Sankranthiki Vasthunam Review - 'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ: కామెడీ ఒక్కటేనా - కథతోనూ వెంకీ, అనిల్ రావిపూడి మేజిక్ చేశారా?
Sankranthiki Vasthunam Movie Review: 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' విజయాల తర్వాత వెంకటేష్ - అనిల్ రావిపూడి కలయికలో వచ్చిన సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. సంక్రాంతి బరిలో ఆఖరిగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది?
అనిల్ రావిపూడి
వెంకటేష్, ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి, నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్ తదితరులు
Venkatesh's Sankranthiki Vasthunam Movie Review In Telugu: విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' విజయాల తర్వాత అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రమిది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుదలైంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది? కామెడీ ఒకటేనా? కథ, కథనాలు ఏమైనా ఉన్నాయా? అనేది రివ్యూలో చూడండి.
కథ (Sankranthiki Vasthunam Story): భార్య భాగ్యలక్ష్మి (ఐశ్వర్య రాజేష్), నలుగురు పిల్లలతో కలిసి హ్యాపీగా రాజమండ్రిలో లైఫ్ లీడ్ చేస్తున్నాడు యాదగిరి దామోదర రాజు (వెంకటేష్). అతను మాజీ పోలీస్. 150కి పైగా ఎన్కౌంటర్లు చేశాడు. అయితే... పోలీస్ జాబ్ వదిలేసి అత్తారింట్లో సెటిల్ అవుతాడు. అతడిని వెతుక్కుంటూ మాజీ ప్రేయసి, పోలీస్ ఆఫీసర్ మీనాక్షి (మీనాక్షి చౌదరి వస్తుంది.
జైల్లో కరుడుగట్టిన రౌడీ, తన అన్నను విడిపించుకోవడం కోసం అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన సత్య ఆకెళ్ల (శ్రీనివాస్ అవసరాల)ను కిడ్నాప్ చేస్తాడు ఒక తమ్ముడు. అసలు విషయం బయటకు రాకుండా కిడ్నాపర్ల చెర నుంచి సత్య ఆకెళ్లను క్షేమంగా విడిపించాలని మీనాక్షితో పాటు తెలంగాణ సీఎం (సీనియర్ నరేష్) రిక్వెస్ట్ చేస్తాడు. భర్తతో పాటు తాను కూడా వస్తానని భాగ్యలక్ష్మి అంటుంది. ఒకవైపు పెళ్ళాం, మరొకవైపు మాజీ ప్రేయసి... ఇద్దరి మధ్య యాదగిరి దామోదర రాజు ఎలా నలిగిపోయాడు? మధ్యలో వీళ్ళను ఇబ్బంది పెట్టిన జార్జ్ ఆంటోని ఎవరు? అసలు యాదగిరి దామోదర రాజు పోలీస్ జాబ్ ఎందుకు వదిలేశాడు? మీనాక్షితో ఎందుకు బ్రేకప్ అయ్యింది? సత్య ఆకెళ్లను విడిపించాడా? లేదా? చివరికి ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Sankranthiki Vasthunam Review Telugu): కొత్త కథ లేదంటే ఊహకందని కథనం ఉంటుందని అనిల్ రావిపూడి సినిమాలు చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లరు. ఆయన సినిమాలలో కామెడీ ఉంటుందని అందరికీ తెలుసు. సరదాగా కాసేపు నవ్వుకోవడం కోసం వెళతారు. 'సంక్రాంతికి వస్తున్నాం' పాటలు, ప్రచార చిత్రాలు చూస్తే... కథపై ఒక అవగాహన వస్తుంది. వెంకటేష్ నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు మంచి పాటలు ఉన్నాయని 'సంక్రాంతికి వస్తున్నాం'పై ముందు నుంచి ప్రేక్షకులలో అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టు సినిమా ఉందా? లేదా? అనేది చూస్తే...
పెళ్ళాం పిల్లలతో హ్యాపీగా ఉంటున్న ఒక మగాడి దగ్గరకు మాజీ ప్రేయసి వస్తే... భార్య ఎంత జెలసీగా ఫీల్ అవుతుంది? ఇద్దరి మధ్య మగాడు ఎలా నలిగిపోయాడు? అనేది 'సంక్రాంతికి వస్తున్నాం' అనుకోవడం సహజం. దీనికి ఒక కిడ్నాప్ డ్రామాను యాడ్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. కిడ్నాప్ డ్రామాలో కథ గానీ, అందులో బలం గానీ సినిమాకు ఏమాత్రం సరిపోలేదు. లాజిక్ సంగతి పక్కన పెట్టండి... కొన్ని సీన్లు అయితే స్క్రీన్ మీద ఎటువంటి మ్యాజిక్ చేయలేదు. 'బేస్ లేదు' అంటూ సాయి కుమార్ మీద 'యానిమల్' నటుడు ఉపేంద్ర లిమయే చెప్పే డైలాగ్స్ గానీ, ఆయన క్యారెక్టర్ గానీ, ఆ సెకండాఫ్ గానీ అసలు ఏమాత్రం నవ్వించలేదు. క్లైమాక్స్ ముందు మగాళ్లకు వెంకటేష్ ఇచ్చిన మెసేజ్ గాని, చివర్లో గురువు గొప్పతనం చెప్పే సన్నివేశాలు గాని అసలు ఆకట్టుకోలేదు. నరేష్, వీటీవీ గణేష్ మధ్య కామెడీ కూడా సొసోగా ఉంది.
