Ajinkya Rahane: లోకల్ రైల్లో ప్రయాణం, లోయర్ మిడిల్ క్లాసు కుటుంబం- అజింక్య రహానే సెకండ్ హ్యాండ్ కారు కథ తెలుసా!
Ajinkya Rahane: 2020 పర్యటనలో రహానే సారథ్యంలోనే టీమిండియా వరుసగా రెండోసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని గెలిచింది. అలాంటి క్రికెటర్ ఇప్పుడు కేవలం దేశవాళీల్లోకే పరిమితమయ్యాడు.

Ajinkya Rahane Comments: భారత క్రికెటర్ అజింక్య రహానే గత కొంతకాలంగా టీమిండియా సెలెక్షన్ నుంచి దూరంగా ఉంటున్నాడు. ఒకప్పుడు మూడు ఫార్మాట్లలో ఆడి టీమిండియాకు నమ్మకమైన ప్లేయర్ గా ఉన్న రహానే.. ఆ తర్వాత ఒక్కసారిగా టీమ్ నుంచి దూరమయ్యాడు. 2020 పర్యటనలో కోహ్లీ గైర్హాజరైనప్పుడు రహానే సారథ్యంలోనే టీమిండియా వరుసగా రెండోసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అలాంటి క్రికెటర్ ఇప్పుడు కేవలం దేశవాళీల్లోకే పరిమితమయ్యాడు. ఐపీఎల్లో మాత్రం ఆడుతున్నాడు. తాజాగా తన కెరీర్ గురించి మనసులో మాటను చెప్పుకొచ్చాడు. కాలం కలిసి వస్తే ఇప్పటికైనా తను టీమిండియాలోకి పునరాగమనం చేయాలని భావిస్తున్నాడు. తాజాగా రంజీ ట్రోఫీలో నాకౌట్ మ్యాచ్ ల్లో ముంబైకి సారథ్యం వహిస్తున్నాడు. సెమీస్ లో విదర్భతో నాగపూర్ లో మ్యాచ్ ఆడుతున్నాడు.
Also Read: పాకిస్తాన్ అతి - చాంపియన్స్ ట్రోఫి వేదికలో భారత జెండా తీసివేత - బుద్ది చెప్పాల్సిందే !
డౌన్ టూ ఎర్త్ ఉంటా..
తను చాలా లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చానని, తన కుటుంబ మూలాలు ఎప్పటికీ మరిచి పోలేనని రహానే పేర్కొన్నాడు. తన చిన్నప్పుడు డంబీవ్యాలీ నుంచి ఎనిమిదేళ్ల వయసు నుంచే లోకల్ ట్రైన్లలో మైదానానికి వచ్చేవాడినని చెప్పుకొచ్చాడు. ఉద్యోగ బాధ్యతల వల్ల తన తండ్రి అందుబాటులో లేకపోతే, ఒంటరిగానే మైదానానికి వెళ్లేవాడినని పేర్కొన్నాడు. తను టీమిండియాలోకి అడుగు పెట్టినప్పుడు డబ్బు, ఫేమ్ వచ్చినా, మూలాలు మరిచిపోలేదని అప్పుట్లో సెకండ్ హ్యాండ్ వాగనార్ కొన్నానని చెప్పాడు. రెండేళ్ల తర్వాత హొండా సిటీ కారును కొన్నానని చెప్పాడు. ఖర్చు గురించి తన వాళ్లు ఏమీ చెప్పరని, అవసరమున్న విషయాలకు మాత్రమే ఖర్చు చేయాలని మాత్రమే సూచించేవాళ్లని తెలిపాడు. తను క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆవిష్కార్ సాల్వి, ప్రవీణ్ తాంబే నుంచి లిఫ్టు అడిగి మైదానానికి వెళ్లేవాడినని పేర్కొన్నాడు.
యువ ఆటగాళ్లకు సలహాలిస్తా..
యువ ఆటగాళ్లకు కెరీర్ గురించి తనకు తోచిన సలహాలిస్తూ, అందుబాటులో ఉంటానని రహానే పేర్కొన్నాడు. వాళ్ల వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోనని, ఆట విషయంలో మాత్రం తప్పుడు దారిలో వెళితే, సరైన దారిలో పెట్టేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. ఫేమ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఆటగాళ్లు చుట్టు ఉంటారని, కొంచెం గడ్డు పరిస్థితులు ఎదురైతే, చుట్టూ ఉన్నవాళ్లు మాయమవుతారని పేర్కొన్నాడు. 2011-2023 మధ్య టీమిండియాలో సభ్యుడైన 36 ఏళ్ల రహానే.. తన 14 ఏళ్ల కెరీర్లో 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. 15 సెంచరీలు, 51 అర్థ సెంచరీలు చేశాడు. ఓవరాల్ గా 8400 అంతర్జాతీయ పరుగులు చేశాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

