Venkatesh Maha KGF controversy : వెంకటేష్ మహా ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఆయనకు అసలు పాయింట్ అర్థమవుతోందా?
commercial cinema vs art cinema : ప్రేక్షకులు ఏం చూడాలో? ఏం చూడకూడదో? చెప్పే హక్కు ఇక్కడ ఎవరికి ఉంది? ఓ సినిమాను చూడాలో? వద్దో? వాళ్ళ ఇష్టం! ఈ అంశంలో వెంకటేష్ మహా ఓ లాజిక్ మిస్ అయినట్లు కనబడుతోంది.
గుర్రాన్ని బావి దగ్గరకు తీసుకు వెళ్ళగలం తప్ప నీళ్లు తాగించలేం - పెద్దలు చెప్పే మాట! ఎప్పట్నుంచో వాడుకలో ఉన్న సామెత! ప్రేక్షకులు, సినిమాల మధ్య ఉన్న సంబంధం కూడా అటువంటిదే. సినిమాలు తీసిన తర్వాత ప్రేక్షకుల ముందుకు వాటిని దర్శక - నిర్మాతలు తీసుకు వెళ్ళగలరు తప్ప బలవంతంగా థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెట్టలేరు. ఈ చిన్న లాజిక్ యువ దర్శకుడు వెంకటేష్ మహా (Venkatesh Maha) ఎలా మిస్ అయ్యారో మరి!?
'అడవి రాముడు' చూసిన తెలుగు ప్రేక్షకులే 'శంకరాభరణం' సినిమా చూశారు. 'లవ కుశ' చిత్రాన్ని ఆదరదించారు. కళా తపస్వి కె. విశ్వనాథ్, బాపు రమణలు తీసిన దృశ్య కావ్యాలు మెచ్చి భారీ వసూళ్లు అందించారు. ఆ మాటకు వస్తే... కమర్షియల్ పంథాలో తీసిన ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ బరిలో బోల్తా కొట్టలేదు!? డబ్బులు ఊరికే రావు! ఏ సినిమాకు అయినా సరే కోట్లకు కోట్ల రూపాయల వసూళ్లు ఊరికే వచ్చి పడవు. వందల కోట్లు, ఓ సినిమా వెయ్యి కోట్లు వసూలు చేసిందంటే... ఆ సినిమాను చూడటానికి ఎంత మంది థియేటర్లకు వచ్చి ఉండాలి? బలవంతంగా వాళ్ళను ఎవరూ తీసుకొచ్చి థియేటర్లలో కూర్చోబెట్టరు కదా! ప్రేక్షకుడికి నచ్చితేనే థియేటర్లకు వస్తాడు. ప్రేక్షకులకు ఫలానా సినిమా నచ్చుతుందని రూల్ ఏమీ లేదు. ఒకవేళ ఆ కిటుకు తెలిస్తే అందరూ అటువంటి సినిమాలే తీస్తారుగా!
ప్రేక్షకుల నాడి పట్టుకోవడం అంత సులభం కాదనే ఆలోచన తనను తానూ మేధావిగా, గొప్ప సినిమాలు (రెండిటిలో ఒకటి రీమేక్, మరొక సినిమా స్క్రీన్ ప్లే కొరియన్ సినిమా నుంచి కాపీ అని ఆరోపణలు ఉన్నాయి) తీసిన దర్శకుడిగా చెప్పుకొంటున్న వెంకటేష్ మహాకు ఎందుకు తట్టలేదో?
విశ్వనాథ్, బాపు సినిమాలు కొన్ని సరిగా ఆడలేదు. 'ఆపద్భాందవుడు' సినిమాతో హీరోగా చిరంజీవి, నిర్మాతగా ఆయన సోదరుడు నాగబాబు నష్టాలు చవి చూశారు. త్రివిక్రమ్ తీసిన 'అతడు', 'ఖలేజా' సినిమాలను థియేటర్లలో కంటే యూట్యూబ్, ఓటీటీ, టీవీల్లో ఎక్కువ మంది చూశారు. అలాగని, వాళ్ళు ఎప్పుడూ తాము గొప్ప సినిమాలు తీస్తే ప్రేక్షకులు చూడలేదని విమర్శించలేదు. కమర్షియల్ సినిమాను తక్కువ చేసి చూడలేదు. వరుస ఫ్లాపుల్లో ఉన్న అక్షయ్ కుమార్, తప్పు ఎక్కడ జరుగుతుందో సరిచేసుకుంటానని చెప్పారు గానీ ప్రేక్షకులను తప్పు పట్టలేదు. 'లాల్ సింగ్ చద్దా' తర్వాత ఆమిర్ బ్రేక్ తీసుకున్నారు తప్ప ఏమీ అనలేదు. ఫ్లాప్స్ రావడంతో 'పఠాన్'కు ముందు షారుఖ్ ఖాన్ సైతం బ్రేక్ తీసుకున్నారు గానీ... అభిమానులు, ప్రేక్షకులను ఏమీ అనలేదు.
