Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
AP Tourism Safety and Protection Policy | ఏపీలో పర్యాటక ప్రాంతాల్లో శాంతిభద్రతలను పర్యవేక్షించడంతో పాటు, వారితో మర్యాదగా ప్రవర్తించేలా ఒక నియమావళిని అమలు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

అమరావతి: రాష్ట్రంలో పర్యటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పర్యాటకులు ఏ ప్రాంతానికి వెళ్లినా 100 శాతం సురక్షితం అన్న భావన వారిలో కలగాలని, ముఖ్యంగా మహిళా పర్యాటకులు మరియు కుటుంబాల రక్షణ కోసం ప్రత్యేకంగా 'టూరిజం సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ పాలసీ'ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పర్యాటక ప్రదేశాల్లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, పర్యాటకులతో మసలుకునే విధానంపై హోటల్ మరియు ట్రావెల్స్ నిర్వాహకులకు కచ్చితమైన ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
పర్యాటక రంగం ద్వారా ఉపాధి కల్పన
రాష్ట్రంలోని యువతకు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల ప్రజలకు పర్యాటక రంగం ద్వారా విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. పర్యాటక హాట్ స్పాట్లను గుర్తించి, అక్కడ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా దేశీ, విదేశీ పర్యాటకులను ఆకర్షించాలని సూచించారు. దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకునేలా హెలీపోర్టుల ఏర్పాటు మరియు హెలీ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, వాటిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
సాంస్కృతిక, పర్యాటక అభివృద్ధి
రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతాన్ని అడ్వెంచర్ టూరిజంకు కేంద్రంగా మార్చాలని.. కృష్ణా, గోదావరి నదుల్లో బోట్ రేసులు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. మంగళగిరి, కొండపల్లి వంటి ప్రాంతాల్లో పర్వతారోహణకు అనువైన వసతులు కల్పించడంతో పాటు రాష్ట్రంలోని ప్రతి పర్యాటక కేంద్రం ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రత్యేక ఆర్కిటెక్చర్ కలిగి ఉండాలని సూచించారు. అంతరించిపోతున్న కళలకు పునరుజ్జీవం పోసే విధంగా పర్యాటక ప్రాజెక్టుల రూపకల్పన జరగాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.
వారసత్వ, ఆధ్యాత్మిక సర్క్యూట్ల ఏర్పాటు
ప్రముఖ కవులైన గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ, గురజాడ అప్పారావు వంటి వారి ఇళ్లను పరిరక్షించి వాటిని 'సాహితీ సర్క్యూట్'గా మార్చాలని డిప్యూటీ సీఎం ప్రతిపాదించారు. అలాగే గొలగమూడి వెంకయ్య స్వామి, కాశీనాయన వంటి మహానుభావుల ఆశ్రమాలను 'స్పిరిట్యువల్ సర్క్యూట్'గా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. పర్యాటక అభివృద్ధిలో అటవీ, గిరిజన సంక్షేమ, నీటిపారుదల శాఖలను భాగస్వాములను చేస్తూ సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కోరారు. ఈ అంశాలపై తదుపరి సమీక్షా సమావేశాన్ని జనవరి 6వ తేదీన నిర్వహించనున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఈ సమావేశంలో అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు, ఉన్నతాధికారులు అజయ్ జైన్, ఆమ్రపాలి, శాంతిప్రియ పాండే, రాహుల్ పాండే, శరవణన్, రామచంద్ర మోహన్, శ్రీనివాస్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కృష్ణబాబు, కాంతిలాల్ దండే, హరి జవహర్ లాల్ పాల్గొన్నారు.






















