Rohit Sharma Retirement Plan: రిటైర్మెంట్ ప్లాన్‌పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. అభిమానులను సైతం కదిలించిన మాటలు
Rohit Sharma Latest news | 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత రోహిత్ శర్మ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఆ సమయంలో రిటైర్మెంట్ ప్రకటించాలని భావించినట్లు తెలిపాడు.

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో రోహిత్ శర్మ ఒకరు. హిట్ మ్యాన్‌గా పేరుగాంచిన రోహిత్ తన కెరీర్‌కు సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఓటమి తర్వాత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఆట నుంచి వైదొలగాలని కూడా తాను ఆలోచించినట్లు రోహిత్ మొదటిసారి బహిరంగంగా అంగీకరించాడు. ఆ ఓటమి తనను మానసికంగా పూర్తిగా కుంగదీసిందని తెలిపాడు. రోహిత్ వ్యాఖ్యలు చూసి అభిమానులు కూడా షాకవుతున్నారు.
ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత కుంగిపోయిన రోహిత్
గురుగ్రామ్‌లోని మాస్టర్స్ యూనియన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 2023 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత తాను పూర్తిగా ఏదో కోల్పోయినట్లు భావించానని రోహిత్ శర్మ తెలిపాడు. "క్రికెట్ నా నుండి సర్వస్వం తీసేసుకుంది అనిపించింది. ఇక క్రికెట్ ఆడాలనిపించలేదు. ఆ సమయంలో నాలో ఎలాంటి శక్తి మిగల్లేదు అనిపించింది" అని రోహిత్ చెప్పాడు.
రోహిత్ కెప్టెన్సీలో భారత్ వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో వరుసగా 9 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్ వరకు అద్భుతమైన ప్రయాణం చేసింది. అయితే గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో ట్రావిస్ హెడ్ సెంచరీతో భారత్ కలలను నాశనం చేశాడు.
కెప్టెన్సీ బాధ్యత, మానసిక ఒత్తిడి
కెప్టెన్‌గా ఉండటం వల్ల ఈ ఓటమి తనకు మరింత భారంగా మారిందని రోహిత్ వివరించాడు. "నేను కేవలం రెండు, మూడు నెలలు కాదు, 2022లో కెప్టెన్ అయినప్పటి నుండి ఆ ప్రపంచ కప్ కోసం నన్ను నేను ఆట కోసం అంకితం చేసుకున్నాను. లక్ష్యం నెరవేరనప్పుడు అందరూ చాలా నిరాశ చెందారు. అసలు ఏం జరిగిందో మాకు నమ్మశక్యంగా లేదు. ఆ సమయం నాకు వ్యక్తిగతంగా చాలా కష్టంగా ఉంది" అని హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు.
ఈ ఓటమి నుండి కోలుకోవడానికి చాలా నెలలు పట్టింది. క్రికెట్ తన అతిపెద్ద ప్రేమ అని, దానిని అంత సులభంగా వదులుకోలేనని.. కానీ ఆ గాయం చాలా నెలలపాటు వెంటాడిందని పదేపదే గుర్తు చేసుకున్నారు.
కం బ్యాక్.. మెరుగైన క్రికెట్
వన్డే వరల్డ్ కప్ ఓటమి నుంచి క్రమంగా తాను కోలుకున్నానని, మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించి మైదానంలోకి తిరిగి రావడానికి ధైర్యం కూడగట్టుకున్నానని రోహిత్ అంగీకరించాడు. "ఇది నాకు ఒక పెద్ద పాఠం. నిరాశను ఎలా ఎదుర్కోవాలి. తనను తాను ఎలా రీసెట్ చేసుకోవాలి. ఏ విషయంలోనైనా ముందుకు ఎలా సాగాలి నేర్చుకున్నాను’ అన్నారు.
అయితే, రోహిత్ ఇప్పుడు అంతర్జాతీయ టీ20, టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇటీవల వన్డే కెప్టెన్సీ కూడా తీసివేశారు. 2027 వన్డే ప్రపంచ కప్‌లో ఆడటం, తన కెరీర్‌ను అద్భుతంగా ముగించడమే రోహిత్ శర్మ ముందున్న లక్ష్యం.
టీ20 ప్రపంచ కప్ గెలుపుతో ఉపశమనం
2023 నిరాశకు దాదాపు ఒక సంవత్సరం తర్వాత రోహిత్ శర్మ భారత్‌కు 2024 టీ20 ప్రపంచ కప్ అందించాడు. ఈ విజయం పాత గాయాలను మరిచిపోయేలా చేసింది. అయితే, వెనక్కి తిరిగి చూసి ఇవన్నీ చెప్పడం ఇప్పుడు సులభంగా అనిపించినా, ఆ సమయంలో పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయని తెలిపాడు. వరల్డ్ కప్ ఫైనల్ లాంటి ఓటమి నిరాశ నుండి బయటపడటం అంత సులభం కాదని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.





















