Janasena News: పేరు పార్టీది.. పదవి వేరొకరిది.. గోదావరి జిల్లా జనసేనలో వింత పరిస్థితి.!?
Andhra Pradesh News:కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కోసం శ్రమించాం.. కానీ ఇప్పడు ఆ స్థాయిలో తమకు పదవులు దక్కడం లేదని జనసేన క్యాడర్ అసంతృప్తిలో ఉంటుందుంటున్నారు ఆ పార్టీలోనే కొందరు.

Janasena News: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకత్వం అంతా నాయకులకు, కార్యకర్తలకు చెప్పింది ఒక్కటే.. అధినాయకత్వం పైన ఎలా ఐక్యంగా ఉంటుందో గ్రామస్థాయి కార్యకర్తల వరకు కలిసే ముందుకు నడవాలని ఆదేశించింది. కానీ ఇప్పడు టీడీపీ ప్రజాప్రతినిధులున్నచోట మాత్రం జనసేన నాయకులకు అన్యాయం జరుగుతుందని పెదవి విరుస్తున్నారట. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పదవులను భర్తీ చేస్తున్నారు. అయితే గోదావరి జిల్లాలో మాత్రం నివురుగప్పిన నిప్పులా అసంతృప్తి కనిపిస్తోందని మాటలు వినిపిస్తున్నాయి..
పేరుకే పార్టీ... పదవి మాత్రం వేరు.?
క్షేత్ర స్థాయిలో మాత్రం పేరు పార్టీది.. పదవి మాత్రం వేరొకరిది అన్న చందంగా మారిందని జనసేన పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పదవుల అభ్యర్థిత్వం జనసేన ప్రభావితం లేని గ్రామాల్లో కేటాయిస్తున్నారన్నది ఓ వాదన ఉంది. ఇదంతా కావాలనే చేస్తున్నారని జనసేన పార్టీలోని కొందరి వాదన. దీనికి బలం చేకూర్చే విధంగా ఇటీవల కేటాయించిన పదవుల్లో ఇదే తీరు కొనసాగుతోందంటున్నారు. పైగా జనసేన పేరు మీద టీడీపీ వారికే పదవులు కట్టబెడుతున్నారన్నది జనసేనలోని మరికొందరి వాదనగా వినిపిస్తోంది.. ముఖ్యంగా కోనసీమలోని పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఇదే జరిగిందని బాహాటంగా విమర్శిస్తున్నారు..
ఇటీవల ప్రకటించిన పదవుల్లో జరిగిందిదేనా..
కూటమి ప్రభుత్వ పాలనలో మండల స్థాయి, గ్రామస్థాయి పదవుల జాతర మొదలయ్యింది. దేవస్థానం కమిటీల నుంచి నీటి సంఘాలు, సహకార సంఘాల అధ్యక్షులు ఇలా అనేక విభాగాల్లో పదవుల పంపకం జరుగుతోంది. ఉదాహరణకు అమలాపురం నియోజకవర్గంలో పదవుల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు కొందరు జనసేన నాయకులు.. అల్లవరం మండలంలో రెండు నీటి సంఘం అధ్యక్షపదవులు కేటాయించగా వాటిలో ఒకటి బెండమూర్లంక, దేవగుప్తం కేటాయించారు. ఇందులో బెండమూర్లం టీడీపీ ఖాతాలో పడినట్లు అయ్యిందని అంటున్నారు. అమలాపురం వెంకటేశ్వరర స్వామి దేవస్థానంలో రెండు కేటాయించగా ఒక పదవి మాత్రం జనసైనికునికి ఇవ్వగా మరో పదవి మాత్రం జనసేన పార్టీలో ఏనాడూ పని చేసిన దాఖలాలు లేని వారికి దక్కిందంటున్నారు.
సహకార సంఘ ఎన్నికలకు సంబంధించిన అల్లవరం మండలంలో ౩ పదవులు జనసేనకు కేటాయించారు. ఈ పదవులు అన్నీ లోగడ టీడీపీలో ఉన్నవారికి, కనీసం జనసేన సభ్యత్వం లేని వారికి పదవి కట్టబెట్టారని విమర్శిస్తున్నారు. ఇక జనసేనకు పట్టులేని ప్రాంతాల్లో పదవులు కేటాయించడం వెనుక మర్మమేంటని ప్రశ్నిస్తున్నారు. మొగళ్లమూరు పీఏసీఎస్‌కు సంబంధించి జనసేనకు కేటాయించారు. ఈ సంఘ పరిధిలోని మొగళ్లమూరు, తూర్పులంక, రెల్లుగడ్డ, తుమ్మలపల్లి ఈ నాలుగు గ్రామాలు కూడా జనసేనకు పట్టులేని పరిస్థితి.
ఇదే తంతు నియోజకవర్గవ్యాప్తం ఉందని ఆరోపిస్తున్నారు. అల్లవరం మండల పరిస్థితి ఇలా ఉంటే ఇక అమలాపురం, రూరల్ మండలాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగిందని ఆరోపణలు చేస్తున్నారు పలువురు జనసైనికులు. ఇదే పరిస్థతి ముమ్మడివరం, రామచంద్రపురం, రాజమండ్రి సిటీ, రూరల్, కాకినాడ సిటీ ఇలా అనేక చోట్ల జరుగుందంటున్నారు..
Also Read: ఏపీకి వయసైపోతోంది. - కుర్రాడు చంద్రబాబు చెప్పేది కాస్త వినండి !
మాట్లాడే నాథుడు లేకనేనా..?
ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో జనసేన ఇంచార్జ్‌ల్లో తెలియని నిస్తేజం ఆవహించిన పరిస్థతి కనిపించిందని అంటున్నారు. అధికారిక కార్య్రకమాల్లో మొక్కుబడిగా పాల్గొంటుండగా పార్టీ కార్యక్రమాలకు అసలు నిర్వహించని పరిస్థతి కనిపిస్తోందంటున్నారు. ఇదిలా ఉంటే వీరి నిస్తేజంతో అడిగేవారు లేకపోతున్నారని, అందుకే నచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారని కొందరు జనసేన నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. దీనిపై మంత్రి, జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లిన పలువురు జనసేన నాయకులు అయినా ఫలితం లేదని పెదవి విరుస్తున్నారట..
నియోజకవర్గ నాథుడు లేక మరికొన్ని..?
అమలాపురం నియోజకవర్గంలో జనసేనకు ప్రస్తుతం ఇంచార్జ్ లేని పరిస్థితి. ఇంచార్జ్ స్థాయి నాయకులమని అమలాపురం పట్టణంలోని పలువురు ఎవరికివారుచెప్పుకుంటుండగా పదవుల కేటాయింపులో జరుగుతోన్న తీరుపై మాత్రం కనీసం ప్రశ్నిండచంలేదని మండిపడుతున్నారు. కూటమిలోని భాగస్వామ్యమై ఉన్నప్పటికీ దక్కాల్సిన వాటా, గౌరవంపై ఎందుకు మాట్లాడరు అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే నియోజకవర్కంలోని జనసేనలో అంతర్గత విభేదాలు నివురుగప్పి ఉండడంతోనే జరగాల్సిన నష్టం జరుగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద నియోజకవర్గంలో మాత్రం ఎవ్వరిని కదిపినా అసంతృప్తి చూపులే కనిపిస్తున్నాయన్నది స్పష్టం అవుతోంది..
Also Read: ఇంకా ఎన్నేళ్లు విచారిస్తారు- 3 వారాల్లో తేల్చేయండి- అధికారులపై పవన్ సీరియస్





















