APPSC: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
APPSC గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూలును ఏపీపీఎస్సీ ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు పరీక్షలు నిర్వహించనుంది. ఈ పరీక్షల ద్వారా మొత్తం 81 పోస్టులను ఏపీపీఎస్సీ భర్తీచేయనుంది.

APPSC Group1 Mains: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూలును ఏపీపీఎస్సీ మార్చి 21న ప్రకటించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులై, మెయిన్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులకు మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. ఆయా తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మే 3న తెలుగు పేపర్, మే 4న ఇంగ్లిష్ పేపర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇవి కేవలం అర్హత పరీక్షలు మాత్రమే. మే 5 నుంచి 9 వరకు జరిగే పరీక్షలను మాత్రమే ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 5న పేపర్-I, మే 6న పేపర్-II, మే 7న పేపర్-III, మే 8న పేపర్-IV, మే 9న పేపర్-V పరీక్షలు నిర్వహించనున్నారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల పేపర్లు ఇలా..
పేపర్-I - ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ఇతివృత్తాలు మరియు అంశాలపై జనరల్ ఎస్సే
పేపర్-II - భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరియు సాంస్కృతిక మరియు భౌగోళిక శాస్త్రం
పేపర్-III - రాజకీయాలు, రాజ్యాంగం, పాలన, చట్టం మరియు నీతి
పేపర్-IV - భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి
పేపర్-V - సైన్స్, టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యలు
ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 81 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) డిసెంబరు 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 1న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జనవరి 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 17న గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్ (ప్రిలిమినరీ) పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల పరిధిలో 301 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్-1 పరీక్ష నిర్వహించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. గ్రూప్-1 పరీక్ష కోసం మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో మొత్తం 1,26,068 (84.67 %) మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నవారిలో పేపర్-1 పరీక్షకు 91,463 (72.55 %) మంది, పేపర్-2 పరీక్షకు 90,777 (72 %) మంది అభ్యర్థులు హాజరయ్యారు.
మెయిన్స్ పరీక్ష విధానం..
మెయిన్స్ పరీక్షలో మొత్తం 5 ప్రధాన పేపర్లు ఉంటాయి. వీటితోపాటు తెలుగు, ఇంగ్లిష్ పేపర్లు కూడా ఉంటాయి. అయితే ఇవి కేవలం అర్హత పరీక్షలు మాత్రమే. మొత్తం 5 పేపర్లలో ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 750 మార్కులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహించి మొత్తం 825 మార్కులకు అభ్యర్థుల ఎంపికను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కో పేపరుకు 180 నిమిషాలు (3 గంటలు) కేటాయించారు. డిస్క్రిప్టివ్ విధానంలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

