Prithviraj Sukumaran: అక్షయ్ ఒక్క రూపాయి తీసుకోలేదు... 'లూసిఫర్ 2'కు మోహన్ లాల్, పృథ్వీరాజ్ కూడా
Prithviraj Sukumaran : 'లూసిఫర్ 2: ఎంపురాన్' మూవీ కోసం మోహన్ లాల్ రెమ్యూనరేషన్ ను పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించారు. గతంలో అక్షయ్ కుమార్ పైసా తీసుకోకుండా సినిమా చేశారని అన్న వీడియో వైరల్ అవుతోంది.

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగానే కాదు సక్సెస్ ఫుల్ నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. కేవలం మలయాళంలోనే కాకుండా హిందీ, తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమలలో పని చేసిన ఆయన తాజాగా 'L2 ఎంపురాన్' అనే పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నారు. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. అందులో గతంలో తాను నిర్మించిన ఓ సినిమాకు అక్షయ్ కుమార్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని వెల్లడించారు. అలాగే ఇప్పుడు 'L2 ఎంపురాన్' మూవీకి మోహన్ లాల్ ఎంత పారితోషికం తీసుకున్నారో కూడా వెల్లడించారు.
మోహన్ లాల్ రెమ్యూనరేషన్ తీసుకోలేదా ?
మలయాళ అగ్ర నటుడు మోహన్ లాల్ ప్రధాన పాత్ర నటిస్తున్న సినిమా 'లూసిఫర్ 2: ఎంపురాన్'. ఈ మూవీకి మరో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించడంతో పాటు, సినిమాలో కీలక పాత్రను పోషించారు. మార్చి 27న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్, హీరో మోహన్‌లాల్ ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే ఈ మూవీ 150 కోట్లతో తెరకెక్కింది అనే రూమర్లను కొట్టి పారేశారు.
ఈ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ 'లూసిఫర్ 2 : ఎంపురాన్' సినిమా కోసం మోహన్ లాల్ ఎంతో కష్టపడ్డారని వెల్లడించారు. "ఒక డైరెక్టర్ గా నేను నిర్మాతల గురించే ఎక్కువగా ఆలోచిస్తాను. తీసుకొనే ప్రతి రూపాయికి న్యాయం చేయాలని భావిస్తాను. 'లూసిఫర్ 2 : ఎంపురాన్' కోసం మోహన్ లాల్, నేను ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు. ఆయన రెమ్యూనరేషన్ ను కూడా సినిమా కోసమే ఖర్చు చేశాం. సినిమా నిర్మాణ విలువలు చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ సినిమాలో నటించిన ఎంతో మంది విదేశీ నటీనటులు కూడా బాగా సహకరించారు' అని పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నారు. ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే, మాలీవుడ్ బడ్జెట్‌లో ఎక్కువ భాగాన్ని పారితోషికం కంటే సినిమా నిర్మాణానికి కేటాయించడానికి ఇష్టపడుతుందని ఆయన తెలిపారు.
పారితోషికం తీసుకోకుండానే మూవీ చేసిన అక్షయ్
గత కొన్ని సంవత్సరాలుగా అక్షయ్ కుమార్ వరుస డిజాస్టర్లు అందుకుంటున్నారు. ఆయన చేసిన మల్టీస్టారర్ సినిమాలు 'ఖేల్ ఖేల్ మే', 'సర్ఫిరా'తో సహా బాక్సాఫీస్ వద్ద ఒకదాని తర్వాత ఒకటి సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. కానీ 2023లో విడుదలైన ఓ సినిమాకు అక్షయ్ కుమార్ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదు. అయితే ఆ సినిమా మంచి వసూళ్లు రాబడితేనే రెమ్యూనరేషన్ తీసుకుంటానని ఆయన చెప్పారు. ఆ సినిమా పేరు 'సెల్ఫీ'. కానీ ఈ మూవీ పరాజయం పాలవడమే కాకుండా నిర్మాతలు కూడా కోట్ల నష్టాన్ని చవిచూశారు.
'సెల్ఫీ' అనే కామెడీ డ్రామాకు రాజ్ మెహతా దర్శకత్వం వహించారు. ధర్మ ప్రొడక్షన్, మ్యాజిక్ ఫ్రేమ్స్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్ ఈ మూవీని నిర్మించాయి. ఈ చిత్రం 2019 మలయాళ చిత్రం 'డ్రైవింగ్ లైసెన్స్' కు రీమేక్. ఈ సినిమా 2023 ఫిబ్రవరి 24న థియేటర్లలో విడుదలైంది. కానీ రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.23.63 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఈ సినిమా గురించి పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ "నేను అక్షయ్ కుమార్ సర్‌తో ఒక సినిమా నిర్మించాను. అతను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. సినిమా కలెక్షన్స్ రాబడితేనే తన పారితోషికం తీసుకుంటానని మాత్రం చెప్పాడు. సినిమా ఆడలేదు. ఆయన రెమ్యూనరేషన్ తీసుకోలేదు" అంటూ చెప్పుకొచ్చారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ విషయాన్ని వెల్లడించగా, ఇప్పుడు 'లూసిఫర్ 2 : ఎంపురాన్' మూవీ రిలీజ్ సందర్భంగా మరోసారి వైరల్ అవుతోంది.
Its been a year i’m part of Project #SSMB29 - #PrithvirajSukumaran pic.twitter.com/nHmJBmLcoD
— Mana Stars (@manastarsdotcom) March 21, 2025
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

