Viveka Murder Case: వివేకా హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయించండి- గవర్నర్ ను కోరిన కుమార్తె సునీత
Andhra Pradesh News | మా నాన్నను చంపిన హంతకులపై దర్యాప్తును వేగవంతం చేయించండి అని ఏపీ గవర్నర్ ను వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత కోరారు.

Andhra Pradesh News | దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆరేళ్లు పూర్తయినా ఇప్పటికీ హంతకులకు శిక్ష పడలేదంటూ ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేశారు డాక్టర్ వైయస్ సునీత రెడ్డి. తన తండ్రి హత్య కేసులో ఒక్కరు తప్ప మిగిలిన నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారని ఒకరి తర్వాత ఒకరుగా సాక్షులు వరుసగా చనిపోతున్నారు. దీనిపై దర్యాప్తు ఎందుకు ఆగిపోయిందో అర్థం కావడం లేదు అంటూ వైఎస్ సునీత అన్నారు. విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి ఈ ఆరేళ్లలో జరిగిన పరిణామాలు గురించి ఆయనకు వివరించారు.
తండ్రి సమాధి వద్ద నివాళులు
అంతకుముందు పులివెందులలోని సమాధుల తోటలో ఉన్న తన తండ్రి వివేకా స్మృతి వద్ద ఆయనకు నివాళులర్పించారు సునీత. తన తండ్రి హత్య లో నిందితులు దర్జాగా బయట తిరుగుతుంటే బాధితులమైన తాము శిక్ష అనుభవిస్తున్నామని బాధపడ్డారు. గత ప్రభుత్వంలో ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరిగాయని శక్తివంతమైన నిందితులకు చట్టం నుంచి తప్పించుకునే మార్గాలు తెలుసేమో అంటూ తన నిరాశను తెలిపారు. ఆ తర్వాత విజయవాడలో గవర్నర్ ను కలిసిన ఆమె కర్నూలులో గత ప్రభుత్వ హయాంలో లో అవినాష్ రెడ్డి ని అరెస్ట్ చేయడానికి సిబీఐ వెళ్లినప్పుడు జరిగిన సంఘటనలను గురించి వివరించారు. ఈ కేసులో వరుసగా చనిపోతున్న సాక్షులు మరణాల గురించి కూడా ఆందోళన వ్యక్తం చేసి సాక్షులను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. తన తండ్రి హత్య కేసులో హంతకులకు శిక్ష పడేంత వరకు తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందబి ఆమె అన్నారు. మరోవైపు ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేసే కుట్ర కూడా జరుగుతుందని ఆమె ఆరోపించారు. ఈ పర్యటనలో ఆమెతోపాటు ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు.
హత్య జరిగి ఆరేళ్లు
2019 మార్చి 25న అంటే ఆరేళ్ళ క్రితం పులివెందులలోని తన సొంత ఇంట్లోనే వైయస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. మొదట్లో రక్తపు వాంతులు చేసుకొని ఆయన చనిపోయారంటూ ప్రచారం జరిగినా చివరికి అది హత్యని తేలింది. కేసు విచారణను సిబిఐ కు అప్పజెప్పింది హై కోర్టు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దర్యాప్తు వేగవంతం జరిగేలా చూడాలంటూ సునీత ప్రభుత్వ పెద్దలను కూడా కలిశారు. అయితే ఈ రోజు ఏపీ గవర్నర్ నజీర్ ను కలిసిన ఆమె దర్యాప్తు నత్తనడక గా సాగిందని దీన్ని తిరిగి ప్రారంభించేలా చొరవ తీసుకోవాలని కోరారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

