Ind vs Nz :గంగూలీ సెంచరీ.. సచిన్ హాఫ్ సెంచరీ అయినా... టైటిల్ కొట్టేసిన న్యూజిలాండ్
Champions Trophy 2025: గంగూలీ సెంచరీ.. సచిన్ హాఫ్ సెంచరీ చేశారు అయిన మ్యాచ్ ఇండియా గెలవలేకపోయింది. టైటిల్‌ను న్యూజిలాండ్‌కు ఇచ్చేసింది. ఇది జరిగి పాతికేళ్లు అవుతున్నా నేటికీ వెంటాడుతున్న ఓ పీడ కల.

Champions Trophy 2025 Final Match: పాతికేళ్ళ నాటి సీన్ రిపీట్ అవుతోంది. ఛాంపిపియన్స్ ట్రోఫీలో ఇండియా -న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. బలమైన టీమ్స్ మధ్య జరుగుతున్న టైటిల్ రేసులో మరోసారి 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సీన్ రిపీట్ అవ్వకూడదని ఇండియన్ టీం ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇండియన్ క్రికెట్ లెజెండ్స్ గంగూలి సెంచరీ, సచిన్ ఆఫ్ సెంచరీ చేసినా కివిస్ ఇండియన్ టీమ్ ను ఎలా ఓడించగలిగింది.. అసలు ఆ ఫైనల్లో ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం..!
కెన్యాలో జరిగిన 2000 ఛాంపియన్స్ ట్రోఫీ
కెన్యాలో క్రికెట్ను డెవలప్ చేయడం కోసం ఐసీసీ 2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఆ దేశంలో నిర్వహించింది. అప్పట్లో దాన్ని నాకౌట్ ట్రోఫీ అని పిలిచేవారు. క్వార్టర్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను, సెమీ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించిన ఇండియా సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు సెమీఫైనల్‌ల్లో పాకిస్తాన్ టీమ్‌ను ఓడించిన న్యూజిలాండ్ ఫైనల్లో ఇండియాకు ఎదురుగా నిలిచింది. నైరోబిలో జరిగిన ఈ మ్యాచ్‌లో దిగ్గజాలతో నిండిన ఇండియన్ టీందే ట్రోఫీ అని అందరూ భావించారు. దానికి తగ్గట్టే ఓపెనర్లు సచిన్ టెండూల్కర్ 69,సౌరవ్ గంగూలి 117 రన్స్ కొట్టారు. తొలి వికెట్ పడేసరికి ఇండియా స్కోర్ 141 (26.3 ఓవర్ల లో).కానీ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించకపోవడంతో ఇండియా 264/6 (50 ఓవర్ల లో ) పరుగులు మాత్రమే చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన న్యూజిలాండ్ జట్టు ఈ లక్ష్యాన్ని (265/6) మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. వెంకటేష్ ప్రసాద్ అద్భుతంగా బౌలింగ్ వేసి 3 వికెట్స్ తీసినా న్యూజిలాండ్ మిడిల్ అర్డర్ బ్యాట్స్‌మెన్ క్రిస్ కైర్న్స్ సూపర్ సెంచరీ 102 నాటౌట్ (113 బంతుల్లో ), క్రిస్ హామ్స్ 46 (72 బంతుల్లో ) నిలబడిపోవడంతో న్యూజిలాండ్ ఆ ట్రోఫీని కైవసం చేసుకుంది. సెంచురీ చేసిన క్రిస్ కైర్న్స్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. చాలామంది 2003 వరల్డ్ కప్ ఫైనల్ అంటారు. కానీ నిజానికి 2000 నాకొట్ ట్రోఫీ పరాజయం ఇంకా చాలామంది ఇండియన్ టీమ్ అభిమానులకు ఒక పీడ కల లా మిగిలిపోయిన మాట వాస్తవం.
మరోసారి ఫైనల్లో తలపడుతున్న ఇండియా - కివీస్
మళ్ళీ పాతికేళ్ళ తర్వాత ఇండియా - న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడుతున్నాయి. ఇప్పటికే గ్రూప్ స్టేజ్‌లో ఇండియా చేతిలో ఓటమి పాలైంది న్యూజిలాండ్. అయినా గానీ న్యూజిలాండ్ తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అనగానే పాతికేళ్ళ నాటి చేదు జ్ఞాపకం గుర్తుకు వస్తోంది. పైగా రచిన్ రవీంద్ర,కేన్ విలియమ్సన్ దక్షిణాఫ్రికా మ్యాచ్ లో సెంచరీలు చేసి భీకర ఫామ్ లో ఉన్నారు. ఇక ఇండియన్ టీమ్ ప్రస్తుతం మ్యాచ్ విన్నర్ల తో నిండిపోయి ఉంది. రోహిత్,గిల్ కోహ్లీ ,శ్రేయస్ అయ్యర్, అక్షర్,హార్థిక్, రాహుల్, జడేజా ఇలా భీకరబ్యాటింగ్ లైనప్, షమి, హార్దిక్, వరుణ్, కులదీప్ ల బౌలింగ్ తో పటిష్టం గా ఉంది. దీనితో ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా దే అని ఫ్యాన్స్ సంబరాలకు రెడీ అవుతున్నారు.




















