Year Ender 2025: పోస్టు కార్డు నుంచి టీవీ వరకు - డిజిటల్ విప్లవంతో జ్ఞాపకాల పెట్టేలో చేరిన వస్తువులు ఇవే!
Nostalgia Tech: పాతికేళ్లుగా చాలా మార్పు చూశారు. చాలా వస్తువులు కనుమరుగైపోయాయి. ఊహించనివి వాడుకలోకి వచ్చాయి. ఏం మారినా పాత జ్ఞాపకాలను గౌరవిస్తూనే కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుందాం.

Technology Transformation India: కాలం ఎవరి కోసం ఆగదు. కానీ కాలంతోపాటు మనం వాడే వస్తువులు మన అలవాట్లు ఎంతో వేగంగా మారిపోతుంటాయి. ఒక్కసారి వెనక్కి చూసుకుంటే మాత్రం ఆశ్చర్య కలగక మానదు. 2000 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ స్నేహితులకు గ్రీటింగ్ కార్డు పంపిన వాళ్లు కోట్లలో ఉండి ఉంటారు. కానీ నేడు బొటను వేలి క్లిక్‌తో సమాచారాన్ని క్షణాల్లో పంపిస్తున్నారు. పోస్టు బాక్స్ దగ్గర నిలబడి ఉత్తరం కోసం ఎదురు చూసిన రోజులు, ఇన్‌లాండ్ లెటర్‌లో నాలుగు ముక్కు రాసిన క్షేమ సమాచారాలు పంచుకున్న క్షణాలు ఇప్పుడు కేవలం జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి. సరిగ్గా పాతికేళ్ల క్రితం అంటే 2000 మనం ఉన్న ప్రపంచానికి, నేటి 2025 ప్రపంచానికి మధ్య మహా సముద్రమంత వ్యత్యాసం ఉంది.
డిజిటల్ మీడియాలో గత రెండు దశాబ్దాలుగా మారుతున్న టెక్నాలజీని, సామాజిక పరిణామాలను నిశితంగా గమిస్తే.. పాతికేళ్ల ప్రయాణంలో మనం కోల్పోయిన వస్తువు వెనుక భావోద్వేగాలను పొందిన సౌకర్యాలను విశ్లేషించాల్సిన సమయం ఇది. ఈ మార్పులు కేవలం సాంకేతికమైనవి మాత్రమే కావు. ఇవి సామాజిక మూలాలను కూడా మార్చేశాయి.
Also Read: పాతికేళ్లలో భారత క్రికెట్ ప్రభంజనం; ఫిక్సింగ్ తుపాను నుంచి ప్రపంచ ఆధిపత్యం దిశగా సాగిన ప్రస్థానం!
జ్ఞాపకాల పెట్టే: 2000 కి ముందు మన జీవనశైలి
2000 సంవత్సరానికి ముందు భారత దేశంలో సమాచార మార్పిడి అనేది అత్యంత నెమ్మదిగా, కానీ ఎంతో ఆత్మీయంగా సాగేది. అప్పట్లో ప్రతి వీధిలో ఒక ఎర్రటి పోస్టు బాక్స్ దర్శనమిచ్చేది. ఇంటికి టెలిఫోన్ ఉండటం ఒక లగ్జరీగా పరిగణించేవాళ్లు. వార్తల కోసం ఉదయం పేపర్ కోసం, వినోదం కోసం రేడియో లేదా బ్లాక్ అండ్ వైట్ టీవీల కోసం ఎదురు చూడటం ఒక దినచర్య. ఆ రోజుల్లో ఒక ఉత్తరం ముక్క కనిపిస్తే ఇంట్లో పండగ వాతావరణం నెలకొనేది. కానీ వైటూకే భయాల మధ్య మొదలైన 21వ శతాబ్ధం పాతికేళ్లలో మన ఇళ్లను, మన అలవాట్లను పూర్తిగా మారుస్తుందని ఎవరూ ఊహించలేదు.
Also Read: భారతదేశం 25 ఏళ్ల ప్రయాణం: సంక్షోభాల నుంచి AI వృద్ధి వరకు.. యువ భారత్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది?
దశాబ్దాల వారీగా మాయమైన వస్తువులు
2000-2003: పోస్టల్ యుగానికి చరమగీతం
ఈ మూడేళ్ల కాలంలో మొబైల్ ఫోన్‌లు నెమ్మదిగా సామాన్యుల జీవితాల్లోకి ప్రవేశించడం మొదలైంది. అప్పటి వరకు లేఖలే ప్రధాన సమాచార సాధనంగా ఉండేవి. అయితే ఎస్‌ఎంఎస్ సేవలు అందుబాటులోకి రావడంతో పోస్టు కార్డులు, ఇన్‌లాండ్ లెటర్లు వాడకం తగ్గడం ప్రారంభమైంది. ఉత్తరం రాసే ఓపిక లేని వారు గుడ్ మార్నింగ్ అని ఒక మెసేజ్ పంపడం అలవాటు చేసుకున్నారు. దీంతో పోస్టు బాక్స్ వద్ద సందడి తగ్గింది.
2004-2006: డైరీలు, అడ్రెస్ బుక్స్ మాయం:
మొబైల్ ఫోన్ల మెమొరీ పెరగడంతో మనకు అత్యంత అవసరమైన అడ్రెస్ బుక్స్, పర్సనల్ డైరీలు అటకెక్కి కాలమిది. ఒకప్పుడు ల్యాండ్‌లైన్ పక్కన తప్పనిసరిగా ఉండే టెలిఫోన్ డైరీల స్థానాన్ని మొబైల్ కాంటాక్ట్స్ ఆక్రమించాయి. చిరునామాలు, ఫోన్ నంబర్లు గుర్తు పెట్టుకునే అవసరం లేకుండా పోయింది.
