Harshit Rana: గంభీర్ దత్తపుత్రుడు అంటూ ట్రోలింగ్.. కట్ చేస్తే టీమిండియా సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా రికార్డ్
Most successful bowler for india | 2025 నుంచి భారత బౌలర్లలో అత్యధిక వన్డే వికెట్లు తీసి హర్షిత్ రాణా సత్తా చాటాడు. రికమెండేసన్ క్యాండిడేట్ అని ట్రోల్ చేస్తే వికెట్లు తీసి నిరూపించుకున్నాడు.

రాజ్‌కోట్: అతడ్ని జట్టులోకి తీసుకుంటే రికమండేషన్ క్యాండిడేట్ అని ట్రోల్ చేశారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు దత్త పుత్రుడు అని ఎగతాళి చేశారు. కానీ సీన్ కట్ చేస్తే భారత జట్టులో సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా మారాడు. అతడు మరెవరో కాదు టీమిండియా పేసర్ హర్షిత్ రాణా. వన్డే క్రికెట్‌లో భారత జట్టులో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిరూపించుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఈ 24 ఏళ్ల భారత బౌలర్ మెరుగ్గా రాణిస్తున్నాడు.
వాస్తవానికి, 2025 నుంచి ఇప్పటివరకు హర్షిత్ రాణా వన్డేలలో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. కివీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో హర్షిత్ రాణా 2 వికెట్లు తీశాడు. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ప్రస్తుతానికి ఒక వికెట్ తీశాడు.
అత్యంత విజయవంతమైన బౌలర్ హర్షిత్ రాణా..
ఫిబ్రవరి 2025లో హర్షిత్ రాణా ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డేలో తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. అరంగేట్రం నుండి ఇప్పటివరకు 13 వన్డే ఇన్నింగ్స్‌లలో హర్షిత్ రాణా 23 వికెట్లు తీశాడు. గత ఏడాది నుంచి భారత్ తరపున వికెట్లలో ఇదే అత్యధికం. అయితే, అతను ఇప్పటివరకు ఒక్క ఇన్నింగ్స్‌లో కూడా 5 వికెట్ల హాల్ సాధించలేదు. కానీ వీలుచిక్కినప్పుడల్లా వికెట్లు తీస్తూ బెస్ట్ అని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.
2025 నుండి ఇప్పటివరకు వన్డేలలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో కుల్దీప్ యాదవ్ రెండవ స్థానంలో ఉన్నాడు. చైనామన్ బౌలర్ కుల్దీప్ 12 ఇన్నింగ్స్‌లలో 20 వికెట్లు తీశాడు. అదే సమయంలో ఆల్ రౌండర్ బౌలర్ రవీంద్ర జడేజా 12 వికెట్లు తీసి మూడో స్థానంలో ఉన్నాడు.
- 23 వికెట్లు - హర్షిత్ రాణా (వార్త రాసే సమయానికి)
- 20 వికెట్లు - కుల్దీప్ యాదవ్
- 12 వికెట్లు - రవీంద్ర జడేజా
హర్షిత్ రాణా అద్భుతమైన గణాంకాలు
హర్షిత్ రాణా రెగ్యూలర్‌గా గంటకు 140 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగలడు. భారత్ తరఫున ప్రస్తుతం అత్యంత వేగంగా బంతులు సంధిస్తున్న బౌలర్ తనే. హర్షిత్ రాణా ఇప్పటివరకు 13 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. వాటిలో కేవలం 2 సార్లు మాత్రమే మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. ముఖ్యంగా కొత్త బంతితో చాలా ప్రభావవంతంగా ఉన్నాడు. కానీ డెత్ ఓవర్లలో చాలాసార్లు పరుగులు అధికంగా సమర్పించుకున్నాడు. బౌలింగ్ ఎకానమీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాగా, హర్షిత్ రాణా 6 టీ20 మ్యాచ్‌లలో 7 వికెట్లు కూడా తీశాడు. అదే విధంగా 2 టెస్ట్ మ్యాచ్‌లలో అతడు 4 వికెట్లు తీశాడు. అవసరమైతే చివర్లో బ్యాటుతోనూ పరుగులు సాధించగలడు.





















