Anil Ravipudi: ప్రతి శుక్రవారం అదే నా పని... సినిమా గురించి చదువుకోలేదు... ఇచ్చిపడేసిన అనిల్ రావిపూడి
Director Anil Ravipudi: సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై నెగిటివ్‌గా కామెంట్స్ చేసిన వారికి దర్శకుడు అనిల్ రావిపూడి ఇన్‌డైరెక్ట్‌గా ఇచ్చిపడేశారు. తాజాగా జరిగిన చిత్ర సక్సెస్ మీట్‌లో ఆయన ఏమన్నారంటే..

Director Anil Ravipudi Speech: ఈ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్నారు హిట్ మెషీన్ అనిల్ రావిపూడి. వరసగా ఆయనకు ఇది 8వ హిట్. ఇందులో వెంకీతోనే ఆయన మూడు హిట్స్ కొట్టారు. ఇక ఈ సినిమా సక్సెస్‌ని పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్‌లో ‘బ్లాక్‌బస్టర్ పొంగల్ జాతర’ పేరుతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి ఎమోషనల్ అయ్యారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాపై నెగిటివ్‌గా మాట్లాడిన వారికి, క్రింజ్ సీన్లు అని కామెంట్స్ చేసిన వారికి అనిల్ ఇచ్చిపడేశారు. ఆయన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ..
‘‘సినిమా రిలీజ్ అయ్యే ముందు వరకు.. సంక్రాంతికి వస్తున్నాం అనే టెన్షన్. సినిమా రిలీజ్ తర్వాత ఏందీ సినిమా అనే టెన్షన్ మొదలైంది. గత మూడు రోజులుగా మేము ఊహించిన దాని కంటే పెద్ద స్థాయికి ఈ సినిమాను తీసుకెళ్లిన ప్రేక్షకులందరికీ పాదాభివందనం. 8 సినిమాలు, 8 సక్సెస్ అని అంతా అంటున్నారు. ప్రేక్షకుల మద్దతు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. నేను మాములుగా సినిమా విడుదలైన తర్వాత బాబు మీ సినిమా హిట్టయిందని అంటారేమో అనుకున్నా.. కానీ బాహుబలి సినిమాలో రమ్యకృష్ణగారు అమరేంద్ర బాహుబలి అని పరిచయం చేసినట్లుగా.. ఈ సినిమాను అక్కడ నిలబెట్టారు.
ప్రమోషన్స్ విషయానికి వస్తే.. నాకు విజయాన్ని అందించే ప్రేక్షకుల కోసం, మా సినిమాకు డబ్బులు పెట్టి టికెట్ కొనే ప్రేక్షకుల కోసం.. ప్రతి ఇంటికి వెళ్లి ‘మా సినిమా చూడండి’ అని అడిగేందుకు కూడా రెడీ. అలాగే సినిమా రిలీజ్ తర్వాత వాళ్లు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకోవడానికి కూడా రెడీ. ప్రేక్షకుల పట్ల నాకు అంత గౌరవం ఉంది. వారు లేకుండా మేము లేము. ‘పటాస్’తో నన్ను నిలబెట్టింది కళ్యాణ్ రామ్‌గారైతే.. నన్ను మార్కెట్‌లోకి తీసుకెళ్లింది రాజుగారు, శిరీష్‌గారు. అక్కడి నుండి వాళ్లతో నా ప్రయాణం మొదలైంది. నా ప్రతి సినిమాకు వారి బాండింగ్ ఎక్కడో ఒక చోట ఉంటూనే ఉంది. ఈ బ్యానర్‌లోనే సినిమాలు చేయడానికి వాళ్లేం నన్ను కట్టేయలేదు. వారు నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఎస్‌విసి నాకు హోమ్ బ్యానర్. నా టీమ్ అందరూ నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ థ్యాంక్యూ.
