MLC Vijayashanti: ఎమ్మెల్సీ రేసులో విజయశాంతి - సైలెంట్ గా ప్రయత్నాలు - సీల్డ్ కవర్‌లో పేరు వస్తుందా ?
Telangana: ఎమ్మెల్సీ పదవి కోసం విజయశాంతి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ నేతలకు విజ్ఞప్తులు చేస్తున్నారు.

Vijayashanti is trying for the MLC post: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరో ఎమ్మెల్సీ ఆశావహులు తెరపైకి వచ్చారు. అయితే తెర వెనుక హైకమాండ్డ వద్ద నుంచి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆ లీడర్ ఎవరో కాదు.. విజయశాంతి. ఎమ్మెల్సీ సీటు కోసం ఢిల్లీలో విజయశాంతి మంతనాలు జరుపుతున్నట్లుగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సమాచారం వచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన విజయశాంతి ..ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ కోసం తాను చేసిన త్యాగాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
కాంగ్రెస్ లో గుర్తింపు లేని విజయశాంతి
విజయశాంతి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. టిక్కెట్ ఇవ్వలేదు. అసెంబ్లీకి కానీ.. పార్లమెంట్ కు కానీ పోటీ చేసే అవకాశం లభించలేదు. చివరికి ఆమెతో పెద్దగా ప్రచారం చేయించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఇక పూర్తిగా ఆమె ఫేడవుట్ అయ్యారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో నటించిన ఆమె..తాజాగా కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తున్నారు.
పదవి కోసం హైకమాండ్ వద్ద ప్రయత్నాలు
రాజకీయంగా యాక్టివ్ అయిన తర్వాత సినిమాల్లో నటించడం లేదు. మొదటగా తల్లి తెలంగాణ అనే పార్టీ పెట్టిన ఆమె తర్వాత చాలా పార్టీలు మారారు. బీజేపీ నుండి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్, కాంగ్రెస్ నుండి బీజేపీ, బీజేపీ నుండి గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు.బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓ సారి విజయం సాధించారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటించారు. ఆ ప్రకారం తెలంగాణ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో మెదక్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. రాజకీయంగా వేగంగా జంపింగ్‌లు చేయడంతో ఆమె ప్రాధాన్యాన్ని కోల్పోయారు.
సీల్డ్ కవర్ లో రాములమ్మ పేరు వస్తుందా ?
అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో హైకమాండ్ వద్ద గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీని కూడా సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు తెలంగాణ కాంగ్రెస్ లో తమ కోటా కింద వచ్చే మూడు సీట్ల కోసం ముఫ్పై మంది పోటీ పడుతున్నారు. ఎవరు పోటీ పడినా.. హైకమాండ్ నుంచి వచ్చే సీల్డ్ కవర్ లో ఉండే పేర్లకే ఆమోదం లభిస్తుంది కాబట్టి.. ఇక్కడ నేతలపై ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా రాములమ్మ ఢిల్లీలోనే ప్రయత్నిస్తున్నారు. మరి సీల్డ్ కవర్‌లో రాములమ్మ పేరు వస్తుందా ? ఎమ్మెల్సీ అవుతారా ?
Also Read: SLBC టన్నెల్ ఆపరేషన్‌లోకి కేరళ కుక్కలు





















