Pawan Kalyan: "పోలవరానికి పొట్టి శ్రీరాముల పేరు పెట్టాలి" సరికొత్త ప్రతిపాదన తీసుకొచ్చిన పవన్ కల్యాణ్
Pawan Kalyan: జనసేనలో వివిధ పదవులు చేపట్టిన వారితో ముచ్చటించిన పవన్ కల్యాణ్ కీలకాంశాలు ప్రస్తావించారు. అందులో ఒకటి పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాముల పేరు పెట్టాలని ప్రతిపాదించారు.

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో శరవేగంగా నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాముల పేరు పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. ఇది తన ఒక్కడి నిర్ణయం కాదని అన్నారు. కానీ అలాంటి మహనీయుడి పేరు పెడితే బాగుంటుందని అన్నారు. ఇలా చేస్తే మహనీయుడు చిరస్థాయిగా నిలిచిపోతాడని అన్నారు. మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో జరిగిన పదవీ బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ జగన్ వస్తాడేమో అన్న భయం చాలా మందిలో ఉందని అది జరిగేది కాదని స్పష్టం చేశారు.
ఒక వ్యక్తిని, పార్టీని కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే అంచనా వేస్తాం. మనం ఓడిపోయినప్పుడు కూడా ప్రజల తరఫున నిలబడ్డాం అని అన్నారు. అందుకే నేడు మనల్ని ప్రజలు గుర్తించారని వివరించారు. ఒక ఐడియాలజీతో కలిసి పని చేశాం కాబట్టే ప్రజల మనసులు గెలుచుకున్నామని నాయకులకు దిశానిర్దేశం చేశారు. సరైన ఐడియాలజీ ఎంచుకోకపోతే ఎక్కువ కాలం నిలబడలేరని స్పష్టం చేశారు. "జనసేన మాత్రం సుదీర్ఘ కాలం నిలబడే ఐడియాలజీ ఎంచుకుంది. కులం కోసం, ప్రాంతం కోసం పార్టీ పెట్టలేదు. చాలామందితో చర్చించి చాలా సింపుల్‌గా ఏడు సూత్రాలతో ఐడియాలజీని తయారు చేశాం. దీన్ని ప్రతి నాయకుడు అర్థం చేసుకొని ముందుకెళ్తేనే భవిష్యత్ ఉంటుందన్నారు."
అమరజీవి జలవాహిని పేరు పెట్టినప్పుడు, గోదావరి ప్రాంతంలో ఇష్టం వచ్చినట్టు తవ్వేశామన్నారు పవన్. నీళ్లు పారుతున్నా తాగలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రిజర్వాయర్ నుంచి తెప్పించుకొని నీళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. అంటే సహజ వనరులను చంపేస్తున్నామని అందుకే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్తానం అనే లైన్ పెట్టగలిగామని తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ వచ్చే రోహ్యంగులు తెనాలి, బందరు లాంటి ప్రాంతాలకు వచ్చేసి స్థానికుల ఉపాధికి గండి కొడుతున్నారని అన్నారు. ఉక్రెయిన్ వార్‌గురించి మనకేంటీ సంబంధం అనుకోవచ్చని, ఇక్కడ యూరియా కొరతకు అదే కారణమని తెలిపారు. సామాన్యులకు అవసరం లేకపోవచ్చు కానీ రాజకీయ పార్టీ నేతలుగా మీకు అంతర్జాతీయ అంశాలపై అవగాహన లేకపోతే స్థానిక సమస్యలపై గట్టిగా మాట్లాడలేరని చెప్పుకొచ్చారు. భాష, యాసను, సంస్కృతులను గౌరవించాలని సూచించారు.
ఏ పదవి చిన్నది పెద్దది అనే ఆలోచన లేకుండా పని చేస్తూ ఉండాలని సూచించారు. ఉన్న పదవి ద్వారా ప్రజలకు ఎలా సహాయపడాలో ఆలోచించి కొత్త పంథాలో వెళ్లాలని చెప్పారు. ప్రతి సమస్యను తన వరకు రాకుండా పరిష్కారమయ్యేలా చూడాలని ఆదేశించారు. అలా తన వరకు సమస్యలు వస్తున్నాయంటే కింది స్థాయి నుంచి ఉన్న నాయకులంతా ఫెయిల్ అయినట్టేనని అభిప్రాయపడ్డారు.
ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతున్నప్పుడు మనలో మనం కొట్టుకుంటూ ఉంటే అరాచకమే రాజ్యమేలుతుందని అన్నారు పవన్ కల్యాణ్. అదే ఆలోచనతో కూటమి ఏర్పాటు చేశామన్నారు. రౌడీలును వెనకేసుకొచ్చే పార్టీని చూస్తున్నామని జనసేన నాయకులు అలాంటి దారిలో వెళ్లొద్దని సూచించారు. అలా చేస్తే వాళ్లకి మనకి పెద్ద తేడా ఉండదని అన్నారు.
తెలుగు వాడి ఆత్మగౌరవం అని మాట్లాడుతున్నామంటే దానికి మూలపురుషుడు పొట్టి శ్రీరాములు, దేశంలోనే భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణాలను అర్పించారు. అలాంటి వ్యక్తులను స్మరించుకోకపోతే, ఐదేళ్లు సీఎంగా చేసిన వారి పేర్లు కూడా పెట్టేస్తున్నాం. కానీ ఎవరి వల్ల మనం నిలబడ్డామో, బలిదానం మీద ఇక్కడ ఉన్నాం వారిని వదిలేస్తున్నాం. ఆయన పేరు పెట్టగానే వైశ్యుల కోసం అని అంటారు. అలా అంబేద్కర్ పేరు చెప్పినా ఒక కులానికి పరిమితం చేస్తారు. ఇలా మన స్థాయిలో తప్పులు సరి చేయకపోతే చాలా తప్పు చేసినవాళ్లం అవుతాం. పొట్టి శ్రీరాములాంటి వ్యక్తికి నిజమైన గుర్తింపు ఇవ్వాలి అంటే పోలవరం లాంటి ప్రాజెక్టుకు ఆ మహానుభావుడు పేరు పెడితే నిజంగా గుర్తింపు వస్తుంది. ఇది నా ఉద్దేశం. అందరం కలిసి నిర్ణయం తీసుకోవాలి."
దాన్ని పార్టీగా కూడా గుర్తించం: పవన్
పవన్ కల్యాణ్ వైసీపీ పేరు ప్రస్తావించకుండా విమర్శలు చేశారు. ఆకురౌడీలను సపోర్ట్ చేస్తున్న వారిని పార్టీగా కూడా గుర్తించాలనిపించడం లేదన్నారు. "నాకు ఎవరూ శత్రువు కాదు. వారి విధివిధానాలనే వ్యతిరేకిస్తాను. విధివిధానాలతో ప్రజలకు ఇబ్బంది కలిగితే జీవితాంతం పోరాటానికి సిద్ధం. పోతాం అని తెలిసి కూడా అడుగులు ముందేవేస్తాం. రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడతం పోరాటం చేస్తాం. అవసరమైతే ఆఖరికి చొక్కా మటతపెట్టి ముందుకు వస్తాం. అందుకే జనసేన నాయకులు గొడవలు పెట్టుకోవద్దు. బూతులు లేకుండా వాదించండి, డిస్కషన్ చేయండి. ప్రైవేటు దందాలు చేయద్దు"అని సూచించారు.
వైసీపీ నేతలు రౌడీలు వెనకేసుకొస్తాం, గంజాయి అమ్మేవాళ్లను వెనకేసుకొస్తాం అంటే కుదరదని పవన్ అన్నారు. సంస్కారవంతమైన భాషలో మాట్లాడితే అడిగే వాటికి సమాధానం చెప్తామని బజారు భాష మాట్లాడినంత కాలం చీత్కారాలు తప్పవని అలాంటి వారిని ఎలా కంట్రోల్ చేయాలో తమకు తెలుసు అన్నారు పవన్ కల్యాణ్. ఆ పార్టీ అధికారంలోకి రాదని గట్టిగా చెప్పారు పవన్ కల్యాణ్. అలాంటి ఆలోచన ఎవరూ పెట్టుకోవద్దని సూచించారు.





















