Pawan Kalyan:"పిఠాపురంలో రూల్‌బుక్, అభివృద్ధే మాట్లాడాలి" అధికారులకు కీలక ఆదేశాలు! మార్చి 14న భారీ బహిరంగ సభ
Pawan Kalyan:పిఠాపురంలో అభివృద్ధిపై దృష్టి పెట్టిన పవన్ కల్యాణ్ అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. జరుగుతున్న పనులపై ఎప్పటికప్పుడు తనకు అప్‌డేట్ ఇవ్వాలన్నారు.

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ఎప్పుడూ పిఠాపురం చుట్టూ తిరుగుతూ ఉంటోంది. ఇప్పుడు కూడా సంక్రాంతి వేళ అక్కడి నుంచి పవన్ చేసిన కామెంట్స్ హీట్ పుట్టించాయి. తనదైన శైలిలో ప్రత్యర్థులను హెచ్చరిస్తూనే కూటమి నేతలకు చురకలు అంటించారు. పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాల వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
కూటమి బంధం- విడగొట్టే వారికి స్ట్రాంగ్ వార్నింగ్
పిఠాపురంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంక్రాంతి మహోత్సవాలను పవన్ కల్యాణ్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాటలాడుతూ కేంద్ర, రాష్ట్ర స్థాయిలోని పార్టీలతో కూటమి నిర్మించడం అనేది ఎంతో శ్రమతో కూడుకున్న ప్రక్రియ అని, కానీ దాన్ని విడగొట్టడం మాత్రం చాలా సులభమని వ్యాఖ్యానించారు. కూటమి బలహీనపరిచేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని, అలాంటి ప్రయత్నాలు చేసే వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ప్రజలకు సుస్థిర పాలన అందించడమే తమ లక్ష్యమని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు, తనకు మధ్య అపారమైన అవగాహన ఉందని పవన్ స్పష్టం చేశారు. ఇద్దరి మద్య ఎలాంటి విభేదాలు, అరమరికలు లేవని ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ ఇద్దరి సమష్టి కృషేనని ఆయన నొక్కిచెప్పారు.

శాంతి భద్రతలు, రాజకీయ విమర్శలు
రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో పవన్ కల్యాణ్ అత్యంత కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. గత ప్రభుత్వం కేవలం బూతులు తిట్టడం, అక్రమ కేసులు పెట్టడంపైనే దృష్టి పెట్టారని, ఇప్పుడు మళ్లీ అదే పద్ధతులను పిఠాపురంలో అమలు చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "పులివెందులలో సొంత బాబాయిని చంపినా అది అక్కడ వార్త కాదు, కానీ పిఠాపురంలో చిన్న పిల్లల గొడవ పడితే దానికి కులమతాల రంగు పులిమి దారుణంగా చిత్రీకరిస్తున్నారు" అని విమర్శించారు. పిఠాపురంలో అశాంతి సృష్టించాలని చూస్తే, ఇక్కడే కూర్చునే అరాచక శక్తులను ఏరివేస్తానంటూ గర్జించారు. తనను మెత్తని మనిషిగా భావించి నెత్తికెక్కాలని చూడొద్దని అన్నారు. గొడవ పెట్టుకోవాలంటే తాను కూడా సిద్ధమని అన్నారు.

అందరం జవాబుదారిగా ఉందాం
"పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల సమయంలో ప్రజలకు మాటిచ్చాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నిర్ణీత వ్యవధిలో అందుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి" అని పవన్ అధికారులను ఆదేశించారు. పిఠాపురాన్ని స్వచ్ఛ, సుందర పిఠాపురంగా మార్చాలని నిధులకు కొరత రాకుండా చూసుకుంటాను అని అన్నారు. "పనుల్లో జాప్యం లేకుండా అధికారులు చూసుకోవాలి. అధికారుల విధి నిర్వహణలో ఎవరి జోక్యం ఉండదు.. అధికారులను ఎవరూ ఇబ్బందిపెట్టరు.. పాలనా వ్యవహారాల్లో రాజకీయ ప్రమేయం అసలు ఉండదు. ప్రతి అడుగులో నేను జవాబుదారీతనంతో ఉంటాను. పరిపాలనా వ్యవహారాల్లో అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించాలి. ప్రతి ఒక్కరు నిబంధనలకు లోబడి మాత్రమే పని చేయాలి." అని స్పష్టం చేశారు.

