Hyderabad Crime News: ఏపీలో గ్రూప్ 2 క్రాక్ చేసిన అంబర్‌పేట ఎస్సై; కానీ బెట్టింగ్ వ్యసనంతో జైలుపాలు! తాకట్టులో సర్వీస్ రివాల్వర్
Hyderabad Crime News:పోలీసుశాఖలో బ్లాక్ మార్క్‌గా మిగిలిపోయే ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఓ ఎస్సై బెట్టింగ్ వ్యసనంతో అక్రమాలకు పాల్పడ్డాడు. సర్వీస్ రివాల్వర్ కూడా తకట్టు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.

Hyderabad Crime News: సమాజంలో శాంతిభద్రతలను కాపాడవలసిన చేతులే నేరాలకు పాల్పడితే. రక్షణ కవచమే భక్షిస్తే ఏమవుతుందో అంబర్‌పేట ఎస్సై భాను ప్రకాష్ రెడ్డి ఉదయం నిరూపిస్తుంది. ఒక బాధ్యతాయుతమైన పోలీసు అధికారిగా ఉండి, ప్రజల ఆస్తులను కాపాడాల్సిన స్థానంలో కూర్చొని, స్వయంగా దొంగతనాలకు, అక్రమాలకు పాల్పడి నేడు చంచల్‌గూడ జైలు ఊచలు లెక్క పెడుతున్న పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది. ఈ కేసులో వెలుగు చూస్తున్న నిజాలు పోలీసు శాఖను సైతం విస్మయానికి గురి చేస్తున్నాయి.
బెట్టింగ్ భూతం- రికవరీ సొత్తు స్వాహా
ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన అంశం బెట్టింగ్. భాను ప్రకాష్ రెడ్డి గత కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైనట్టు ప్రాథమిక విచారణలో తేలింది. జూదం కారణంగా చేసిన అప్పులు తీర్చుకోవడానికి ఆయన ఒక అత్యంత దారుణమైన మార్గాన్ని ఎంచుకున్నారు. వివిధ కేసుల్లో పోలీసులు రికవరీ చేసిన నగదు, బంగారాన్ని బాధితులకు లేదా కోర్టుకు అప్పగించాల్సి ఉంటుంది. కానీ ఆయన తన సొంతానికి వాడుకున్నాడు.
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తును ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయకుండా లేదా తప్పుడు లెక్కలు చూపిస్తూ, వాటిని బయట తాకట్టు పెట్టి, అప్పులు తీర్చుకోవడానికి ప్రయత్నించాడు. రక్షక భటుడు దొంగగా మారిన ఈ తీరుపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.
తాకట్టులో రివాల్వర్?
భాను ప్రకాష్ రెడ్డిపై ఉన్న మరో ప్రధాన ఆరోపణ సర్వీస్ రివాల్వర్ అదృశ్యం. పోలీసులకు ప్రభుత్వం ఇచ్చే ఆయుధం అత్యంత పవిత్రమైంది. బాధ్యతాయుతమైంది. అయితే తన రివాల్వర్‌ను భాను ప్రకాష్ రెడ్డి పోగొట్టుకున్నాడు. ఇది పోలీసుల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
మొదట పోలీసు విచారణలో ఆయన పరస్పర విరుద్ధమైన స్టేట్‌మెంట్‌లు ఇచ్చినట్టు తెలుస్తోంది. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో తన గన్ ఎక్కడో పడిపోయిందని ఆయన అధికారులకు చెప్పాడు. అయితే ఆ గన్ కోసం ఎంత వెతికినా ఆ ఆచూకీ లభించలేదని ఆయన స్వయంగా అంగీకరించాడు. అసలు ఆ గన్ నిజంగానే పోయిందా, లేదా దాన్ని కూడా ఎక్కడైనా తాకట్టు పెట్టారా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
అరెస్టు, రిమాండ్
ఉన్నతాధికారుల విచారణలో భాను ప్రకాష్ రెడ్డి అక్రమాలు ఆధారాలతో నిరూపణ అయ్యింది. దీంతో వెంటనే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
చేతికి వచ్చిన గ్రూప్-2 ఉద్యోగం పోయినట్టే!
అత్యంత విషాదకరమైన, విస్మయకరమైన మలుపు ఆయన కెరీర్, భాను ప్రకాష్ రెడ్డి ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన గ్రూప్ -2 పరీక్షలల్లో ఉత్తీర్ణత సాధించి, మంచి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తెలంగాణ పోలీసు శాఖ నుంచి రిలీవ్ అయి, ఏపీలో కొత్త హోదాలో చేరాలని ఆయన ఇప్పటికే ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఒక గౌరవప్రదమైన హోదా నుంచి అంతకంటే మెరుగైన హోదాలోకి వెళ్లాల్సిన వ్యక్తి కేవలం బెట్టింగ్ వ్యసనం వల్ల జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు అరెస్టు కావడంతో ఆయన కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం దాదాపుగా మూసుకుపోయినట్టే.





















