Mahakumbh 2025: మహా కుంభమేళాలో శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం, చక్రస్నానం
Mahakumbh:కుంభమేళాకి తరలివచ్చే భక్తుల కోసం ప్రయాగ్ రాజ్ లో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో శాస్త్రోక్తంగా పూజలు జరుగుతున్నాయి. ఈ రోజు దశాశ్వమేధ ఘాట్ వద్ద స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించారు
Mahakumbh 2025: ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహా కుంభ మేళాలో ప్రయాగ్ రాజ్ లోని దశాశ్వమేధ ఘాట్ వద్ద గురువారం స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చకుల బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసస్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని పవిత్ర గంగా నది ఒడ్డున కన్నుల పండువగా నిర్వహించారు.
Also Read: కుంభమేళాలో స్నానఘాట్ కి వెళ్లొచ్చేందుకు ఎంత సమయం పడుతోందో తెలుసా.. మొదటి 4 రోజుల్లో ఎన్ని విశేషాలో!
పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో నిర్వహించిన స్నపన తిరుమంజనం కన్నుల పండువగా సాగింది.
శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, పురుష సూక్తం, నారాయణ సూక్తం...మొత్తం పంచసూక్తాలను వల్లించారు.
Also Read: ప్రయాగ్రాజ్లో విదేశీ భక్తుల సందడి- కుంభమేళా చాలా పవర్ ఫుల్, మేరా భారత్ మహాన్ అని కామెంట్స్
అభిషేకం పూర్తైన తర్వాత తులసి మాలలతో ఉత్సవ మూర్తులను అలంకరించారు. సహస్రధారాపాత్రతో అభిషేక కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ చక్రతాళ్వార్ ను మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ గంగా నదిలోకి తీసుకువెళ్లారు. అక్కడ శ్రీ చక్రతాళ్వార్ కు ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించి చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు.
అత్యంత వైభవంగా సాగిన ఈ కార్యక్రమంలో హెచ్ డీపీపీ సెక్రెటరీ శ్రీ శ్రీరామ్ రఘునాథ్, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ గుణ భూషణ్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ గురు రాజస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జనవరి 18న ప్రయాగ్ రాజ్ లో శ్రీవారి కళ్యాణోత్సవం
మహా కుంభమేళాలోని శ్రీవారి నమూన ఆలయంలో నిత్య కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ వేంకటేశ్వరస్వామికి నిర్వహించినట్టే..ప్రయాగరాజ్ నమూనా ఆలయంలోనూ ఉదయాన్నే తిరుప్పావై సేవ, తోమాలసేవ, కొలువు, సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పించి భక్తులను దర్శనాలకు అనుమతించారు. సాయంత్రం 4 గంటలకు నమూనా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాహన మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి వేడుకగా ఊంజల్ సేవ నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు హాజరై స్వామివారి వైభవాన్ని కన్నులారా దర్శించుకున్నారు. ప్రయాగ్ రాజ్ లోని శ్రీవారి నమూనా ఆలయంలో భక్తులు విరాళాలు సమర్పించేందుకు వీలుగా టీటీడీ కీయోస్క్ మిషన్ ఏర్పాటు చేసింది. ఈ మిషన్ ద్వారా భక్తులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి విరాళంగా ఇవ్వొచ్చు. జనవరి 18 శనివారం ప్రయోగరాజ్ లో శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జనవరి 18వ తేదీన ఉదయం 11 నుంచి 12 గంటలకు శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు.
వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి,
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