Chiranjeevi - Venkatesh: చిరంజీవి కోసం వెంకటేష్ టైటిల్ త్యాగం... మూడు నేషనల్ అవార్డులు వచ్చిన ఆ సినిమా ఏదో తెలుసా?
Rudraveena Title Story: చిరంజీవి కెరీర్‌లో కల్ట్ క్లాసిక్ 'రుద్రవీణ'. ఆ సినిమా కోసం మొదట అనుకున్న టైటిల్ 'రుద్రవీణ' కాదు, విక్టరీ వెంకటేష్ కోసం ఫిక్స్ చేసిన టైటిల్‌తో చిరు ఎలా సినిమా చేశారంటే?

Tollywood Flashback: మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 'రుద్రవీణ' (Rudraveena Movie) ఓ స్పెషల్ ఫిల్మ్. మాస్ హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్న టైమ్‌లో తన ఇమేజ్‌ను పక్కన పెట్టి ప్రయోగాత్మకంగా మెగాస్టార్ చేసిన సినిమా ఇది. సూర్యం పాత్రలో చిరంజీవి అసమాన నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. మాస్ మాత్రమే కాదు... క్లాస్ రోల్స్‌లో కూడా చిరంజీవి అదరగొట్టగలడని 'రుద్రవీణ' నిరూపించింది.
'రుద్రవీణ'కు మూడు నేషనల్ అవార్డులు...
లెజెండరీ డైరెక్టర్ కే బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన 'రుద్రవీణ' సినిమాకు మూడు నేషనల్, నాలుగు నంది అవార్డులతో పాటు ఇంకా అనేక అవార్డులు రివార్డులు వచ్చాయి. ఈ సినిమాతో చిరంజీవి సోదరుడు నాగబాబు నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఆయన నిర్మించిన తొలి సినిమా ఇది. చిరంజీవి కెరీర్‌లో ఆల్ టైమ్ క్లాసిక్‌గా నిలిచిన 'రుద్రవీణ'కు మొదట అనుకున్న టైటిల్ వేరు. విక్టరీ వెంకటేష్ కోసం రిజిస్టర్ చేసిన 'రుద్రవీణ' టైటిల్‌తో చిరంజీవి ఈ సినిమా చేశారు.
వెంకటేష్ కోసం 'రుద్రవీణ' టైటిల్....
'కలియుగ పాండవులు' సినిమాతో తెలుగు తెరపైకి కథానాయకుడిగా అడుగు పెట్టారు విక్టరీ వెంకటేష్. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ దగ్గుబాటి హీరోకు ఆఫర్లు క్యూ కట్టాయి. టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అయినటువంటి కే మురారి హీరోగా వెంకటేష్ సెకండ్ మూవీ చేయాలని అనుకున్నారు. 'రుద్రవీణ' పేరుతో టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఆ సినిమాకు దర్శకుడిగా క్రాంతి కుమార్ ఫిక్స్ అయ్యారు. కథ కూడా సిద్ధమైందట. కానీ నిర్మాతతో దర్శకుడికి ఏర్పడిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా షూటింగ్ మొదలు కాకముందే సినిమా ఆగిపోయింది. దాంతో 'రుద్రవీణ' టైటిల్ అలా ఉండిపోయింది.
Also Read: Ravi Teja: రవితేజ, కృష్ణవంశీ కాంబోలో 'కందిరీగ' - ఆ సోషియా ఫాంటసీ మూవీ ఎందుకు ఆగిందో తెలుసా?
'రుద్రవీణ'గా మారిన 'బిలహరి'
వెంకటేష్ రెండో సినిమా ఆగిన సయమంలో చిరంజీవి, కే బాలచందర్ మూవీ షూటింగ్ మొదలైంది. గణేష్ పాత్రో అందించిన కథకు తగ్గ టైటిల్ కోసం మేకర్స్ మొదట చాలా ఆలోచించారట. తొలుత ఈ సినిమాకు 'బిలహరి' అనే టైటిల్‌ను అనుకున్నారు. కానీ ఆ టైటిల్ చిరంజీవితో పాటు బాలచందర్‌కు కూడా అంతగా నచ్చలేదట. మరో టైటిల్ కోసం వెతుకుతున్న టైమ్‌లోనే వెంకటేష్ 'రుద్రవీణ' గురించి చిరంజీవికి తెలిసిందట. దాంతో ఆ టైటిల్ నచ్చడంతో తనకు కావాలని వెంకటేష్‌తో పాటు నిర్మాత మురారిని అడిగారట చిరంజీవి. మెగాస్టార్ అడిగిన వెంటనే ఇద్దరూ టైటిల్ ఇవ్వడానికి అంగీకరించారు. అలా వెంకటేష్ కోసం రిజిస్టర్ చేయించిన టైటిల్‌తో చిరంజీవి 'రుద్రవీణ' చేశారు.
'రుద్రవీణ' సినిమా చిరంజీవికి అవార్డులు తెచ్చి పెట్టినా కమర్షియల్‌గా విజయాన్ని సాధించలేదు. దాదాపు 80 లక్షల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇరవై లక్షలలోపే కలెక్షన్స్ సాధించింది. భారీగా నష్టాలను మిగిల్చింది. కానీ ఎప్పటికీ మంచి సినిమా అనే పేరు తెచ్చింది.



















