Ramzan: రంజాన్ పండుగ ఎందుకు, ఎలా జరుపుకుంటారో మీకు తెలుసా ?
Ramadan | రంజాన్ అనేది ఓ నెల పేరు. జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నట్లే. రంజాన్ లేదా రమదాన్ అనేది ముస్లిం క్యాలెండర్ లో తొమ్మిదో నెల. ఈ నెలలోనే పవిత్ర ఖురాన్ అవతరించిందని ముస్లిం పండితులు చెబుతారు.

ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే పండుగల్లో రంజాన్ ప్రత్యేకమైంది. ఎంతో పవిత్రంగా రంజాన్ పండుగను ముస్లింలు ఆచరిస్తారు. అయితే దీని పుట్టు పూర్వోత్తరాలు ఏంటని చూస్తే, రంజాన్ అనేది ఓ నెల పేరు. మనకు జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నట్లే. రంజాన్ లేదా రమదాన్ అనేది ముస్లిం క్యాలెండర్ లో తొమ్మిదో నెల. ముస్లింలు ఆచరించేది చంద్రమాన క్యాలెండర్. ముస్లిం క్యాలెండర్ అనేది ఎలా ఏర్పడిందంటే..మహమ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనా వెళ్లడం జరిగింది. దీన్నే హిజ్రత్ అని కూడా అంటారు. క్రీస్తు శకం లేదా సామాన్య శకం 622 లో ఇది జరిగినట్లు చెబుతారు. దీన్నే హిజ్రీ శకం అని అంటారు.
మొదటి నెల మొహరం
క్రీస్తు శకం లేదా సామాన్య శకం 638లో ఈ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రారంభమయినట్లు చరిత్ర చెబుతోంది. ఈ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల మొహరం, రెండో నెల సఫర్, మూడో నెల రబీ ఉల్ - అవ్వల్, నాలుగో నెల రబీ ఉల్ -ఆఖిర్, ఐదో నెల జమాది ఉల్ - అవ్వల్, ఆరో నెల జమాది ఉస్- సాని, ఏడో నెల రజబ్, ఎనిమిదో నెల షాబాన్, తొమ్మిదో నెల రంజాన్, పదో నెల షవ్వాల్, పదకొండో నెల జుల్ - ఖాదా, పన్నెండో నెల జుల్ - హిజ్జా. అయితే తొమ్మిదో నెల రంజాన్. ఈ నెలలోనే పవిత్ర ఖురాన్ అవతరించిందని ముస్లిం పండితులు చెబుతారు. అందుకే ఈ రంజాన్ నెలను పవిత్ర మాసంగా, పవిత్ర పండుగగా ప్రతీ ముస్లింలు ఆచరిస్తారు. ఈ పండుగనే ఈద్ - ఉల్ - ఫిత్ర అని కూడా పిలుస్తారు.
రంజాన్ పండుగ ప్రాముఖ్యతలు ఇవే...
రోజా ... ఉపవాసం..
రంజాన్ పండుగలో ముస్లింలు ఈ నెల అంతా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసంలో ఉంటారు. అన్న పానీయాలకు దూరంగా ఉంటారు, కొద్ది మంది నోటిలో ఉమ్మిని కూడా మింగనంత కఠిన ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసాన్ని పార్సీ బాషలో రోజా అని,అరబ్బీ బాషలో సౌమ్ అని పిలుస్తారు. ఉపవాసం అనే విధి ఖురాన్ లో రాయబడి ఉంది. రోజా పాటించడం ద్వారా ఖురాన్ పట్ల విధేయతను, అల్లాకు తమ భక్తి ప్రపత్తులు ప్రకటిస్తారు. అంతే కాకుండా ఖురాన్ ద్వారా అల్లా చూపించిన భక్తి మార్గం అనుసరించడం, నిషేధించిన పనులను చేయుకుండా ఉండటం రోజాలో భాగమే. అంతే కాకుండా ప్రతీ ముస్లిం ఈ రోజా పాటించడం ద్వారా స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ ను అలవాటు చేసుకోవడంగాను ముస్లిం మత పెద్దలు విశ్లేషిస్తారు.
జకాత్... దాన ధర్మాలు చేయడం...
రంజాన్ నెలలో సంపన్నులైన ముస్లింలు జకాత్ ఆచరించాలని అంటే తమ సంపదలో కొంత పేదలకు దాన ధర్మంగా ఇవ్వాలన్నది ఖురాన్ నుండి వెలువడిన అల్లా ఆజ్ఞ. సంపాదనపరులైన ముస్లింలు తప్పనిసరిగా జకాత్ పాటించాలని ముస్లిం మత పెద్దలు చెబుతారు. ఇది పేదల హక్కుగా అభివర్ణిస్తారు. ఈ నెలలో తాము ఏడాదంతా సంపాదించిన స్వీయ సంపాదనలో కొంత నిర్ణీత మొత్తాన్ని పేదలకు పంచి ఇవ్వాలి. రంజాన్ పండుగలో ఈ పేదలకు భాగస్వామ్యం కల్పించడమనదే అల్లా దైవాజ్ఞగా చెబుతారు. ఇది కేవలం రంజాన్ పండుగ వరకే కాకుండా ఎల్ల వేళలా భక్తులు, పేదలను ఆదుకోవాలన్న అల్లా ఆలోచనను ఖురాన్ ను ఫాలో అయ్యే అందరికీ కలిగించేందుకే ఈ జకాత్ అని మత పెద్దలు విశ్లేషిస్తారు.
