WPL Winner Mumbai Indians: హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ముంబైని గెలిపించిన బౌలర్లు.. రెండోసారి డబ్ల్యూపీఎల్ టైటిల్ కైవసం.. 8 రన్స్ తో ఢిల్లీ చిత్తు
అనుకున్నట్లుగానే మరోసారి ఫైనల్లో ఢిల్లీ ఓడిపోయింది. సాధారణ టార్గెట్ ను కూడా ఛేదించలేక పోయింది. ముంబై రెండోసారి డబ్ల్యూపీఎల్ టైటిల్ ను సాధించింది. 2023లో ముంబై.. ఢిల్లీని ఓడించి విన్నర్ అయింది.

WPL MI Vs DC Final Result Update: ముంబై ఇండియన్స్ అద్భుతం చేసింది. డబ్ల్యూపీఎల్ లో రెండోసారి విజేతగా నిలిచింది. శనివారం ముంబైలోని బ్రౌబర్న్ స్టేడియంలో జరిగిన పైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 8 పరుగులతో విజయం సాధించింది. మంచి జోష్ మీద ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 149 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్ సింగ్ ఫ్యాబ్యులస్ ఫిఫ్టీ (44 బంతుల్లో 66, 9 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడింది. బౌలర్లలో మారిజానే కాప్, జెస్ జొనసెన్, శ్రీ చరణిలకు తలో రెండు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో ఓవర్లన్నీ ఆడి తొమ్మిది వికెట్లకు 141 పరుగులు చేసింది. కాప్ (26 బంతుల్లో 40, 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచింది. నాట్ స్కివర్ బ్రంట్ ఆల్ రౌండ్ షో (30, 3/30)తో సత్తా చాటింది. ఈ విజయంతో 2023 తర్వాత మరోసారి చాంపియన్ గా ముంబై నిలిచింది. ఇక టోర్నీలో వరుసగా మూడుసార్లు ఫైనల్ కి చేరినా, ఢిల్లీకి పరాజయమే ఎదురైంది. ఈ లీగ్ మొత్తంలో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రెండు ముంబై ప్లేయర్లే వద్దే ఉండటం విశేషం. ఆరెంజ్ క్యాప్ ను బ్రంట్, పర్పుల్ క్యాప్ ను అమెలియా కెర్ సాధించింది.
🏆 Mumbai Indians - #𝗧𝗔𝗧𝗔𝗪𝗣𝗟 𝟮𝟬𝟮𝟱 𝗖. 𝗛. 𝗔. 𝗠. 𝗣. 𝗜. 𝗢. 𝗡. 𝗦 🏆
— Women's Premier League (WPL) (@wplt20) March 15, 2025
Scorecard ▶ https://t.co/2dFmlnwxVj #DCvMI | #Final | @mipaltan pic.twitter.com/JOV98PFNwq
ఆదుకున్న హర్మన్-బ్రంట్ జోడీ..
నిజానికి ఫస్ట్ బ్యాటింగ్ లో పవర్ ప్లే ముంబై పాలిట హర్రర్ గా మారింది. ఓపెనర్లు హెలీ మథ్యూస్ (8), యస్తికా భాటియా (8) త్వరగా ఔటవడంతో హర్మన్, బ్రంట్ జోడీ నెమ్మదిగా ఆడింది. దీంతో పవర్ ప్లేలో కేవలం 20 పరుగులు మాత్రమే ముంబై సాధించింది. ఆ తర్వాత నెమ్మదిగా జోరు పెంచిన వీరిద్దరూ పరుగులు సాధించి, స్కోరు బోర్డును పరుగులెత్తించారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 89 పరుగులు జోడించడంతో ముంబై భారీ స్కోరు చేస్తుందనిపించింది. ఈ జోరులో బ్రంట్ టోర్నీలో వెయ్యి పరుగులను పూర్తి చేసుకుంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచింది. అలాగే ఈ సీజన్ లో 500 పరుగుల మార్కును దాటిన తొలి ప్లేయర్ గా రికార్డులకెక్కింది. డ్రింక్స్ బ్రేక్ తర్వాత బ్రంట్ ఔటవడంతో ఒక్కసారిగా కథ మారిపోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో ముంబై సాధారణ స్కోరుకే పరిమితమైంది. మిగతా బౌలర్లలో సదర్లాండ్ కు ఒక వికెట్ దక్కింది.
విఫలమైన బ్యాటర్లు..
బ్యాటింగ్ కు అనుకూలించిన పిచ్ పై సాధారణ టార్గెట్ ను కూడా ఢిల్లీ బ్యాటర్లు ఛేదించలేకపోయారు. అనవసర ఒత్తిడికి గురై వికెట్లు పారేసుకున్నారు. ముఖ్యంగా ఓపెనర్లు కెప్టెన్ మెగ్ ల్యానింగ్ (13), షెఫాలీ వర్మ (4) త్వరగా ఔటవడంతో ఆరంభంలోనే ఒత్తిడిలో పడిపోయారు. మధ్యలో జెమీమా రోడ్రిగ్స్ (30), కాప్ కాస్తా పోరాడినా జట్టును విజయతీరాలకు చేర్చలేక పోయారు. హర్మన్ తెలివిగా స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించి, అనుకున్న ఫలితాన్ని సాధించింది. ఆరంభం నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, పరుగులను నిరోధించడంతో ఒత్తిడిలోకి పడిపోయిన ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో వరుసగా మూడో ఫైనల్లో పరాజయం పాలయ్యారు. లీగ్ దశలో ముంబైని రెండుసార్లు చిత్తు చేసిన ఢిల్లీ.. ఫైనల్లో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేక పోయారు. మిగతా బౌలర్లలో అమెలియా కెర్ కు రెండు, షబ్నిం ఇస్మాయిల్, హేలీ, సౌకా ఇషాక్ కు తలో వికెట్ లభించింది.




















