Pawan Kalyan in Pithapuram: 211 రూపాయలతో కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పండుగ- జనంలోకి డిప్యూటీ సీఎం!
Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కల్యాణ్ 211 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రజలతో మమేకమయ్యారు.

Pithapuram development: పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాల వేళ పిఠాపురం నియోజకవర్గం సరికొత్త శోభను సంతరించుకుంది. కేవలం సంబరాలకే పరిమితం కాకుండా, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం ఏకకాలంలో రూ. 211 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా రూ. 9.60 కోట్లతో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్, కోనపాపపేటలో మల్టీపర్పస్ ఫిషరీస్ సెంటర్, ఉపాధి హామీ , ఆర్ అండ్ బి నిధులతో నిర్మించే రోడ్లు, గోకులాలు వంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా ఇన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల మధ్యకు పవన్ .. సమస్యల ఆరా
పండుగ వేడుకల అనంతరం, ప్రోటోకాల్ హంగులను పక్కనపెట్టి పవన్ కళ్యాణ్ నేరుగా ప్రజల మధ్యకు వెళ్లారు. ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. కళాశాల మైదానం నుంచి కుక్కుటేశ్వరస్వామి ఆలయం వరకు ఆయన కాలినడకన పర్యటించారు. వీధి వీధినా తిరుగుతూ సామాన్యులను పలుకరిస్తూ ముందుకు సాగిన ఆయనకు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలో పలువురు మహిళలు తమ ఇంటి స్థలాల సమస్యను, మరికొందరు ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగల గురించి ఆయన దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులను పిలిచి అక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.
పోలీస్ స్టేషన్ తనిఖీ - శాంతిభద్రతలపై ఆరా
తన పర్యటనలో భాగంగా పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌ను పవన్ కళ్యాణ్ ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్‌లోని గదులను పరిశీలించిన ఆయన, నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఉన్నతాధికారులతో చర్చించారు. అనంతరం స్టేషన్ సిబ్బందితో ముచ్చటించి, వారితో ఫొటోలు దిగి ఉత్సాహపరిచారు. నియోజకవర్గంలో చట్టం తన పని తాను చేయాలని, సామాన్యులకు భద్రతా భావం కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యతని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
పీఠికాపురాన ముందస్తు సంక్రాంతి కాంతులు
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) January 9, 2026
•మూడు రోజుల వేడుకలకు శ్రీకారం చుట్టిన ఉపముఖ్యమంత్రి @PawanKalyan
•అచ్చ తెలుగు సంస్కృతిని ఆవిష్కరించిన సంక్రాంతి సంబరాలు
•ఆకట్టుకున్న జానపద కళారూపాలు, శాస్త్రీయ నృత్యరీతులు
•డప్పు శబ్దాలు, కొమ్ముకోయల ఆటలు.. గరగ నృత్యాలు, వీరనాట్య రీతులు,… pic.twitter.com/Qzr3HumAYq
అణగారిన వర్గాల చెంతకు.. పక్కా ఇళ్ల భరోసా
కుక్కుటేశ్వరస్వామి ఆలయ సమీపంలోని యానాదుల కాలనీ వాసులను సందర్శించి వారి జీవన స్థితిగతులను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ సమస్యలు, పక్కా ఇళ్ల నిర్మాణం గురించి కాలనీవాసులు విన్నవించగా, వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆలయ పరిసరాల్లోని చిరు వ్యాపారులను సైతం పలుకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఆయన, చివరగా ఆలయ అర్చకుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు చేరువగా ఉంటూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగిన ఆయన క్షేత్రస్థాయి పర్యటనపై స్థానికల్లో మంచి స్పందన వ్యక్తమయింది.





















