Telangana Latest News: కేసీఆర్ రూ.57 లక్షలు జీతం తీసుకున్నారు- కుటుంబ సభ్యులతోనే ఆయనకు ప్రాణహాని: సీఎం రేవంత్‌రెడ్డి
Telangana Latest News: కేసీఆర్ సెక్యూరిటీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యుల నుంచే ప్రాణ హాని ఉందని ఆరోపించారు.

Telangana Latest News: తెలంగాణ ఉభయ సభల్లో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన ఆయన మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ విధానాలపై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌కు సొంత కుటుంబ సభ్యుల నుంచే ప్రాణ హాని ఉందని ఆరోపించారు. ఆయన సభకు రెండురోజులే హాజరైనా ఇప్పటి వరకు లక్షల్లో జీతం తీసుకున్నారని సభకు వివరించారు.
శాసనసభకు వచ్చి కేసీఆర్ లాంటి సీనియర్ వ్యక్తి సలహా ఇస్తే తీసుకునేందుకు తాము సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్నిసార్లు పిలుస్తున్నా ఆయన మాత్రం సభకు రావడం లేదని వాపోయారు. శాసన సభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని గతంలో సుప్రీంకోర్టు చెప్పందని రేవంత్ తెలిపారు.
కొత్త ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అవుతున్నా కేసీఆర్ మాత్రం శాసనసభకు కేవలం రెండే రెండుసార్లు వచ్చారని అన్నారు రేవంత్. కానీ ఎమ్మెల్యేలగా, ప్రతిపక్ష నేతగా ఆయన ఇప్పటి వరకు 57,84,124 రూపాయల జీతం తీసుకున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా కేసీఆర్ పర్యటించడం లేదని ప్రజా సమస్యల గురించి సభలో ప్రస్తావించిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. ప్రైవేటు కంపెనీ ఉద్యోగులకు కరోనా టైంలో వర్క్‌ఫ్రమ్ హోం ఉండేదని ఇప్పుడు వాళ్లకి కూడా ఆ ఫెసిలిటీ లేదని అన్నారు. రాజకీయాల్లో ఈ సౌకర్యం వచ్చిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ప్రజల సంపదను జీతభత్యాలుగా తీసుకుంటున్న కేసీఆర్ సభకు రాకుండా ప్రజలను వారి ఖర్మకు వదిలేశారని ఆరోపించారు రేవంత్. ఆయన ట్రైనింగ్‌లో వచ్చిన బీఆర్‌ఎస్ నేతలు రేబిస్ వ్యాక్సిన్ వికటించినట్లుగా ప్రవర్తిస్తున్నారని కామెంట్స్ చేశారు. వీళ్లు ఇలానే వ్యవహరిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుండు సున్నా ఖాయమని హెచ్చరించారు.
ఈ టైంలో కేసీఆర్ ఫ్యామిలీపై మరో సంచలన ఆరోపణ చేశారు రేవంత్. కేసీఆర్‌కు కుటుంబ సభ్యుల నుంచే ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే పోలీసు సెక్యూరిటీ మధ్యలో కుటుంబానికి దూరంగా ఫామ్‌హౌస్‌లో ఉంటున్నారని చెప్పుకొచ్చారు.
కృష్ణానదిపై ప్రాజెక్టుల మొత్తం వివరాలపై తాము చర్చకు సిద్ధమని కేసీఆర్ ఎప్పుడు వచ్చినా తాము రెడీ న్నారు రేవంతత్. ఎవరి హయాంలో ఏ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయో పూర్తి అయ్యాయో ఎవరి వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందో మాట్లాడాదామన్నారు. తన వాదన వీగిపోతే కచ్చితంగా కేసీఆర్‌కు బీఆర్‌ఎస్ సభ్యులకు క్షమాపణలు చెబుతానని ప్రకటించారు. కాంట్రాక్టర్లకు, స్నేహితుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ తాకట్టు పెట్టి తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాశారని మండిపడ్డారు. ఇవన్నీ బయటపడతాయనే సభకు రాకుండా మొహం చాటేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎక్కడా కులానికి స్టేచర్ ఉండదని రేవంత్ తెలిపారు. పదవికి మాత్రమే స్టేచర్ ఉంటుందన్నారు. ఇకపై ఫామ్‌హౌస్‌లలో డ్రగ్స్ పార్టీలు సాగనివ్వబోమన్నారు. పనిలో పనిగా నిర్మాత కేదార్ మృతిపై కూడా రేవంత్ మాట్లాడారు. నిర్మాత కేదార్ మృతి విషయంలో దుబాయ్‌లో ఏం జరిగిందో కూడా వివరాలు తెప్పించుకుంటున్నామని సభకు తెలిపారు. ఆ నాయకులు సభకు వచ్చిన తర్వాత అన్నీ బయటకు వస్తాయని వివరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

