Woman Auto Driver Murder: ఝాన్సీ మొదటి మహిళా ఆటో డ్రైవర్ హత్య కేసు.. బ్రేకప్ చెప్పిందని ప్రియుడే కాల్చి చంపాడు
Jhansi woman auto driver murder case | ఝాన్సీలో తొలి మహిళా ఆటో డ్రైవర్ ప్రేమ కథ విషాదాంతమైంది. ఆఖరికి అదే ఆమె ప్రాణాలు బలిగొంది. తనను మోసం చేసిందని భావించిన నిందితుడు ముఖేష్ ఝా దారుణంగా హత్యచేశాడు.

ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నగరానికి చెందిన మొట్టమొదటి మహిళా ఆటో డ్రైవర్‌గా గుర్తింపు పొందిన 45 ఏళ్ల అనితా చౌదరి ఇటీవల దారుణ హత్యకు గురయ్యారు. జనవరి 4 (సోమవారం) తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో నవాబాద్ పోలీస్ పరిధిలోని స్టేషన్ రోడ్డు సమీపంలో ఆమె మృతదేహం లభ్యమైంది. అంతకుముందు రోజు రాత్రి పని కోసం ఇంటి నుండి ఆటో తీసుకుని వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
మృతదేహానికి కొంత దూరంలో ఆమె ఆటో రిక్షా పడి ఉండగా, ఆమె ఒంటిపై ఉన్న నగలతో పాటు మొబైల్ ఫోన్ కనిపించకుండా పోయాయి. సామాజిక అడ్డంకులను అధిగమించిన అనిత 2021లో ఆటో నడపడం ప్రారంభించారు. తన కుటుంబానికి జీవనాధారంగా నిలవడంతో పాటు ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. కానీ ఆమె జీవితం విషాదంగా ముగిసింది.
పోలీసు విచారణ, ముగ్గురు నిందితుల అరెస్టు
ఈ హత్యకు సంబంధించి ముఖేష్ ఝా (37), అతని బావ మనోజ్ ఝా (35), అతడి కుమారుడు శివమ్ ఝా (18) లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మనోజ్, శివమ్‌లను పోలీసులు ముందే అరెస్టు చేశారు. ముఖేష్ గురించి సమాచారం అందించిన వారికి రూ. 25,000 రివార్డును పోలీసులు ప్రకటించారు. చివరకు పోలీసులు అతడిని పట్టుకునే క్రమంలో, ముఖేష్ పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ప్రధాన నిందితుడు ముఖేష్ కుడి కాలికి గాయమైంది. ఆ తర్వాత ప్రధాన నిందితుడు ముఖేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తనతో రిలేషన్‌షిప్ ముగించడంతో మాజీ ప్రియుడే ఆమెను హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది. కొన్ని సంవత్సరాలపాటు ముఖేష్, అనిత సహజీవనం చేశారని పోలీసులు గుర్తించారు. అయితే బ్రేకప్ చెప్పడంతో పాటు మరో వ్యక్తితో అనితకు రిలేషన్ ఉందని అనుమానంతో ఆమెను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. మోసం చేసిందన్న కోపంతోనే ఈ హత్య చేసినట్లు ముఖేష్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.
హత్యకు దారితీసిన కారణాలు
ఝాన్సీ తొలి మహిళా ఆటో డ్రైవర్ అనిత, ముఖేష్ గత నాలుగు సంవత్సరాలుగా సహజీవనం (Live-in relationship) చేశారు. అయితే ఆరు నెలల క్రితం అనిత ప్రియుడికి బ్రేకప్ చెప్పిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రధాన నిందితుడు, అనిత ప్రియుడు ముఖేష్‌కు అప్పటికే పెళ్లై ఒక కుమారుడు ఉన్నాడు. అయితే అనిత మరొక వ్యక్తితో మాట్లాడుతుందనే అనుమానంతో రగిలిపోయాడు. వీరిద్దరి మధ్య గత కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. ముఖేష్ పెళ్లి విషయాన్ని చెప్పకుండా తనతో దాచిపెట్టి మోసం చేశాడని అనిత అతడితో బంధానికి స్వస్తి పలికింది. తనకు బ్రేకప్ చెప్పిన అనిత మరో వ్యక్తితో సన్నిహితంగా ఉందేమోనని అనుమానం పెంచుకున్నాడు.
ముఖేష్‌పై అనిత గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో జనవరి 4 రాత్రి అనిత ఒక ప్రయాణికుడిని దించుతుండగా, ముఖేష్ తన కారుతో ఆమె ఆటోను వెంబడించాడు. మార్గం మధ్యలో ఆటోను అడ్డగించి, ఆమెపై అతి సమీపం నుండి కాల్పులు జరిపాడు. బుల్లెట్ గాయాలతో తీవ్ర రక్తస్రావమై అనిత ప్రాణాలు కోల్పోయింది. ఝాన్సీలో ఒక స్ఫూర్తిదాయక మహిళా ఆటో డ్రైవర్‌గా ఎదిగిన అనిత జీవితం ఓ వివాహితుడితో ప్రేమాయణం విషాదాన్ని మిగిల్చింది. ఝాన్సీ సిటీతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎందరో మహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలిచింది.






















