International Women's Day 2025 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం తేదీ, చరిత్ర.. ఈ సెలబ్రేషన్ వెనక ప్రాముఖ్యత, థీమ్ ఇవే
Women's Day 2025 : ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో.. దానివెనుకున్న కారణాలేంటో.. ప్రాముఖ్యత ఏంటో.. దీనిని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

Women's Day 2025 Theme and History : మహిళా దినోత్సవం 2025ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మహిళల సాధికారతను చెప్పే విధంగా అంతర్జాతీయంగా మహిళా దినోత్సవాన్ని (International Women's Day 2025) మార్చి 8వ తేదీన జరుపుకుంటారు. అసలు ఈ స్పెషల్ డేని ఎందుకు జరుపుతున్నారు.. దాని వెనుకున్న ప్రాముఖ్యత, చరిత్ర ఏంటి? ఈ ఏడాది థీమ్ ఏంటి వంటి.. ఎలా దీనిని సెలబ్రేట్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాము. మహిళలు సాధించిన విజయాలను గుర్తించి.. లింగ సమానత్వం గురించి అవగాహన కల్పిస్తూ.. మహిళా సాధికారతకు మద్ధతు ఇస్తూ.. దీనిని ప్రతి ఏటా సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులు.. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ సహకారాలపై అవగాహన కల్పించడమే దీని లక్ష్యం.
మహిళా దినోత్సవం చరిత్ర..
పనిగంటలు, వేతనాలపై మహిళా వస్త్ర కార్మికులు 1908లో న్యూయార్క్ వీధుల్లో తిరుగుతూ.. నిరసన చేశారు. ఈ నిరసనే.. ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవానికి దారితీసింది. ప్రారీశ్రామికీకరణ సమయంలో మొదటిసారిగా ఈ వేడుకను మార్చి 3వ తేదీన 1911లో యునైటైడ్ స్టేట్స్లో, యూరోపియన్ దేశాల్లో జరుపుకున్నారు. 1917లో రష్యన్ మహిళలు చేసిన సమ్మె తర్వాత ఇది మార్చి 8వ తేదీకి మారింది.
ఇండియాలో మొదటిసారి ఎప్పుడంటే..
ఐక్యరాజ్యసమితి 1975లో మార్చి 8వ తేదీన తేదీని ఇంటర్నేషనల్ వుమెన్స్ డేగా అధికారికంగా గుర్తించింది. అప్పటి నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన జరుపుతున్నారు. 2025లో ఇది శనివారం వచ్చింది. ఇండియాలో 1914లో పూణేలో.. స్వాతంత్ర్య పోరాటాలలో కీలకపాత్ర పోషించినందున మొదటిసారిగా మహిళా దినోత్సవం జరుపుకున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రాముఖ్యత
ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికల హక్కులను ముందుకు తీసుకెళ్లడానికి, వారికి మద్ధతు కల్పించడమే లక్ష్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చేస్తున్నారు. చట్టపరమైన రక్షణ-భద్రత ఇవ్వడంలో, మహిళల హక్కుల ఉద్యమాన్ని రూపొందించడంలో, వారికి అవసరమైన సేవలను అందించడంలో, సామాజిక నిబంధనల పేరుతో కట్టిపడేయకుండా.. స్టీరియోటైప్‌లను మార్చి వారిని పురోగతివైపు నడిపించడమే దీని ప్రాముఖ్యత. అందుకే ఈ స్పెషల్ డేకు ప్రపంచవ్యాప్తంగా విభిన్న దేశాల నుంచి మహిళలకు మద్ధతనందిస్తారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 థీమ్ ఇదే
ప్రతి ఏడాది ఓ కొత్త థీమ్‌తో మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది.. 'Accelerate Action' అనే థీమ్‌తో వస్తున్నారు. మహిళల పురోగతికి హెల్ప్ చేసే వ్యూహాలు, వనరులు, చొరవలను గుర్తించి.. వాటిని విస్తృతంగా, వేగంగా అమలు చేయాలనే ఉద్దేశాన్ని ఇది చెప్తుంది. అలాగే అన్ని రంగాల్లో లింగ సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం, మహిళలకు సాధికారత కల్పించడంపై ఇది అవగాహన కల్పిస్తుంది.
ఎలా సెలబ్రేట్ చేసుకుంటారంటే..
మహిళల విజయాలను గుర్తించి.. వాటిని తెరపైకి తీసుకొస్తూ సత్కరిస్తారు. వారిని ఎగ్జాంపుల్‌గా చూపిస్తూ.. సక్సెస్‌ఫుల్‌గా, భయం లేకుండా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు వెళ్లాలో అవగాహన కల్పిస్తారు. ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్న మహిళలకు దక్కాల్సిన చట్టాలు, భద్రతా ఏమిటో అవగాహన కల్పిస్తారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తారు. అమ్మాయిలకు చదువు ఎంత ముఖ్యమో చెప్తూ అవగాహన కల్పిస్తూ.. సభలు నిర్వహిస్తారు.
Also Read : మహిళ దినోత్సవం సందర్భంగా ఈ బహుమతులు ఇచ్చేయండి.. బెస్ట్ గిఫ్ట్ ఆప్షన్స్ ఇవే, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా






