'ఆనంద్' సినిమాకు ముందు శేఖర్ కమ్ముల ఎంత మందికి తెలుసు? చిరంజీవి 'శంకర్ దాదా ఎంబిబిఎస్'కు పోటీగా తన సినిమాను విడుదల చేశారు. ఆ సినిమా ఆడలేదా? స్టార్ హీరోల సినిమాలకు పోటీగా వచ్చిన చిన్న సినిమాలు విజయాలు సాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. స్టార్ హీరోల తాకిడికి మంచి సినిమాలు కొన్ని ప్రేక్షకులకు తెలియకుండా పోయిన ఉదాహరణలూ ఉన్నాయి. సినిమాలో నటించినది అగ్ర హీరోనా? చిన్న హీరోనా? అది పాప్ కార్న్ సినిమానా? విలువలు ఉన్న సినిమానా? అనేది ప్రేక్షకుడికి అనవసరం. థియేటర్లకు వెళ్లిన వాళ్ళకు నచ్చిందా? లేదా? అనేది మాత్రమే ముఖ్యం. 'బాహుబలి', 'కెజియఫ్', 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప' చూసిన ప్రేక్షకులే 'సీతారామం', 'బలగం' సినిమాలను ఆదరించారు. 'జాతి రత్నాలు' సినిమాను థియేటర్లలో చూసిన ప్రేక్షకులు 'ఆహా ఓహో అద్భుతం' అంటే ఓటీటీలో చూసిన వాళ్ళు విమర్శలు చేశారు. అలాగని, ఓటీటీలో చూసిన వాళ్ళది తప్పు అంటే ఎలా!?
ప్రేక్షకులు మెచ్చిన సినిమాను విమర్శించడం ఒక విధంగా వాళ్ళ అభిరుచిని విమర్శించడమే. ఓ నెటిజన్ అయితే దర్శకురాలు నందినీ రెడ్డితో తమను అవమానించారని అడిగారు. ఆవిడ సారీ చెప్పారనుకోండి! కల్పిత పాత్రను విమర్శిస్తే... తనను విమర్శిస్తున్నారని వెంకటేష్ మహా కొత్త లాజిక్ తీశారు. ఇక్కడ క్వశ్చన్ క్యారెక్టర్ కల్పితమా? నిజమా? అన్నది కాదు. ఆడియన్ ఎమోషన్!
Also Read : 'కెజియఫ్' మీద కామెంట్స్‌పై వెనక్కి తగ్గని వెంకటేష్ మహా - మంట మీద పెట్రోల్ పోశారా?
రాఖీ భాయ్ క్యారెక్టర్, 'కెజియఫ్' సినిమా ప్రేక్షకులకు ఎమోషన్. వాళ్ళ ఎమోషన్ మీద వెంకటేష్ మహా కామెడీ చేశారు కాబట్టి ఈస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆయనతో పాటు అక్కడ కూర్చున్న దర్శకులపై వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ప్రేక్షకుల మనోభావాలు గౌరవించడం సినిమా ప్రముఖుల విధి. దాన్ని పక్కన పెట్టి సరిగా అర్థం చేసుకోలేదంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం వల్ల మళ్ళీ విమర్శల పాలు కావడం తప్ప ఇంకొకటి లేదు.
వెంకటేష్ మహాను, ఆయన సినిమాలను అభిమానించే ప్రేక్షకులు ఉన్నట్టు... 'కెజియఫ్'ను, కమర్షియల్ సినిమాను అభిమానించే ప్రేక్షకులు ఉంటారుగా! తన అభిప్రాయం తప్పు కాదు గానీ, వాడిన భాష సరిగా లేదని స్వయంగా వెంకటేష్ మహా ఒప్పుకొన్నారు. ఆ అభిమానుల భాష సరిగా లేదేమో!? తమ అభిప్రాయం తప్పు కాదని ప్రేక్షకులు వాదిస్తే? మన ఒక వేలు చూపిస్తే, నాలుగు వేళ్ళు మన వైపు చూపిస్తాయి. ఇప్పుడు జరిగింది అదే! వెంకటేష్ మహా తన అభిప్రాయం వ్యక్తం చేయడంలో తప్పు లేదు. ఆయన వాడిన భాష, హావభావాలు అభ్యంతరకరంగా ఉన్నాయి. అందువల్ల, ఎవరూ ఊహించని స్థాయిలో వ్యతిరేకత వచ్చింది.
కమర్షియల్ సినిమా, క్లాస్ సినిమా అనే తేడాలు లేవు. ఎక్కువ మంది ప్రేక్షకులకు నచ్చిన సినిమా కమర్షియల్ సినిమా. అంతే! అందులో సందేహాలు అవసరం లేదు. ఇది అర్థం చేసుకున్న రోజు వెంకటేష్ మహా పేరు ఇటువంటి వివాదాల్లో వినిపించే అవకాశం లేదు. కమర్షియల్ సినిమా తీసి హిట్టు కొట్టమని ప్రేక్షకులు ఆయనకు సవాళ్ళు విసురుతున్నారు. మరి, ఆయన స్వీకరిస్తారా? అందుకు సిద్ధంగా ఉన్నారా?
Also Read : ఇంకో జన్మంటూ ఉంటే మళ్ళీ ఎన్టీఆర్‌గానే పుట్టాలని - అమెరికాలో యంగ్ టైగర్ ఎమోషనల్ స్పీచ్