Also Read: 'గేమ్ చేంజర్' పైరసీ ప్రింట్ కేసులో అరెస్టులు... 'ఏపీ లోకల్ టీవీ' ఆఫీసుపై పోలీస్ రైడ్
భాగ్యం పాత్రకి ఐశ్వర్య రాజేష్ తప్ప మరెవరూ చేయలేరు అన్నంతగా ఆమె అందరికీ ఈ సినిమాతో కనెక్ట్ అయింది. ఆమె కోసమే ఈ రోజు లేడీస్ అందరూ థియేటర్లకు వస్తున్నారు. తెలుగమ్మాయిగా ఆమె ఇంకా గొప్ప గొప్ప పాత్రలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీనాక్షి కూడా గ్లామర్, యాక్షన్‌తో ఇంతకు ముందు చేయని పాత్రలో చక్కగా చేసింది. కామిక్ టైమింగ్‌లోనూ ఐశ్వర్యకు పోటీగా అద్భుతంగా చేసింది. బుల్లిరాజు పాత్రని అద్భుతంగా చేశాడు. ఆ పాత్రకు ఆడియెన్స్ అందరూ బాగా కనెక్ట్ అవుతున్నారు. అయితే ఆ పాత్రతో బూతులు చెప్పించడం మా ఉద్దేశం కాదు. ఓటీటీలు వచ్చాక పిల్లల పరిస్థితి ఎలా ఉందనేది చెప్పడం కోసమే అలా ఆ పాత్రని డిజైన్ చేశాం. ప్రేక్షకులు ఆ పాత్రని స్పోర్టివ్‌గా తీసుకుని, చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. భీమ్స్ ఈ చిత్రానికి ప్రధాన పిల్లర్‌గా నిలిచారు. ఆయన స్వరపరిచిన ‘గోదారి గట్టు’ సాంగే మాకు స్ఫూర్తినిచ్చింది. ప్రతీ సాంగ్ అద్భుతంగా ఇచ్చాడు.
వెంకటేష్‌గారు ఇంతకు ముందు హీరోగా ఉండేవారు. ఒక అభిమానిగా ఆయనకోసం పనిచేశాను. ఈ సినిమాతో మా ఇద్దరి మధ్య ఒక బాండింగ్ ఏర్పడింది. మా జర్నీ ఇంకా ఇంకా ముందుకు వెళుతూనే ఉటుంది. ఆయన నాకు ఫ్రెండ్, గురువు, ఫ్యామిలీ మెంబర్‌గా మారిపోయారు. ఈ సినిమా ప్రమోషన్స్ నుండి సక్సెస్ వరకు నాకంటే ఎక్కువ ఎనర్జీతో ఆయన పనిచేశారు. ఆయన మద్దతు, ప్రెజన్స్, ఎనర్జీ లేకుండా ఈ సినిమా ఇంత దూరం వచ్చేది కాదు. అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా తనమీద సెటైర్ వేయించుకోవడానికి కూడా వెనుకాడలేదు. అంత ప్రాక్టికల్‌గా ఉండే మనిషి ఆయన. ఆయన సపోర్ట్‌ని ఎప్పటికీ మరిచిపోలేను.
ఇప్పటి వరకు నా గురించి నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం నాగురించి రెండు మాటలు మాట్లాడాలి. ఇప్పటి వరకు 8 సినిమాలు చేశాను. 8 సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఇందులో లాస్ట్ 5 సినిమాలు కంటిన్యూగా 100 కోట్ల క్లబ్‌లో నిలుస్తూ వస్తున్నాయి. లాస్ట్ 5 సినిమాలు కంటిన్యూగా యుఎస్‌లో 1 మిలియన్ గ్రాస్ సాధించాయి. ఒక దర్శకుడిగా ప్రేక్షకులకి ఎంత థ్యాంక్‌ఫుల్‌గా ఉండాలో అర్థం కావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ పాదాభివందనం చేస్తున్నాను. స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చాలా మంది స్టడీ చేసి ఉంటారు. చాలా మంది రివ్యూలలో స్క్రీన్‌ప్లే అంటూ ఏదేదో రాస్తుంటారు. నిజంగా నాకు అవన్నీ తెలియదు. నాకు ఒక సినిమా నచ్చితే.. ఒక ఆడియన్‌గా విజిల్ కొడతా, చప్పట్లు కొడతా. అదే నాకు తెలిసిన సినిమా. అదే తీస్తా. నేను చిన్నప్పటి నుండి చూసిన సినిమా ఇదే. నేను సినిమా గురించి పెద్దగా చదువుకోలేదు. థియేటర్‌లో ప్రేక్షకులు చప్పట్లు కొడుతుంటే.. నేను లేచి చప్పట్లు కొడతా. విజిలేస్తే.. నేనూ విజిలేస్తా. ఆ క్యారెక్టర్ నన్ను ఎమోషన్‌కి గురిచేస్తే.. ఎమోషన్ అవుతా. ప్రతి శుక్రవారం ఏ సినిమా రిలీజ్ అయినా.. థియేటర్‌లో ఉంటా. నాకంటే ఇంకొకరు బాగా తీస్తే నేర్చుకుంటా. నేను ఏమైనా తప్పులు చేస్తే సరిదిద్దుకుంటా. 8 సినిమాల జర్నీ ఇది.. ఇక ముందు కూడా ఇలాగే ఉంటది. మీడియా అంతా ఎంతో సపోర్ట్ ఇచ్చింది. ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ’’ అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.
Also Read: సైఫ్ అలీ ఖాన్ మీద ఎటాక్ జరుగుతుంటే కరీనా ఎక్కడ ఉంది? కత్తిపోట్ల నుంచి ఐసీయూలో సర్జరీ వరకు...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