ఫిత్రా ... ఉపవాస విరమణ
రంజాన్ పండుగ రోజు ఈ ఫిత్రా దానం చేయాలి. ఫిత్రా అంటే ఉపవాస విరమణ లేదా దిగ్విజయంగా రోజా ను పాటించి పూర్తి చేయడం . దీన్నే సద్ ఖయే ఫిత్ర్ అని కూడా అంటారు. దైవ నియమం ప్రకారం రంజాన్ మాసం అంతా రోజా పాటించి పూర్తి చేయడమనే అర్థం వస్తుంది. అయితే మహమ్మద్ ప్రవక్త ఆజ్ఞ ప్రకారం. రంజాన్ పండు రోజు మూడు పూటలా తిండి, బట్ట లేని అభాగ్యులకు ఈ ఫిత్రా దానం చేయాలి. ఉపవాస సమయంలో దైవ నియమాల ప్రకారం రోజా పాటించినా తెలిసీ తెలియని తప్పులు జరుగుతాయని,ఆ పొరపాట్లు క్షమించబడాలంటే, తమ సంపదను దైవాజ్ఞ ప్రకారం పేదలకు దానం చేయడం ఒక మార్గంగా మహ్మద్ ప్రవక్త సూచించారు.
ప్రతీ ముస్లిం రంజాన్ పండుగ సందర్భంగా సంతోషంతో పండుగ దినాలు జరుపుకుంటుంటే, పేదలు, అభాగ్యులు మాత్రం దయనీయమైన స్థితిలో ఉండి ఉంటారు. అలాంటి వారు కూడా అల్లా ఆజ్ఞ ప్రకారం ఈ పండుగలో సంతోషంగా పాలుపంచుకోవాలంటే వారికి ఫిత్రా దానం చేయాలన్నది రంజాన్ కట్టడ. అయితే ఈ ఫిత్రా కింద దాదాపు రెండున్నర కిలోల ఆహార పదార్థాలు దానం చేయాలని ముస్లిం మత పెద్దలు చెబుతారు. పండుగ ముందు ( ఈద్ నమాజ్ ) కు ముందు చేసే ఫిత్రాను అల్లా గొప్పదిగా భావిస్తారని, ఆ తర్వాత ఇచ్చేది సాధారణ ఫిత్రాగా భావిస్తారని చెబుతారు. ఇది ఎందుకంటే పండుగ ముందే ఫిత్రా చెల్లిస్తే ఆ పండుగను పేదలు ఆచరించడానికి అవకాశం ఉంటుందని,ఆ తర్వాత ఇస్తే పండుగలో పేదలు, అనాధలకు పాలుపంచుకునే
అవకాశం ఉండదని చెబుతారు.
సుహుర్ - ఇఫ్తార్
రంజాన్ నెల ఆరంభం నుండి ముగిసే వరకు ముస్లిం భక్తులు కఠినమైన రోజా ( ఉపవాసాన్ని) పాటిస్తారు. అయితే సూర్యోదయం ముందు వారు ఆహరం తీసుకొని, సూర్యాస్తమయం తర్వాతే తిరిగి ఉపవాసాన్ని విడుస్తారు. సూర్యోదయం ముందు ఆహరం తీసుకోవడాన్ని సుహుర్ అని, ఉపవాస దీక్ష సూరోయదయం తర్వాత విరమించడాన్ని ఇఫ్తార్ అని పిలుస్తారు. అయితే రంజాన్ పాటించేవారు ఉదయం తెల్లవారుజామున ప్రార్థనకు ముందు సుహుర్ తీసుకుంటారు. ఇక ఉపవాస విరమణకు ఎక్కువగా ఖర్జురాలు తింటారు. ఇది ప్రవక్త మహమ్మద్
ఆనాడు ఉపవాస దీక్ష విరమణకు ఖర్జురాలే తినేవారని మత పెద్దలు చెబుతారు. వీటితో పాటు పండ్లు, ఇతర ఆహారం తీసుకుంటారు. ఈ సుహుర్, ఇఫ్తార్ కుడా రంజాన్ పండుగలో ప్రాముఖ్యమైన అంశాలు.
షవ్వాల్ - ఈదుల్ ఫితర్
రంజాన్ పండుగలో షవ్వాల్ ప్రాముఖ్యమైంది. రంజాన్ నెల నెలవంకతో ప్రారంభమయ్యే తొమ్మిదో నెల, షవ్వాల్ నెలవంకతో ప్రారంభమయ్యే పదో నెల. అత్యంత పవిత్రంగా ఈ రంజాన్ మాసం ముగియడం, రోజాను దిగ్విజయంగా పాటించడం, దాన ధర్మాలు , నమాజ్ వంటి కార్యక్రమాలు చక్కగా అమలు చేయడం తర్వాత రంజాన్ నెల ముగింపు, ఆ తర్వాత షవ్వాల్ నెలను ఈదుల్ ఫితర్ తో ప్రారంభిస్తారు. దీన్నే ఉపవాసం విరమించే పండుగా కూడా చెబుతారు. ఈ పండుగలో పెద్ద ఎత్తున అందరు ఓ చోట కూడి సామాజిక ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత భోజనాలు చేస్తారు. బంధు, మిత్రులతో సంభాషిస్తూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు.






















