Ravi Teja: రవితేజ, కృష్ణవంశీ కాంబోలో 'కందిరీగ' - ఆ సోషియా ఫాంటసీ మూవీ ఎందుకు ఆగిందో తెలుసా?
సింధూరం, ఖడ్గం తర్వాత హీరో రవితేజ, డైరెక్టర్ కృష్ణవంశీ కాంబినేషన్‌లో కందిరీగ పేరుతో ఓ సినిమా రావాల్సింది. ఈ సినిమా ఆగిపోవడంతో రవితేజ కోసం అనుకున్న టైటిల్‌తో రామ్ సినిమా చేసి హిట్టు కొట్టాడు.

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)కు క్రియేటివ్ జీనియస్, డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) హీరోగా లైఫ్ ఇచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తూనే జూనియర్ ఆర్టిస్ట్‌గా చిన్న చిన్న పాత్రలు చేస్తున్న రవితేజ... కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన 'సింధూరం' సినిమా (Sindhooram Movie)తో హీరోగా మారాడు. రవితేజ కెరీర్‌కు ఆ సినిమా ఓ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'ఖడ్గం'లో రవితేజ ఓ హీరోగా కనిపించాడు. సినిమాలే జీవితంగా బతికే యువకుడి పాత్రలో అసమాన నటనను కనబరిచాడు.
'సింధూరం', 'ఖడ్గం' తర్వాత 'కందిరీగ'
'సింధూరం', 'ఖడ్గం' తర్వాత రవితేజ, కృష్ణవంశీ కాంబినేషన్‌లో 'కందిరీగ' పేరుతో ఓ సోషియా ఫాంటసీ మూవీ రావాల్సింది. అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన తర్వాత క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆ సినిమా ఆగిపోయింది. కృష్ణవంశీ దర్శకత్వంలో 2009లో ఓ సినిమా చేయబోతున్నట్లు నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రకటించారు. రవితేజ హీరోగా నటిస్తున్న ఆ సినిమాకు 'కందిరీగ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
శ్రీకృష్ణదేవరాయల మునిమనవడిగా...
రవితేజ - కృష్ణవంశీల 'కందిరీగ' సినిమా కోసం హిస్టారికల్ ఎలిమెంట్స్‌కు సమకాలిన సమస్యను జోడించి పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను కృష్ణవంశీ రెడీ చేశారు.
'కందిరీగ' సినిమాలో శ్రీకృష్ణదేవరాయల ముని మనవడిగా రవితేజ కనిపించబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించారు. హీరోయిన్లుగా తమన్నాతో పాటు స్నేహా ఉల్లాల్‌ను ఫైనల్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కంప్లీట్ అయ్యాయి. కానీ కథ, క్యారెక్టరైజేషన్స్ విషయంలో రవితేజ, కృష్ణవంశీకి మధ్య ఏర్పడిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా షూటింగ్ మొదలుకాకముందే ఈ సినిమా ఆగిపోయింది. రవితేజ ప్లేస్‌లో మరో హీరోతో ఈ సినిమా చేయాలని కృష్ణవంశీ ప్రయత్నించారు. కానీ బడ్జెట్ పరమైన కారణాల వల్ల కుదరలేదు.
తర్వాత రామ్ పోతినేని హీరోగా...
రవితేజ చేయాల్సిన 'కందిరీగ' టైటిల్‌తో ఆ తర్వాత రామ్ పోతినేని సినిమా చేసి హిట్టు కొట్టాడు. కృష్ణవంశీ మూవీ ఆగిపోవడంతో ఇదే టైటిల్‌తో రామ్, సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్. కృష్ణవంశీ సోషియా ఫాంటసీ కథను పక్కనపెట్టి కమర్షియల్ లవ్‌స్టోరీగా రామ్ 'కందిరీగ' మూవీ రూపొందించారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి డైలాగ్స్ అందించారు. 2011లో రిలీజైన ఈ మూవీ రామ్ కెరర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది.























