AB Venkateswara Rao: రిటైర్డ్ ఐపీఎస్‌కు కీలక పదవి - పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏబీ వెంకటేశ్వరరావు
Andhra Pradesh: ఏబీ వెంకటేశ్వరరావుకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. వైసీపీ హయాంలో ఆయన ఐదేళ్ల పాటు వేధింపులను ఎదుర్కొన్నారు.

AB Venkateswara Rao Chairman of Police Housing Corporation: రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చింది. వైసీపీ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయనకు ప్రభుత్వం మారిన తర్వాత ఎడెనిమిది నెలలకు ఊరట దక్కుతోంది. ఆయనపై ఉన్న అభియోగాలను సాక్ష్యాల్లేని కారణంగా ఇటీవలే ఉపసంహరించుకున్నారు. అలాగే వైసీపీ హయాంలో సస్పెన్షన్ లో ఉన్న కాలంలో ఆయనకు నిలిపివేసిన జీత భత్యాలన్నింటినీ ఇవ్వాలని ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. తాజాగా ఆయనకు నామిటేటెడ్ పోస్టు కూడా ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ పోలీస్ కమిషనర్ గా.. ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి కారణం ఆయనేనన్న అనుమానంతో జగన్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. అంతే కాదు పలు కేసులు పెట్టారు. దేశద్రోహం కేసు పెట్టినట్లుగా వైసీపీ నేతలు ప్రచారం చేశారు. అయితే కొనుగోలే చేయని పరికరాల విషయంలో కేసులు పెట్టారని .. ఇదంతా కుట్ర పూరితమని ఆయన న్యాయపోరాటం చేశారు. కోర్టులు ఆయన సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆదేశాలు ఇచ్చినా ఓ సారి ఎత్తివేసి..మరోసారి సస్పెండ్ చేశారు. అలా నాలుగేళ్లకుపైగా ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు. మొత్తం ఐదేళ్ల పాటు ఆయనకు పోస్టింగ్ లేదు.
ఆయనను డిస్మిస్ చేయాలని కూడా కేంద్రానికి జగన్ ప్రభుత్వం సిఫారసు చేసింది. అయితే కేంద్రం ఆ సిఫారసును పట్టించుకోలేదు. రిటైర్మెంట్ ముందు రోజు కోర్టు ఉత్తర్వుల కారణంగా ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సి వచ్చింది. రిటైర్మెంట్ రోజు పోస్టింగ్ చేపట్టి అదే రోజున రిటైర్ అయ్యారు. అయితే ఐదేళ్ల పాటు ఆయన పడిన బాధలు అలాగే ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక ఆయనపై నమోదు చేసిన అభియోగాలు అన్నీ తప్పని ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఆయనకు పోలీసు శాఖతో సంబంధం ఉన్న పదవి ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
గతంలో ఓ సారి తనను ఇబ్బందులు పెట్టిన ఎవర్నీ వదిలి పెట్టబోనని ఆయన హెచ్చరించారు. ఇటీవల ఓ సామాజికవర్గ సమావేశంలోనూ ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్, రాజశేఖర్ రెడ్డి వేధింపులకు గురి చేశారని అయినా మద్దతు ఇవ్వడానికి ముందుకు రారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. నేరుగా పోలీసు వ్యవస్థలో జోక్యం చేసుకునే అవకాశం లేకపోయినా పోలీసు వ్యవస్థకు సంబంధం ఉన్న పోస్టు కావడంతో ఈ పదవి విషయంలో ఆయన సంతృప్తి చెందే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

