క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
బీసీసీఐ మహిళా క్రికెటర్ల జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశీయ క్రికెట్ లో జూనియర్ ఆటగాళ్లకు సైతం అధిక వేతనాలు ఇవ్వనుంది.

BCCI hikes cricketers salary | ముంబై: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) మహిళల దేశీయ క్రికెట్‌లో ఆటగాళ్ల జీతాలను పెంచింది. ఇకపై మహిళా క్రికెటర్లకు కూడా పురుషులతో సమానంగా వేతనం లభిస్తుంది. కేవలం క్రికెటర్లే కాకుండా, దేశీయ క్రికెట్‌లో మహిళా మ్యాచ్ అధికారుల జీతాలు కూడా పెంచుతూ వారికి సైతం బీసీసీఐ శుభవార్త అందించింది. టీమిండియా మహిళల జట్టు ODI వరల్డ్ కప్ 2025 చారిత్రాత్మక విజయం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను భారత్ 52 పరుగుల తేడాతో ఓడించింది. అనంతరం అంధుల మహిళల జట్టు సైతం వరల్డ్ కప్ విజేతగా అవతరించింది.
రెట్టింపు పెరిగిన ప్యాకేజీలు
మహిళా క్రికెటర్ల జీతాలను BCCI రెట్టింపు కంటే ఎక్కువ పెంచింది. ప్లేయింగ్ ఎలెవన్‌లో సీనియర్ మహిళా ఆటగాళ్లకు ప్రతి మ్యాచ్‌కు ఇప్పుడు రూ. 50,000 లభిస్తాయి. గతంలో కేవలం రూ. 20,000 మాత్రమే ఉండేది. రిజర్వ్ ఆటగాళ్లపై కూడా బీసీసీఐ ఫోకస్ చేసింది. ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం కాని ఆటగాళ్లకు ప్రతి మ్యాచ్‌కు రూ. 25,000 లభిస్తాయి. గతంలో బెంచ్‌పై కూర్చునే ఆటగాళ్లకు అతి తక్కువ అంటే రూ. 10,000 లభించేవి. ప్రతి ఆటగాడికి ఆర్థిక భద్రత కల్పించేలా బీసీసీఐ ప్రయత్నించింది.
జూనియర్ క్రికెటర్లకు సైతం పెరిగిన జీతాలు
జూనియర్ క్రికెట్ టోర్నమెంట్లలో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్న ఆటగాళ్లకు ఒక రోజు ఆడితే రూ. 25,000 లభిస్తాయి. అయితే బెంచ్ మీద ఉండే రిజర్వ్ ఆటగాళ్లకు రూ. 12,500 మేర లభిస్తాయి. జూనియర్ T20 మ్యాచ్‌లలో ఆడేందుకు ఆటగాళ్లకు రూ. 12,500, రిజర్వ్ ఆటగాళ్లు రూ. 6250 అందుకుంటారు. Cricbuzz ప్రకారం, ఈ నిర్ణయం డిసెంబర్ 22న జరిగిన BCCI సమావేశంలో తీసుకున్నారు. ఆ నివేదిక ప్రకారం అంపైర్లు, మ్యాచ్ రిఫరీల జీతాల పెంపుపై కూడా చర్చ జరిగింది. త్వరలో దీనిపై బీసీసీఐ కీలక ప్రకటన చేసే అవకాశముంది.





