Also Read: ఎస్టీడీ బూత్‌లో నిరీక్షణ నుంచి 5G వరకు; 25 ఏళ్ల భారత టెలికాం రంగంలో అద్భుతాలు ఇవే!
2007-2009 పేజర్, కాయిన్ బూత్‌లు మాయం:
ఒకప్పుడు స్టేటస్ సింబల్‌గా ఉండే పేజర్లు, మొబైల్ కాల్స్ చౌకగా మారడంతో పూర్తిగా కనుమరుగయ్యాయి. అదే సమయంలో ప్రతి కూడలిలో కనిపించే ఎల్లో కలర్ పీసీవో కాయిన్ బూత్‌లు మూతపడ్డాయి. ఒక రూపాయి నాణెం వేసి ప్రియమైన వారితో మాట్లాడే ఆ సంస్కృతి మొబైల్ విప్లవం ముగింపు పలికింది.
2010-2015 సీడీలు, డీవీడీలు, కాగితపు టికెట్లు మాయం
ఇంటర్నెట్ వేగం పెరగడం, బ్రాడ్ బ్యాండ్ రాకో ఎంటర్‌టైన్‌మెంట్ రంగం పూర్తిగా మారిపోయింది. ఫ్యాక్స్ మెషిన్ల స్థానంలో ఈ మెయిళ్లు వచ్చాయి. ఒకప్పుడు అలమారలో జాగ్రత్తగా దాచుకునే సీడీలు, డీవీడీలు కలెక్షన్లు అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామలు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణాల విషయానికి వస్తే రైల్వే లేదా బస్ టికెట్ల కోసం క్యూలో నిలబడటం తగ్గిపోయింది. ఈ టికెట్లు మొబైల్‌లోకి వచ్చేశాయి.
2016-2025 నగదు రహితం డిజిట్ గ్యాలరీలు
యూపీఐ, డిజిటల్ చెల్లింపులు విప్లవం తర్వాత మన జేబుల్లో ఉండే పెద్ద పెద్ద వాలెట్లు మాయమైపోయాయి. పర్సుల్లో నోట్లు పెట్టుకునే అలవాటు తగ్గిపోయింది. చిల్లర సమస్య కూడా తీరిపోయింది. అలాగే ఇంట్లోని ఫొటో ఆల్బమ్‌ల స్థానాన్ని ఫోన్ గ్యాలరీలు, క్లౌడ్ స్టోరేజ్‌లు ఆక్రమించాయి. ప్రస్తుతం మనం 2025లో ఉన్నాం. ఇప్పుడు చేతి రాత నోట్లు, మాన్యువల్ అలారమ్ గడియారాలు, గోడ క్యాలెండర్లు కూడా అరుదైనవిగా మారిపోతున్నాయి.
ఈ పాతికేళ్ల మార్పులు మన జీవితాలను ఎంత సులభతరం చేశాయి. అనడంలో సందేహం లేదు. సమాచార మార్పిడి వేగవంతమైంది. సమయం ఆదా అయ్యింది. కానీ ఈ ప్రయాణంలో మనం కొన్ని విలువైన భావోద్వేగాలను కోల్పోయాం.
అమ్మ చేతిరాత: ఒకప్పుడు ఉత్తరంలో అమ్మ రాసిన అక్షరాలు చూస్తే కలిగే ఆనందం, ఇప్పుడు వాట్సాప్‌లో వచ్చే ఎమోజీలలో కనిపించడం లేదు.
ఎదురు చూపులు: పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూసే ఆ ఆత్రుత ఇప్పుడు ఇన్‌స్టెంట్ మెసేజ్‌ల యుగంలో మాయమైపోయింది.
సామాజిక అనుబంధం: ఒకప్పుడు కాయిన్ బూత్ దగ్గర్లో లేదా పోస్టు బాక్స్ దగ్గరో పలకరించుకునే మనుషులు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌లకే పరిమితమవుతున్నారు.
పాతికేళ్లలో వచ్చిన మార్పులు సహజమైన పరిణామ క్రమమే. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నప్పుడు పాత సాధనాలు కనుమరుగవ్వడం ఒక నిరంతర ప్రక్రియ. ఉదాహరణకు ఫ్లాపీ డిస్కుల స్థానంలో యూఎస్‌బీ డ్రైవ్‌లు, ఆపై క్లౌడ్ స్టోరేజ్ రావడం వల్ల డేటా భద్రత పెరిగింది. సీఆర్టీ టీవీల స్థానంలో వచ్చిన ఎల్‌ఈడీ టీవీలు విద్యుత్ ఆదా చేయడమే కాకుండా కంటికి తక్కువ హాని కలిగిస్తున్నాయి.
గత 25 ఏళ్లలో మనం కోల్పోయిన వస్తువులు కేవలం సామగ్రి మాత్రమే కాదు, అవి ఒక తరం జీవ విధానానికి ప్రతీకలు, 2000లో ఒక జీవితం ముగిస్తే, 2025 నాటికి మరో సరికొత్త డిజిటల్ జీవితం ప్రారంభమైంది. టెక్నాలజీ వేగంతో మనం ముందుకు సాగడం అవసరమే. కానీ ఆపాత వస్తువులతో కూడిన తీపి జ్ఞాపకాలు మాత్రం కాలాన్ని దాటి మనం మనస్సుల్లో నిలిచిపోతాయి.





















