SRH vs RR IPL 2025 Match Highlights | ఉప్పల్ లో తన రికార్డును తనే బ్రేక్ చేసిన సన్ రైజర్స్ | ABP Desam
జస్ట్ మిస్ ఇంకొక్క ఒక్క పరుగు కొట్టి ఉంటే..ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదయ్యేది. ఈ రోజు ఉప్పల్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ RR ను చావగొట్టి చెవులు మూసింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ బ్యాటింగ్ కు ఆహ్వానించి ఎంత తప్పు చేశామా అని ఫీల్ అయ్యి ఉంటుంది. ఆ రేంజ్ లో సాగింది మరి ఆరెంజ్ ఆర్మీ విధ్వంసం. ప్రధానంగా ఇషాన్ కిషన్ పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు. టీమిండియా లో కాంట్రాక్ట్ ఇవ్వలేదని కసి మీదున్నాడో ఏమో తనను వద్దనుకున్న ముంబైకి కూడా సౌండ్ వినిపించేలా..తనను కావాలని ఎంచుకున్న సన్ రైజర్స్ రుణం తీర్చుకునేలా మొదటి మ్యాచులోనే ఊఛకోత కోశాడు ఆర్ఆర్ బౌలర్లను. కేవలం 47 బంతుల్లోనే 11ఫోర్లు 6 సిక్సర్లతో 106పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ కి తోడుగా హెడ్ సాధించిన విధ్వంసం సన్ రైజర్స్ క్సోరు బోర్డు పరుగులు పెట్టేలా చేసింది. 31 బంతుల్లోనే 9 ఫోర్లు 3 సిక్సర్లతో 67పరుగులు చేసి ఔటయ్యాడు హెడ్. అభిషేక్ శర్మ 24, నితీశ్ కుమార్ రెడ్డి 30, క్లాసెన్ 34 పరుగులు చేయటంతో సన్ రైజర్స్ ఓ దశలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక నమోదు చేస్తుందేమో తనపేరు మీదే ఉన్న హయ్యెస్ట్ రికార్డు బద్ధలు కొడుతుందేమోనని భావించారు ఫ్యాన్స్. ఓపెనర్లు, టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు 200కు పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి ముందు ఉప్పల్ లో గతేడాది సన్ రైజర్సే పెట్టిన 277పరుగుల అత్యధిక స్కోరు ను బద్ధలు కొట్టారు. తర్వాత టార్గెట్ సన్ రైజర్సే గతేడాది చేసిన 287పరుగులు కాగా.జస్ట్ ఒక్క పరుగు తక్కువగా 286పరుగులు చేసింది సన్ రైజర్స్. చివరి ఓవర్లలో వరుస వికెట్ల తీయటంతో రాజస్థాన్ రాయల్స్ ఈ రికార్డు ఆరెంజ్ ఆర్మీ చేతికి చిక్కకుండా చేయగలిగారు. సన్ రైజర్స్ బ్యాటర్ల ధాటికి రాజస్థాన్ లో ముగ్గురు బౌలర్లు 50 పరుగులకు పైగా సమర్పించుకున్నారు. ప్రత్యేకించి జోఫ్రా ఆర్చర్ అయితే 4 ఓవర్లలోనే 76పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకూ అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ గా నిలిచాడు. జోఫ్రాతో పాటు మతీశా తీక్షణ, సందీప్ శర్మ కూడా ధారాళంగా పరుగులు ఇవ్వటంతో సన్ రైజర్స్ పరుగుల వరద పారించింది.





















