Happy News Year 2026: 2000-25 ఈ పాతికేళ్ళ తరం చూసినన్ని మార్పులు ఎవరూ చూడలేదు!అవేంటో చూద్దామా?
2000-25 ఈ పాతికేళ్ళ తరం చూసినన్ని మార్పులు ఎవరూ చూడలేదు. అవేంటో చూద్దామా

2000 సంవత్సరం వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం ఎన్నడూ చూడనంత సంబరాలు చేసుకుంది. ఎందుకంటే అది కొత్త సహస్రాబ్ది కాబట్టి. ఆ సంఘటన గడిచి అప్పుడే పాతికేళ్ళు గడిచిపోయింది. అప్పుడు పుట్టిన వాళ్లను మిలీనియల్స్ అంటే ఇప్పుడు జెన్ జీ తరం వచ్చేసింది. రేపో మాపో జెన్ ఆల్ఫా కూడా వచ్చేస్తోంది. అయితే ఈ పాతికేళ్ళు చూసిన తరం చాలా మార్పులకు సాక్షులుగా నిలిచారు. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు చూద్దాం.
ఉత్తరాలు చూసిన ఆఖరి తరం
2000నాటికి ఇంకా ఉత్తరాలు రాసుకోవడం ఉంది. అప్పుడప్పుడే ఇమెయిల్స్ లాంటివి అందుబాటులోకి వస్తున్నా పూర్తిగా ప్రజలకు వాటిని వాడే నాలెడ్జ్ లేకపోవడం వల్ల పల్లెటూళ్లలో ఉత్తరాలు రాసుకోవడం ఉండేది. కాకపోతే కొద్ది కాలానికే అది ఎండ్ అయిపోయింది. టెలిగ్రామ్‌లను చూసిన ఆఖరి తరం కూడా వాళ్ళే.
2) కాయిన్ టెలిబాక్స్ లకు బై బై
కిళ్ళీ షాపుల ముందు, బస్ స్టాండ్‌లు, రైల్వే స్టేషన్ల ముందు ఉండే కాయిన్ బాక్స్ లను వాడుకున్న తరం ఇదే. రూపాయి వేసి ఫోన్ బాక్స్ లతో అర్జెంట్ విషయాలు మాట్లాడుకున్న తరం ఇది. వీటి దెబ్బకు ఉత్తరాలు రాసే అలవాటు తొందరగానే అంతరించి పోయింది.
3)మొబైల్స్ దెబ్బకు టెలిఫోన్స్ ఔట్
అప్పుడప్పుడే మొబైల్ వినియోగం పెరుగుతోంది. అయితే ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్స్‌లా కాకుండా అప్పటి మొబైల్స్ చాలా బండగా బరువుగా ఉండేవి. నెమ్మదిగా స్మార్ట్స్ ఫోన్స్ ఎంటర్ కావడంతో టెలిఫోన్స్ ఆ తర్వాత మొబైల్స్ కాలగర్భంలో కలిసి పోయాయి.
4) వారాంతపు సంతలు ప్లేస్‌లో సూపర్ మార్కెట్ లు
పల్లెటూళ్లు చిన్న చిన్న టౌన్స్‌లో వారాంతపు సంతలు జరిగేవి. వారానికి సరిపడే సరకులు సంతకు వెళ్లి కొనుక్కునే అలవాటు ఉండేది. నెమ్మదిగా రైతు బజార్లు, సూపర్ మార్కెట్‌లు ఎంటర్ కావడంతో వారాంతపు సంతలు మాయం అయిపోయాయి. ప్రస్తుతం కొన్ని గిరిజన గ్రామాల్లో మాత్రమే ఈ సంతలు జరుగుతున్నాయి.
5) స్టీరియో థియేటర్‌లు, నాన్ -AC సినిమా హాళ్ళు చూసిన ఆఖరి తరం
ఈ తరం చూసిన మరో మార్పు సింగిల్ థియేటర్‌ల నుంచి మల్టిప్లెక్స్‌లకు అప్ గ్రేడ్ అయిన విధానం. 2000 నాటికి ఇంకా నాన్ ఏసీ థియేటర్ లు ఉండేవి. అలాగే DTS సౌండ్ ఎఫెక్ట్ లేని సినిమాలు కూడా రిలీజ్ అయ్యేవి. 2010 నాటికి మల్టీ ప్లెక్స్ ల ట్రెండ్ మొదలై ఇప్పుడు పీక్ కి వెళ్లి పోయాయి.
6) అరచేతిలో సినిమా-OTT లు
మాట్లాడుకునే మొబైల్ ఫోన్ కొత్త సినిమాలను సైతం చూపిస్తుంది అని ఎవరూ 2000 నాటికి ఊహించలేదు. OTT ల పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాలను అరచేతిలోనే చూసేస్తున్న ఈ తరం ఒకప్పుడు టికెట్స్ కోసం లైన్‌లో గంటల తరబడి నిలబడే వాళ్లంటే నమ్మరేమో అన్నట్టు మార్పు వచ్చేసింది
7) డిజిటల్ పేమెంట్స్
2000 నాటికి ATMలు ఎంట్రీ ఇచ్చినా వాటి వాడకం పూర్తిగా అలవాటు కాలేదు. బ్యాంక్ కు వెళ్లి విత్ డ్రా ఫామ్ రాయడం లైన్లో నిలబడడం వంటివన్నీ నెమ్మదిగా గతంలోకి జారుకున్నాయి. డిజిటల్ పేమెంట్స్ రావడంతో 90% బ్యాంకింగ్ పనులు, పేమెంట్స్ అన్నీ ఫోన్ ద్వారానే అయిపోతున్నాయి.
