Mohanlal: మోహన్ లాల్ రీమేకు, తెలుగులో హిట్టు - చిరు, వెంకీ కంటే మోహన్ బాబు, నాగార్జునే ఎక్కువ చేశారుగా
MohanLal Birthday Special: కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ పుట్టినరోజు (మే 21న ఆయన జన్మించారు) సందర్భంగా ఆయన మలయాళ సినిమాలను తెలుగులో ఏయే హీరోలు రీమేక్ చేశారు? అవి ఏమిటి? అనేది చూద్దామా!

MohanLal Movies Remade In Telugu: మోహన్ లాల్ మలయాళ హీరో. కానీ, తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. కంప్లీట్ యాక్టర్ హీరోగా నటించిన మలయాళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయినవీ, భారీ విజయాలు సాధించినవీ చాలా ఉన్నాయి. ఇప్పుడు అంటే డబ్బింగ్ / పాన్ ఇండియా ట్రెండ్ ఎక్కువగా ఉంది కానీ ఒకప్పుడు ఆయన సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి.
Telugu Remakes Of Mohanlal Movies: మోహన్ లాల్ మలయాళ హిట్ 'లూసిఫర్'ను తెలుగులో 'గాడ్ ఫాదర్'గా రీమేక్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. 'దృశ్యం'ను వెంకటేష్ అదే పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలకు ముందు టాలీవుడ్ హీరోల్లో ఎవరెవరు ఏయే మోహన్ లాల్ సినిమాలు రీమేక్ చేశారో తెలుసా? ఆ మూవీస్ మీద ఒక లుక్ వేయండి.
- శ్రీకాంత్, ప్రభుదేవా హీరోలుగా నటించిన 'ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి' (2004) సినిమా తెలుసుగా! అది మోహన్ లాల్, శంకర్ హీరోలుగా ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన సినిమా 'పూచైక్కోరు ముక్కుతి' (1984)కి రీమేక్.
- ఈవీవీ దర్శకత్వంలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ హీరోలుగా నటించిన సినిమా 'చిలక్కొట్టుడు' (1997). మోహన్ లాల్, ప్రియదర్శన్ కలయికలో వచ్చిన మలయాళ సినిమా 'బోయింగ్ బోయింగ్' (1985)కు అది రీమేక్.
- రాజేంద్ర ప్రసాద్, సుమలత జంటగా నటించిన సినిమా 'దొంగ కోళ్లు' (1988). ఇదీ మోహన్ లాల్ సినిమా రీమేకే. ఆయన 1986లో నటించిన 'Sanmanassullavarkku Samadhanam'ను తెలుగులో తీశారు.
- రాజేంద్ర ప్రసాద్, జయసుధ జంటగా నటించిన 'గాంధీనగర్ రెండో వీధి' (1987) సినిమా ఉంది కదా! 'గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్' (1986)కు అది రీమేక్. మోహన్ లాల్ హీరోగా ప్రియదర్శన్ తెరకెక్కించిన చిత్రమది.
- మోహన్ బాబు, కె రాఘవేంద్రరావుది సూపర్ హిట్ కాంబినేషన్. వాళ్లిద్దరూ చేసిన సినిమాల్లో 'అల్లుడు గారు' (1990) ఒకటి. మోహన్ లాల్, ప్రియదర్శన్ కలయికలో వచ్చిన 1988 సినిమా 'చిత్రం'కు అది రీమేక్. మలయాళంలో రజిని హీరోయిన్ అయితే తెలుగులో శోభన హీరోయిన్.
- మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన 'తప్పు చేసి పప్పు కూడా' (2002) కూడా మోహన్ లాల్ సినిమా రీమేకే. శ్రీకాంత్ మరో హీరోగా నటించిన ఈ సినిమా మలయాళంలో మోహన్ లాల్, ముఖేష్ నటించిన 'కుక్కకుయిల్' (2001) ఆధారంగా తెరకెక్కింది.
- మోహన్ లాల్ మలయాళ సినిమాలను తెలుగులో ఎక్కువ రీమేక్ చేసినది మోహన్ బాబు అని చెప్పాలేమో! 'కుంతీ పుత్రుడు' (1993)కు 'దేవాసురం' ఆధారం కాగా... 'అధిపతి' (2001)కి 'నరసింహం' (2000) స్ఫూర్తి. మలయాళంలో మమ్ముట్టి అతిథి పాత్ర చేయగా... తెలుగు రీమేక్ 'అధిపతి'లో ఆ పాత్రను నాగార్జున చేశారు.
- మోహన్ లాల్, రామకృష్ణ జంటగా ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన సినిమా 'ఆర్యన్' (1988). తెలుగులో బాలకృష్ణ, భానుప్రియ జంటగా ఎస్ఎస్ రవిచంద్ర ఆ సినిమాను 'అశోక చక్రవర్తి' (1989) పేరుతో రీమేక్ చేశారు.
Also Read: ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ 5 బెస్ట్ లుక్స్ - ఆ మేకోవర్, స్టైలింగుకు విమర్శకుల నోళ్లూ మూతపడ్డాయంతే!
- కింగ్ నాగార్జున సోలో హీరోగా కూడా తెలుగులో మోహన్ లాల్ సినిమాలను రీమేక్ చేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆయన నటించిన 'వజ్రం'కు ఆధారం మోహన్ లాల్ మలయాళ సినిమా 'స్పదికం' (1995). కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున నటించిన 'చంద్రలేఖ' అదే పేరుతో మలయాళంలో మోహన్ లాల్ నటించిన సినిమా స్ఫూర్తితో తెరకెక్కింది.
- నాగార్జున, అమల జంటగా నటించిన 'నిర్ణయం' సినిమా ఉందిగా! అది కూడా మోహన్ లాల్ సినిమాకు రీమేక్. మలయాళంలో ప్రియదర్శన్ తీసిన 'వందనం' తెలుగులో 'నిర్ణయం'గా వచ్చింది. తెలుగు సినిమాకూ ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు.
- రాజశేఖర్ హీరోగా కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించిన 'రౌడీయిజం నచ్చేసింది' (1990) కూడా మోహన్ లాల్ సినిమా రీమేక్. ఆ మూవీకి 'కిరీదం' (1989) ఆధారం.
- 'రౌడీయిజం నచ్చేసింది' విడుదలైన పదహారేళ్లకు మరో మోహన్ లాల్ మలయాళ చిత్రాన్ని రాజశేఖర్ రీమేక్ చేశారు. 'రాజబాబు' (2006) సినిమా ఉందిగా! అది 'బాలెట్టన్' (2003)కు రీమేక్.
- సురేష్, మీనా జంటగా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన 'అల్లరి పిల్ల' (1992) మూవీ మోహన్ లాల్, రేవతి జంటగా ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన 'కిలుక్కమ్' (1991)కి రీమేక్.
Also Read: 'దేవర'కు ముందు ఓ లెక్క, ఇప్పుడో లెక్క - బాక్సాఫీస్‌ను తొక్కుకుంటూ పోవాలే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

