Crime News: ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై ఉన్మాదిగా మారాడు - ల్యాప్ టాప్ ఇవ్వలేదని తల్లినే పొడిచి చంపేశాడు, విశాఖలో దారుణం
Visakha News: ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై ఓ యువకుడు ఉన్మాదిలా మారి తల్లినే హతమార్చిన దారుణ ఘటన విశాఖలో చోటు చేసుకుంది. తల్లి ఫోన్, ల్యాప్ టాప్ ఇవ్వలేదని కొడుకు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

Son Killed His Mother In Visakha: విశాఖలో (Visakha) దారుణం జరిగింది. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన ఓ యువకుడు.. తనను ఆట ఆడనివ్వకుండా అడ్డుకుందని కన్నతల్లినే కడతేర్చాడు. అమ్మపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈస్ట్రన్ సీ బోర్డు పరిధి తీరగస్తీ దళంలో విధులు నిర్వర్తిస్తోన్న బల్బీర్ సింగ్.. కుటుంబంతో సహా రాజస్థాన్ నుంచి వచ్చి విశాఖ కోస్టుగార్డు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. జనవరి 30న బల్బీర్‌సింగ్ విధులకు వెళ్లగా.. భార్య అల్కాసింగ్ (47), కుమారులు ఆన్‌మోల్‌సింగ్ (20), ఆయుష్మాన్ సింగ్ (18) ఇంటి వద్దే ఉంటున్నారు. అన్‌మోల్‌సింగ్.. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. హైదరాబాద్‌లోని కళాశాలలో చేరి ఇంటి వద్దే చదువుతూ పరీక్షలు రాస్తున్నాడు. గురువారం అన్‌మోల్‌సింగ్ ఇంట్లో ల్యాప్‌టాప్‌లో గేమ్ ఆడుతుండగా.. తల్లి అల్కాసింగ్ అతన్ని వారించింది.
ల్యాప్‌టాప్ దాచిపెట్టిందని..
చదువుకోకుండా నిత్యం ఆటలేంటంటూ ల్యాప్ టాప్, ఫోన్ దాచిపెట్టింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి పెనుగులాటకు దారితీసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అన్‌మోల్‌సింగ్ ఇంట్లోని కత్తితో తల్లిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆపై పొడిచి..గదిలో పడేసి తాళం వేసేశాడు. అప్పటివరకూ బయటకు వెళ్లిన ఆయుష్మాన్ సింగ్.. ఇంటికి వచ్చేసరికి గదికి తాళం వేసి ఉండడం.. అన్‌మోల్‌సింగ్ కంగారు పడడాన్ని గమనించి అతన్ని ప్రశ్నించాడు. క్వార్టర్స్‌లో ఇరుగుపొరుగు బెడ్ రూంలో తల్లి మృతదేహాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న మల్కాపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి మానసిక స్థితి సరిగ్గా ఉండదని బంధువులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

