రదేశం ఇదే
పొన్నాంబలంమేడు దగ్గర ఓ ప్లాట్ ఫాం కట్టారు.. అక్కడ ఓ పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. అక్కడ పెద్ద జ్యోతి వెలిగిస్తే అది శబరిమలలో కనిపిస్తుంది. అప్పట్లో ఓ సీనియర్ జర్నలిస్ట్ అడవులు, కొండలు దాటుకుని ఆ మకర జ్యోతి వెలిగించే ప్రదేశానికి వెళ్లి ఇక్కడ వెలిగించే దీపమే మకర జ్యోతిగా చెబుతున్నారని ఫొటోలతో సహా వెల్లడించారు.
మకర జ్యోతి అబద్ధమా మరి!
భగవంతుడే కొండగా వెలిసిన క్షేత్రం అరుణాచలం. ఇది అగ్ని లింగ క్షేత్రం. అయితే ఈ కొండ ఎక్కడా అగ్ని లింగంలా కనిపించదు. అయితే కార్తీక పౌర్ణమి రోజు కొండపై దీపాలు వెలిగించి అదే అగ్నిలింగంగా భావించి భక్తితో నమస్కరిస్తారు. కానీ ఇదే కొండ రమణమహర్షి లాంటి మహా భక్తులకు అగ్నిలింగంలానే కనిపిస్తుంది. మకర జ్యోతి కూడా ఈకోవకు చెందినదే. మహాత్ములకు మాత్రమే అయ్యప్ప జ్యోతి రూపంలో కనిపిస్తాడు.
మకర జ్యోతి నిజమా-కాదా అనే చర్చ కన్నా.. మండలదీక్ష చేసి భక్తి శ్రద్ధలతో శబరిమలకు వెళ్లినవారు కళ్లారా అయ్యప్ప స్వామిని దర్శించుకుని క్షేమంగా తిరిగిరండి. భక్తితో కళ్లుమూసుకుని నమస్కరిస్తే భగవంతుడు మీ మనసులోనే ఉంటాడు..ఎందుకంటే అయప్ప దర్శనమే కోటి జన్మల కృతం...
Also Read: శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!