240 crore scam network: ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
Cyber crime: ఓ తల్లి తన కుమారుడితో కలిసి రూ.240 కోట్ల సైబర్ క్రైమ్ చేసింది. విదేశీ మోసగాళ్లతో చేతులు కలిపి అమాయకుల్ని దోచుకుంది.

Bengaluru mother son scam network: బెంగళూరులో వెలుగుచూసిన రూ. 240 కోట్ల భారీ సైబర్ స్కామ్ నెట్‌వర్క్ ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. ఒక తల్లి, కుమారుడు కలిసి ఏకంగా 9,000 మ్యూల్ ఖాతాలు, 242 ఏటీఎం కార్డులతో ఒక సమాంతర బ్యాంకింగ్ వ్యవస్థనే నడిపించడం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. ఈ భారీ నెట్‌వర్క్ కార్యకలాపాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
కూలీల పేరుతో బ్యాంక్ అకౌంట్లు
బెంగళూరుకు చెందిన వసంతకుమారి అనే మహిళ, ఆమె కుమారుడు మనోజ్ ( ఈ కుంభకోణానికి సూత్రధారులు. వీరు నిరుపేదలు, కూలీలు, సామాన్యులను ఆశ చూపి వారి పేరు మీద బ్యాంకు ఖాతాలను తెరిపించేవారు. ఒక్కో అకౌంట్ తెరిపించినందుకు ఆ వ్యక్తికి కొంత మొత్తం ఇచ్చి, ఆ ఖాతాకు సంబంధించిన పాస్‌బుక్‌లు, చెక్ బుక్‌లు , ఏటీఎం కార్డులను వీరు తమ ఆధీనంలో ఉంచుకునేవారు. ఇలా సేకరించిన దాదాపు 9,000 మ్యూల్ అకౌంట్లను సైబర్ నేరగాళ్లకు అద్దెకు ఇచ్చి, అక్రమ సొమ్మును మళ్లించేందుకు మార్గం సుగమం చేశారు.
సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మదర్-సన్ నెట్‌వర్క్
విదేశాల్లో ప్రధానంగా చైనా, దుబాయ్ లో ఉండి భారతీయులను మోసం చేసే సైబర్ నేరగాళ్లకు ఈ తల్లి-కొడుకులు లాజిస్టిక్ పార్ట్నర్స్ గా వ్యవహరించారు. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్, టాస్క్ బేస్డ్ స్కామ్స్ ద్వారా బాధితుల నుంచి దోచుకున్న సొమ్ము నేరుగా వీరు సేకరించిన అకౌంట్లలోకి వచ్చేది. అక్కడి నుంచి ఆ సొమ్మును క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చడం లేదా ఇతర అజ్ఞాత ఖాతాలకు మళ్లించడం చేసేవారు. పోలీసులు వీరి నుంచి 242 ఏటీఎం కార్డులు, 12 మొబైల్ ఫోన్లు , కోట్లాది రూపాయల లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
టెక్నాలజీతో కూడిన మోసం
వీరు కేవలం అకౌంట్లు సేకరించడమే కాకుండా, పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు అత్యంత ఆధునిక సాంకేతికతను వాడారు. వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్స్ , ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్స్,,టెలిగ్రామ్ వంటివి ఉపయోగించడం ద్వారా విదేశీ హ్యాకర్లతో టచ్‌లో ఉండేవారు. నేరం జరిగిన వెంటనే ఆ అకౌంట్లలోని సొమ్మును డ్రా చేయడం లేదా ట్రాన్స్‌ఫర్ చేయడం చేసేవారు. వీరి నెట్‌వర్క్ ద్వారా దాదాపు రూ. 240 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సామాన్యులకు ఒక కీలక హెచ్చరిక జారీ చేశారు. డబ్బు వస్తుంది కదా అని మీ ఆధార్, పాన్ కార్డులు ఇతరులకు ఇవ్వడం లేదా మీ పేరు మీద ఇతరుల కోసం బ్యాంకు ఖాతాలు తెరవడం నేరమని స్పష్టం చేశారు. అటువంటి అకౌంట్లు ద్వారా జరిగే ప్రతి పైసా మోసానికి ఖాతాదారులు కూడా బాధ్యులవుతారని, కఠిన చట్టాల కింద జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు.




















