What is KCR Target: కృష్ణా జలాల కన్నా చంద్రబాబుపై విమర్శలే వైరల్ - కేసీఆర్ రీఎంట్రీ ప్లాన్ దారి తప్పిందా?
KCR Target: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లకు కేసీఆర్ ప్రెస్మీట్ పెట్టారు. కానీ ఆయన తెలంగాణ ప్రభుత్వం మీద చేసిన విమర్శల కన్నా చంద్రబాబుపై చేసిన విమర్శలే వైరల్ అయ్యాయి. అదే వ్యూహమా?

KCR criticism of Chandrababu Naidu went viral more than Krishna waters: భారత రాష్ట్ర సమితి పరాజయం తర్వాత కేసీఆర్ చాలా కాలంగా ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేసిన తర్వాత అసలు బయటకు రావడం మానేశారు. మళ్లీ ఇప్పుడే డిసెంబర్ 21న ఆదివారం తెలంగాణ భవన్‌లో ఎల్పీ మీటింగ్ నిర్వహించారు. ఆ తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్ లో సుదీర్ఘంగా మాట్లాడారు. ముఖ్యంగా కృష్ణా జలాల పంపకం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై మాట్లాడే క్రమంలో ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది కేసీఆర్ వ్యూహాత్మక అడుగా లేక పొరపాటా అనేది బీఆర్ఎస్ నేతలకూ పజిల్‌గానే ఉంది.
స్పేస్ లేకపోయినా చంద్రబాబును టార్గెట్ చేసుకున్న కేసీఆర్
కేసీఆర్ కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రమే కాకుండా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి డీపీఆర్ వెనక్కి రావడానికి కారణం చంద్రబాబు అని ఆరోపించారు. అదే సమయంలో అవసరం లేకపోయినా పెట్టుబడుల సదస్సు గురించి ప్రస్తావించారు. ఇటీవల రేవంత్ ప్రభుత్వం ఎంవోయూలపై చేస్తున్న ప్రచారాన్ని విమర్శిస్తూ.. గతంలో చంద్రబాబు హయాంలో విశాఖలో జరిగిన సదస్సులో స్టార్ హోటల్ వంట మనుషులతో ఒప్పందాలు చేయించారని ఎద్దేవా చేశారు. పాలమూరును దత్తత తీసుకుని చంద్రబాబు మోసం చేశారని, కేవలం శిలాఫలకాలతోనే కాలం గడిపారని విమర్శించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలన చంద్రబాబు డైరెక్షన్‌లోనే సాగుతోందని, అందుకే తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గుతోందని విమర్శించారు. ఇలా చంద్రబాబును టార్గెట్ చేయడంతో అవే హైలెట్ అవుతున్నాయి.
కేసీఆర్ వ్యూహాత్మక అడుగు?
అయితే ఇది పొరపాటున చేయడం లేదని.. ఆయన వ్యూహాత్మకంగానే చేస్తున్నారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. కేసీఆర్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. రేవంత్ రెడ్డిని చంద్రబాబుతో ముడిపెట్టడం ద్వారా, తెలంగాణ ప్రయోజనాలను పక్క రాష్ట్రానికి తాకట్టు పెడుతున్నారనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారని అంచనా వేస్తున్నారు. ఒకే దెబ్బకు ఇద్దరు ముఖ్యమంత్రులను టార్గెట్ చేయడం ద్వారా, తానొక్కడే తెలంగాణ హక్కుల కోసం పోరాడే యోధుడినని నిరూపించుకునే వ్యూహం ఇందులో ఉందని అనుకోవచ్చు.
వ్యూహాత్మక తప్పిదమా?
అయితే, ప్రధాన సమస్య అయిన కృష్ణా జలాల వివాదం కన్నా చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలే ఎక్కువగా హైలైట్ అవ్వడం బీఆర్ఎస్‌కు మైనస్ అయ్యే అవకాశం ఉందని మరికొందరు భావిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అనుమతులు, నీటి వాటాల గురించి కేసీఆర్ చేసిన లోతైన విశ్లేషణ కన్నా, చంద్రబాబుపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతున్నాయి. దీనివల్ల చర్చ ప్రాజెక్టుల నుంచి రాజకీయ వ్యక్తిగత దూషణలకు మళ్లింది. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో లేని చంద్రబాబును అంతగా టార్గెట్ చేయడం వల్ల ఏపీ-తెలంగాణ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతాయే తప్ప, ప్రస్తుత సమస్యలకు పరిష్కారం దొరకదని సామాన్యులు భావిస్తున్నారు.
కేసీఆర్ రాజకీయం అంచనా వేయడం కష్టం !
కేసీఆర్ చంద్రబాబు - రేవంత్ ఒక్కటేనని చెప్పే ప్రయత్నంలా కనిపించింది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తనను ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అని విమర్శిస్తున్న తరుణంలో కేసీఆర్ తనదైన శైలిలో ఎదురుదాడికి దిగారు. చంద్రబాబుపై విమర్శలు కేసీఆర్ పాత కేడర్‌ను ఉత్సాహపరిచినప్పటికీ, కొత్త ఓటర్లను ఎంతవరకు ఆకట్టుకుంటాయన్నది ప్రశ్నార్థకమేనని అంటున్నారు. అయితే కేసీఆర్ రాజకీయ వ్యూహాలను అంచనా వేయడం అంత తేలిక కాదన్నది ఎక్కువ మంది అభిప్రాయం.





