శుక్రవారం మధ్యాహ్నం పిఠాపురం నియోజకవర్గం కేంద్రంలోని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మోహన్ నగర్, ఇందిరా నగర్ ముంపు ప్రాంతాలను పవన్ పరిశీలించారు. అపరిశుభ్రత, డ్రెయిన్లు, కాలువలపై ఆక్రమణలు చూసి.. పారిశుధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణతో కలిసి జిల్లా ఇంచార్జి కలెక్టర్, ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

వచ్చిన వాళ్లు ముగ్ధులైపోవాలి
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ “పిఠాపురం ఆధ్యాత్మిక వారసత్వం కలిగిన పర్యాటక ప్రదేశం. మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుంచి ఇక్కడ శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి దర్శనానికి భక్తులు వస్తారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక్కటైన పురూహుతికా అమ్మవారి దర్శనానికీ నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. నియోజకవర్గంలో అడుగుపెట్టిన వారికి పచ్చని చెట్లతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం స్వాగతం పలకాలి. పిఠాపురం వచ్చిన వారికి ప్రత్యేకమైన అనుభూతి కలగాలి. ముందుగా ప్రధాన రహదారిని అందంగా ముస్తాబు చేయాలి. అందుకు అవసరం అయిన ప్రణాళికలు యుద్ధప్రాతిపదికన సిద్ధం చేయాలి. ఇక్కడ జరిగే అభివృద్ధి అన్ని నియోజకవర్గాలకు దిక్సూచి కావాలి."

ప్రైవేటు సాయం తీసుకోండి
"పిఠాపురంలో డ్రెయిన్లు తెరిచి ఉన్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా లేవని యానాదుల కాలనీవాసుల నుంచి ఫిర్యాదు వచ్చింది. డ్రెయినేజీ వ్యవస్థ ఇబ్బందిగా ఉందని ప్రజలు చెబుతున్నారు. డ్రెయిన్లు, పంట కాలువల్లో తక్షణం పూడికతీత పనులు చేపట్టండి. నియోజకవర్గ పరిధిలో ఎక్కడా చెత్త కనబడకూడదు. అందుకోసం తక్షణ ప్రణాళికలు అమలు చేయాలి. నియోజకవర్గం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రెయినేజ్ అవసరం ఉంది. సీవేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశాలు గుర్తించండి. పట్టణంలో ప్రధాన రహదారికి డివైడింగ్ లైన్లు వేయండి. అవసరమైతే మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు ప్రైవేటు కన్సల్టెన్సీల సాయం తీసుకోండి. జనాభా ప్రతిపదికన నియోజకవర్గానికి ఎన్ని పార్కులు అవసరం, వాటిని ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశాలు గుర్తించి ఒక నివేదిక రూపొందించండి." అని అధికారులకు సూచించారు.

నియోజకవర్గ అభివృద్ధిలో నెలవారి ప్రగతి
పవన్ నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడుతూ "కోనో కార్పస్ చెట్ల స్థానంలో స్వదేశీ జాతి చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఖాళీ ప్రదేశాల్లో సామాజిక వనాలను అభివృద్ధి చేయండి. మియావకీ ప్లాంటేషన్ పై ప్రజల్లో అవగాహన కల్పించండి. మోహన్ నగర్, రైల్వే ట్రాక్ ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జన సమస్య ఉంది. దీని మూలంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. అవసరం అయితే సామూహిక మరుగుదొడ్లు నిర్మించి, ప్రజలకు అవగాహన కల్పించండి. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటు వ్యవహారంలో సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయండి. ధ్వని కాలుష్యంపై దృష్టి సారించండి. మతపరమైన వేడుకలు నిర్వహించుకునే సమయంలో కూడా నిబంధనల మేరకే సౌండ్ పెట్టేలా చూడాలి. అన్ని మతాలకీ ఒకటే రూల్ అమలు చేయాలి. లా అండ్ ఆర్డర్ అమలు వ్యవహారంలో రాజీ పడవద్దు. పిఠాపురంలో ప్రతి అధికారి రూల్స్ మాత్రమే ఫాలో అవ్వాలి. ఎవరు ఏం అడిగినా రూల్స్ బుక్ మాత్రమే మాట్లాడాలి. పిఠాపురం నుంచే ఆ మార్పు ప్రారంభం కావాలి” అని స్పష్టం చేశారు.

అభివృద్ధి పథంలో పిఠాపురం- పార్టీ ఆవిర్భావ వేదిక
పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో తనకు ఎంత పట్టుదల ఉందో పవన్ వివరించారు. నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించిన ఆయన, ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ పనులను వేగవంతం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే పిఠాపురం నియోజకవర్గానికి పార్టీపరంగా ఉన్న ప్రాధాన్యత గుర్తు చేశారు. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభను పిఠాపురంలోనే అత్యంత భారీ స్థాయిలో నిర్వహించనున్నట్టు పవన్ ప్రకటించారు. పార్టీ పరిపాలన కార్యాలయం మంగళగిరిలో ఉన్నప్పటికీ పిఠాపురమే పార్టీకి ప్రధాన కేంద్ర స్థానమని ఆయన తేల్చి చెప్పారు. యుద్ధ కళలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో తన సొంత ట్రస్టు ద్వారా మార్షల్ ఆర్ట్స్, గ్రామీణ కళలను ప్రోత్సహించేలా ఒక సమీకృత అకాడమీని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.






















