BCCI Vs Team India: కుటుంబ సభ్యులను కలిసేందుకు టీమిండియా ప్లేయర్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ ఒక మెలిక పెట్టిన బీసీసీఐ
BCCI 10 Points Rule: ఆటగాళ్లకు తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ఒక అవకాశం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి ఒక మెలిక పెట్టినట్లు తెలుస్తోంది.

ICC Champions Trophy News: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి పర్యటనలో ఉన్న భారత క్రికెటర్లకు శుభవార్త. ఈ టూర్లో తమ భార్యలు, కుటుంబ సభ్యులను అనుమతించేందుకు వెసులుబాటు కలిపించినట్లు సమాచారం. తాజా కథనాల ప్రకారం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆటగాళ్లకు తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ఒక అవకాశం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి ఒక మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. టోర్నీలో భాగంగా ఏదో ఒక మ్యాచ్ కు మాత్రం తమ కుటుంబ సభ్యులకు ఎంట్రీ ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. ఇదే విషయాన్ని ఆటగాళ్లకు చేరవేసి, ఆ ఒక్క మ్యాచ్ ఏంటనేది చెప్పాలని బోర్డు అడిగిందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, బోర్డు వర్గాల్లో మాత్రం దీనిపై చర్చ జరుగుతోంది. ప్లేయర్ల నుంచి ప్రతిపాదన వచ్చాక, ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది. తాజా ఘటనపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. నిబంధనలను రూపొందించి, వాటిని సడలించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
బీసీసీఐ యూటర్న్:
గతేడాది ఆస్ట్రేలియా పర్యటన, అంతకుముందు జరిగిన న్యూజిలాండ్ తో సొంతగడ్డపై టెస్టు సిరీస్ లో భారత్ పేలవ ప్రదర్శన చేసింది. దీనిపై ఆగ్రహించిన బోర్డు పది పాయింట్ల రూల్ తో కఠిన నిబంధనలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని ఆదేశించింది. 45 రోజుల పైబడి టూర్లో మాత్రమే రెండువారాలపాటు ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు ఎంట్రీ ఉండనుందని తెలిపింది. అయితే తాజాగా చాంపియన్స్ ట్రోఫీ మూడు వారాల్లో ముగుస్తుంది, కాబట్టి, దీనికి ప్లేయర్ల కుటుంబ సభ్యులకు అనుమతి లభించలేదు. దీనిపై సీనియర్ క్రికెటర్లు పలు దఫాలుగా బోర్డుకు విన్నవించుకోగా, బోర్డు మనసు కాస్త కరిగినట్లుగా సమాచారం.
గురువారం నుంచే వేట షురూ:
ఇక మెగాటోర్నీలో భారత్ వేట గురువారం నుంచి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఈనెల 20 న ఢీకొననుంది. ఆ తర్వాత 23న చిరకాల ప్రత్యర్థి, ఆతిథ్య పాక్ తో అమీతుమీ తేల్చుకోనుంది. వచ్చేనెల 2న చివరి లీగ్ మ్యాచ్ లో భాగంగా న్యూజిలాండ్ తో తలపడనుంది. నిజానికి ఈ టోర్నీలో మిగతా జట్ల మ్యాచ్ లు పాక్ లో జరుగుతుండగా, భద్రతా కారణాలతో ఆ దేశంలో పర్యటించేందుకు బీసీసీఐ ససేమిరా అనడంతో, హైబ్రిడ్ మోడల్లో దుబాయ్ లో టోర్నీని నిర్వహిస్తున్నారు. లీగ్ మ్యాచ్ లతోపాటు నాకౌట్ మ్యాచ్ లు (అర్హత సాధిస్తే) కూడా దుబాయ్ లోనే నిర్వహిస్తారు. బుధవారం నుంచి పాక్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ తో అధికారికంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. 2017 ఫైనల్లో భారత్ ను ఓడించిన పాక్ .. తాజా టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