8) పెద్ద పెద్ద టీవీ సెట్ల నుంచి స్మార్ట్ టెలివిజన్స్ వరకూ
అప్పట్లో టివి అనేది ఒక సౌకర్యం అన్నట్టు ఉండేది. ఇప్పుడు అది కనీస అవసరంగా మారిపోయింది. కేబుల్ టీవీ, శాటిలైట్ ఛానెల్స్ ఎంట్రీతో పల్లె టూళ్లకు సైతం టీవీలు పాకిపోయాయి. అప్పట్లో టీవీలు చాలా పెద్దగా ఉండేవి. మోయడానికి కనీసం ఇద్దరు కావాల్సి వచ్చేది. ఇప్పడు ఏకంగా గోడకు తగిలించే టీవీలు వచ్చేసాయి. మధ్యలో హోం థియేటర్ కల్చర్ వచ్చినా స్మార్ట్ ఫోన్ దెబ్బకు అవికూడా సైడ్ అయిపోయాయి.
9) ఫుడ్ డోర్ డెలివరీ యాప్‌లు
ఇంట్లో వండుకోలేని స్థితిలో టిఫిన్ కావాలన్నా బయట భోజనం చెయ్యాలన్నా పెద్ద పని. ఇప్పుడు ఇంటి గుమ్మం వద్దకే కోరుకున్న ఫుడ్ డెలివరీ చేసుకునే యాప్స్ వచ్చేశాయి.
10) ముగిసిన ఇంటర్ నెట్ సెంటర్ల హవా
2000 నాటికి ఇంటర్ నెట్ సెంటర్ల హవా మొదలవుతూ ఉంది. కాలేజ్ స్టూడెంట్స్ ఇమెయిల్స్ క్రియేట్ చేసుకోవడం వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవడం లాంటివి సరదాగా భావించేవారు. తరువాత బ్రౌజింగ్ కల్చర్ మొదలైంది. ఎక్కడ చూసినా ఇంటర్ నెట్ సెంటర్లు కనిపించేవి. స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి రావడంతో నెట్ సెంటర్ల హవా ముగిసింది. ప్రస్తుతం ప్రింట్ ఔట్లు తీసుకోవడం, హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవడం వంటి పనుల కోసమే కొన్ని నెట్ సెంటర్లు మిగిలున్నాయి
11) వీడియో క్యాసెట్స్, CD లు ఔట్
వీడియో క్యాసెట్స్ అద్దెకు తెచ్చుకునే అలవాటు ఉన్న ఆఖరి తరం 2000దే. ఆ తరువాత CDలు ఆపై DVDలు కొంతకాలం తమ హవా కొనసాగించాయి. OTTలు, యూట్యూబ్ ఎంట్రీ ఇవ్వడంతో సినిమా అనేది అరచేతిలోకే వచ్చేసింది.
12) ట్రైన్, బస్ టికెట్స్ బుకింగ్ నిమిషం లోనే
2000 నాటికి బస్ టికెట్ కానీ ట్రైన్ టికెట్ కానీ బుక్ చేసుకోవాలంటే అదో పెద్ద ప్రహసనంలా ఉండేది. ముఖ్యంగా ట్రైన్ టికెట్ బుకింగ్ అంటే ఒక రోజు మొత్తం కేటాయించాల్సిన పరిస్థితి. ఇప్పుడు మన ఫోన్ లోనే బస్, ట్రైన్ మాత్రమే కాదు విమానం టికెట్స్ సైతం బుక్ చేసుకునే సౌలభ్యం వచ్చేసింది.
13) IT బూమ్ నుంచి AI వరకూ
2000 నాటికి IT బూమ్ మొదలవుతోంది. అప్పటికి ఇంజనీరింగ్, మెడికల్ కోర్సు లదే హవా అయినా IT బూమ్ ఎంట్రీతో ఒక్కసారి పరిస్థితి మారిపోయింది. ఎక్కడ చూసినా C, C+, జావా కోర్సులు నేర్పించే ఇన్స్టిట్యూట్ లు పుట్టుకొచ్చాయి. ఈ పాతికేళ్ళు వీటిదే రాజ్యం. ఇప్పుడు AI బూమ్ స్టార్ట్ అయింది దానితో పాటే క్వాంటమ్ టెక్నాలజీ ఫై భవిష్యత్ తరం దృష్టి పెడుతోంది. రానున్న రోజుల్లో టెక్నో ఉద్యోగాల పరంగా పెద్ద చేంజ్ రాబోతుంది అంటున్నారు ఎనలిస్ట్ లు.
ఈ పాతికేళ్ల లో వచ్చిన మార్పుల్లో ఇవి కొన్ని మాత్రమే. మెడికల్,రాజకీయాలు, ఓటింగ్ సిస్టమ్‌తో సహా ఈ పాతికేళ్ళ తరం చూసిన మార్పు లు మరే తరం కూడా చూసి ఉండదు అనడంలో ఎలాంటి అనుమానం లేదు అనే 2000-2025 వరకూ వచ్చిన మార్పులను విట్నెస్ చేసిన వాళ్ళు.





















