Chandrababu: తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
Water disputes: తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో రేవంత్ కూడా ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు.

Negotiations between Telugu states: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు , ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న వివాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టతనిచ్చారు. అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెంచే ప్రయత్నాలు ఎవరూ చేయవద్దని ఆయన హితవు పలికారు. తనకు రాజకీయం కంటే తెలుగు ప్రజల బాధ్యత, వారి ప్రయోజనాలే ముఖ్యమని ఆయన తేల్చి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో శుక్రవారం నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై మరియు రాష్ట్ర ప్రయోజనాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
నీటి విషయంలో కొందరు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. నీళ్లు కావాలా? గొడవలు కావాలా? అని అడిగితే.. కొంతమంది నీళ్లు వద్దు మాకు గొడవలే కావాలని కోరుకుంటున్నారు అని ఆయన పరోక్షంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ ఓ వీరుడు బయలుదేరాడు అంటూ పరోక్షంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల పేరిట విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండదని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల అవసరాలను తీర్చే ప్రాజెక్టులు శాస్త్రీయంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
#PattadarPassbooks #FarmersFriendlyGovt
— Yash (@YashTDP_) January 9, 2026
మండపేట నియోజకవర్గం, రాయవరంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. రాయవరంలో కంటిపూడి సత్యసాయిబాబా అనే రైతుకు పట్టాదారుపాసుపుస్తకాన్ని సీఎం అందించారు. అనంతరం పాసుపుస్తకంలో… pic.twitter.com/MpaVrdOHUx
నాకు గొడవలు ముఖ్యం కాదు, తెలుగు జాతి అభివృద్ధి ముఖ్యం అని చంద్రబాబు స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాలతో సమస్యలు ఉంటే కూర్చుని చర్చించుకోవాలని, అంతేకానీ ప్రజల మధ్య గోడలు కట్టేలా ప్రసంగాలు చేయకూడదని చెప్పారు. అభివృద్ధి విషయంలో రెండు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగాలని, అప్పుడే తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ లో రేవంత్ కూడా ఇవే తరహా వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో రేవంత్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలను కొనసాగిస్తూనే పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధిని చూడటం మానుకోవాలి. మాకు పొరుగు రాష్ట్రాలతో పంచాయితీలు పెట్టుకోవడం కంటే సమస్యల పరిష్కారమే ముఖ్యం అని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన తెలంగాణ ప్రాజెక్టులకు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డుపడవద్దని కోరారు. మీకు పంచాయితీలు కావాలా? నీళ్లు కావాలా? అని ఎవరైనా అడిగితే.. నాకు, నా తెలంగాణకు నీళ్లు మాత్రమే కావాలని చెబుతాను అని ఆయన పేర్కొన్నారు. వివాదాల కంటే శాశ్వత పరిష్కారాలకే మొగ్గు చూపుతామని స్పష్టం చేశారు.





















