Telangana Assembly Sessions: ఈ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు? జలాల అంశంపై స్పెషల్ సెషన్.. హీటెక్కిన వాటర్ పాలిటిక్స్
పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల సహా తెలంగాణలో ప్రాజెక్టులపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను డిసెంబర్ 29 నుంచి ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

హైదరాబాద్: ఇటీవల తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ తరువాత రాష్ట్ర రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. రెండేళ్లు గడువు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులలో చిన్న పనులు చేయలేదని, తట్టెడు మట్టి తీయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఆరోపణలు, విమర్శలకు అసెంబ్లీలోనే సమాధానం చెబుతామని, జనవరి 2 నుంచి జలాల అంశంపై అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు
కృష్ణా, గోదావరి నదీ జలాల అంశంపై సమగ్రంగా చర్చించేందుకు డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు. మంత్రులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టుల నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన 2014 తర్వాత జరిగిన వ్యయం వంటి అంశాలపై అసెంబ్లీ వేదికగా 'నీళ్లు-నిజాలు' పేరుతో చర్చించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ విమర్శలు చేసిన పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, అప్పట్లోనే డీపీఆర్‌లు ఎందుకు వెనక్కి వచ్చాయన్నది ప్రజలకు వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ 29న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించి, 3 రోజుల విరామం తర్వాత జనవరి 2 నుంచి సమావేశాలు తిరిగి కొనసాగించాలని సీఎం రేవంత్ యోచిస్తున్నారు.
జీహెచ్‌ఎంసీ విస్తరణ, మున్సిపల్ ఎన్నికలు
హైదరాబాద్ నగర విస్తరణ (GHMC)పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని పెంచుతూ, నగరాన్ని 3 నగరపాలక సంస్థలుగా విభజించే ప్రతిపాదనపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. కొత్తగా 70 నుంచి 80 డివిజన్లతో అదనపు కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని, అందులో ఒకటి సైబరాబాద్ పేరుతో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా సవరణ పూర్తయిన తర్వాత వచ్చే జనవరి తరువాతే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అంశంపై చర్చించారు.
పంచాయతీ ఫలితాల విశ్లేషణ, సర్పంచుల సభ
ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు మంత్రులను రేవంత్ రెడ్డి అభినందించారు. గెలిచిన సర్పంచుల విద్యార్హతలు, సామాజిక వర్గాల వారీగా వివరాలను సేకరించి వారిని 3 టీంలుగ విభజించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని రేవంత్ సూచించారు. సంక్రాంతి పండుగ నాటికి నూతన సర్పంచులతో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. పార్టీల వారీగా వచ్చిన ఓట్ల శాతాన్ని మండల, నియోజకవర్గ స్థాయిల్లో విశ్లేషించి పార్టీ భవిష్యత్ వ్యూహాలను రూపొందించాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
గత ప్రభుత్వ విధానాలపై పోరాటం
నదీ జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరిగింది, ప్రాజెక్టుల డీపీఆర్ లు వెనక్కి వచ్చిన సందర్భాలలో అసెంబ్లీ సమావేశాల్లో గళంవిప్పి రాష్ట్ర ప్రజలకు గట్టిగా వినిపించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ ప్రభుత్వం అనుమతి లేకుండా చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆధారాలతో సహ వివరించనున్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం తాగునీటి ప్రాజెక్టుగా పరిమితం చేసి, రైతులకు చేసిన అన్యాయాన్ని ఎండగట్టాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుు 90 టీఎంసీల పూర్తిస్థాయి ప్రాజెక్టుగా మార్చడానికి తీసుకుంటున్న చర్యలను అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందుంచాలని నిర్ణయించారు.






















