Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Former Telangana CM KCR | ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ఇద్దరు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంది. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంలోని కీలక నేతలకు సిట్ (SIT) నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగినట్లు కీలక నిందితుడు ప్రభాకర్ రావు పేర్కొన్నట్లు సమాచారం.
సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లను విచారించిన సిట్.. కొందరికి నోటీసులు
ఇటీవల సిట్ అధికారులు రివ్యూటీ కమిటీలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మరోసారి విచారించారు. సాధారణ పరిపాలన శాఖ (GAD) మాజీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావును కూడా విచారించిన అధికారులు, అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ నంబర్ల మంజూరు, అందుకు అనుమతులపై ప్రశ్నించారు. మాజీ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ అధికారి నవీన్ చంద్రకు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది.
ముమ్మరంగా సాగుతున్న సిట్ దర్యాప్తు
ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు పలు ఆసక్తికర విషయాలను గుర్తించారు. ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఎండీతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు ట్యాపింగ్ చేయించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే, మరికొంతమంది ప్రముఖులపై నిఘా ఉంచేందుకు మాజీ మంత్రి కేటీఆర్ ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులు, పౌర సమాజ ప్రతినిధులు, సొంత పార్టీ నేతలపై కూడా నిఘా పెట్టారనే కోణంలో దర్యాప్తు సంస్థ లోతుగా విచారణ జరుపుతోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు అరెస్టై బెయిల్ మీద విడుదలయ్యారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు విదేశాల్లో ఉండటంతో ఆయనను రప్పించేందుకు ప్రభుత్వం 'రెడ్ కార్నర్' నోటీసులు జారీ చేయడంతో ఆయన భారత్ కు వచ్చి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారేందుకు కొందరు అధికారులు సిద్ధమైనట్లు ఇటీవల ప్రచారం జరిగింది. దీంతో గత ప్రభుత్వంలోని రాజకీయ పెద్దలకు ఈ కేసుతో ఉన్న సంబంధంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు సైతం ఈ కేసు దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.






