రచయితగా, దర్శకుడిగా అనిల్ రావిపూడి సక్సెస్ అయినది ఒకే ఒక క్యారెక్టర్ విషయంలో... అది బుల్లి రాజు! వెంకటేష్ కుమారుడిగా నటించిన బాల నటుడు రేవంత్ చితక్కొట్టాడు. గోదావరి జిల్లాలలో పెద్దవాళ్లను చీపురు పుల్ల కింద తీసిపారేస్తూ మాట్లాడే ముదురు క్యాండిడేట్లు ఉంటారు. అటువంటి పిల్లలకు రిప్రజెంటేషన్ అన్నట్లు ఆ క్యారెక్టర్ డిజైన్ చేశారు. అదొక్కటీ బాగా పేలింది. హిలేరియస్ ట్రాక్ అది. తనతో పెళ్లికి ముందు వేరే అమ్మాయితో భర్త ప్రేమ వ్యవహారం నడిపించాడని తెలిసిన తర్వాత ఐశ్వర్య రాజేష్ రియాక్షన్స్ గానీ, తాను బ్రేకప్ చెప్పిన తర్వాత తన కోసం వెయిట్ చేస్తానని చెప్పిన లవర్ మరొక మహిళను పెళ్లి చేసుకుని నలుగురి పిల్లలకు తండ్రి అయ్యాడని తెలిసిన తర్వాత మీనాక్షి చౌదరి ఇచ్చిన రియాక్షన్స్ గానీ కొంత నవ్వించాయి. ఫస్టాఫ్ వరకు ఎంటర్టైన్ చేసిన అనిల్ రావిపూడి అండ్ కో... సెకండాఫ్ విషయంలో చాలా డిజప్పాయింట్ చేశారు.
భీమ్స్ సిసిరోలియో పాటలు సినిమా విడుదలకు ముందు సూపర్ హిట్ అయ్యాయి. స్క్రీన్ మీద ఆశించిన స్థాయిలో పిక్చరైజేషన్ లేదు. వెంకటేష్ పాడిన సాంగ్ ప్లేస్మెంట్ కూడా బాలేదు. నేపథ్య సంగీతం ఓకే. కమర్షియల్ సినిమాలకు ఎటువంటి కెమెరా వర్క్ ఉండాలో సమీర్ రెడ్డికి తెలుసు. ఆయన దాన్ని ఫాలో అయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకా కేర్ తీసుకోవాల్సింది. కామెడీ మెయిన్ ఎజెండా అయినప్పుడు కథ కోసం కొన్ని సన్నివేశాలను సాగదీయాల్సిన అవసరం లేదు.
వెంకటేష్ (Venkatesh)కు ఇటువంటి ఫ్యామిలీ కథలు చేయడం కొత్త కాదు. అనిల్ రావిపూడి రాసిన క్యారెక్టరైజేషన్ కూడా ఆయనకు కొత్త కాదు. సో... ఆయా సీన్లకు తగ్గట్టు చేసుకుంటూ వెళ్లారు. వెంకటేష్ పక్కన మీనాక్షి చౌదరి హీరోయిన్ ఏమిటి? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత? అనే విమర్శలకు ఒక్క డైలాగుతో చెక్ పెట్టారు అనిల్ రావిపూడి. సినిమాలో ఆ ఏజ్ గ్యాప్ గురించి జస్టిఫికేషన్ ఇచ్చారు. మీనాక్షి చౌదరి అందంగా కనిపించారు. ఐశ్వర్య రాజేష్ పాత్రకు తగ్గట్టు చేశారు. నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి కుమార్ తదితరులు తమ పాత్రలకు తగ్గట్టు చేశారు.
'సంక్రాంతికి వస్తున్నాం'... సంక్రాంతి పండక్కి ఫ్యామిలీతో కలిసి చూసే కామెడీ ఫిల్మ్. ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. సెకండాఫ్ కొంత డల్ అయినా సరే మధ్య మధ్యలో వచ్చే కామెడీ కొంత నవ్విస్తుంది. కథ, లాజిక్స్ వంటివి పక్కన పెట్టేసి హాయిగా నవ్వుకోవడం కోసం వెళితే ఎంజాయ్ చేయవచ్చు. లేదంటే కష్టం! ఫస్టాఫ్ సూపర్ హిట్... సెకండాఫ్‌లో కామెడీ ఓకే!!