PM Modi Visits Vantara: సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
గుజరాత్‌లోని వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. అక్కడ ఆసియా సింహాలు, చిరుతలు, ఇతర జంతువులను ఆయన పరిశీలించారు. సంరక్షకులు, సిబ్బందితో మాట్లాడారు.

PM Modi inaugurates Vantara | గుజరాత్‌లోని వంతారా జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇవాళ ఈ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని...అక్కడ జంతువులతో చాలా సమయం గడిపారు. వంతారా అనేది అడవి ప్రాణుల రక్షణ, పునారావాసం, సంరక్షణ కోసం ప్రారంభించిన ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రం. ఈ కేంద్రంలో 2,000కి పైగా జాతులకు చెందిన 1,50,000 కు పైగా జీవులు ఉన్నాయి. ఈ పర్యటనలో ప్రధాని ఆ కేంద్రం మొత్తాన్ని సందర్శించి చాలా చోట్ల ఆగి జంతువులతో సమయం గడిపారు. వన్యప్రాణులతో సంభాషించారు.
వంతరాలోని వైల్డ్‌లైఫ్ హాస్పిటల్‌ను సందర్శించిన మోదీ, అక్కడ ఏర్పాటు చేసిన అధునాతన వెటర్నరీ సౌకర్యాలను పరిశీలించారు. ఇందులో MRI, CT స్కాన్ యంత్రాలు, ఐసీయూలు, వైల్డ్‌లైఫ్ అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్ వంటి ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. ఈ కేంద్రంలోని ఆసియాటిక్ సింహం పిల్లలు, తెల్ల సింహం పిల్ల, అరుదైన క్లౌడెడ్ లెపర్డ్ పిల్ల, కరికల్ పిల్ల సహా పలు జంతువులతో ఆడుతూ... వాటికి ఆహారం పెట్టారు. మోదీ ఆహారం పెట్టిన తెల్ల సింహం పిల్ల వంతరాలోనే జన్మించింది. దాని తల్లిని రక్షించి ఇక్కడ సంరక్షణ కోసం తీసుకొచ్చారు.

కేవలం జంతువులతో ప్రేమగా సంభాషించడమే కాకుండా.. అక్కడ ఉన్న అధునాతన వైద్య సదుపాయాలను కూడా పరిశీలించారు. అక్కడ MRI స్కాన్ చేయించుకుంటున్న ఆసియాటిక్ సింహాన్ని చూశారు. అలాగే, ఓపరేషన్ థియేటర్‌లో, రహదారిపై వాహనం ఢీకొట్టి గాయపడిన చిరుతపులిని వైద్యులు అత్యవసరంగా శస్త్రచికిత్స చేస్తుండగా పరిశీలించారు. వంతరాలో సంరక్షిస్తున్న జంతువులన్నింటినీ వాటి సహజ నివాసాలకు దగ్గరగా అనుభూతి కలిగించే విధంగా ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ప్రదేశాల్లో ఉంచారు.
గోల్డెన్ టైగర్‌తో ఫేస్ టు ఫేస్
ఈ పర్యటనలో మోదీ అనేకమైన క్రూర జంతువులతో చాలా సన్నిహితంగా మెలిగారు. ఆయన గోల్డెన్ టైగర్‌తో పాటు.. సర్కస్ నుంచి తీసుకొచ్చిన స్నో టైగర్‌లు, తెల్లసింహం, స్నో లెపర్డ్‌లతో ఆయన చాలా ఆహ్లాదకరమైన సమయాన్ని గడిపారు. ఒకాపీని ప్రేమగా , ఒకప్పుడు తాను పెంచుకున్న Chimpanzeesను కలుసుకుని, ఓరంగుటాన్‌తో ఆడిపాడారు. అదే విధంగా ఓ జిరాఫీకి, ఒంటికొమ్ము ఉన్న రైనో పిల్లకు ఆహారం అందించారు. ఈ రైనో తల్లి ఇదే కేంద్రంలో చనిపోయింది.

అంతేకాదు, ప్రధానమంత్రి నీటిలో ఈత కొడుతున్న హిప్పోను, మొసళ్ళను, జీబ్రాలను గమనించారు. ఈ కేంద్రంలో పెద్ద జంతువులే కాకుండా కొన్ని అరుదైన పాములు, తాబేళ్లు వంటివి కూడా ఉన్నాయి. మోదీ ఓ పెద్ద కొండ చిలువతో పాటు, అరుదైన రెండు తలల పాము, రెండు తలల తాబేలు, టపిర్, వ్యవసాయ పొలాల్లో నుంచి సంరక్షించి తీసుకొచ్చిన చిరుత పిల్లలు, సీల్స్ వంటి ఎన్నో అరుదైన జాతులను దగ్గరగా చూశారు.
అతిపెద్ద ఏనుగుల హాస్పిటల్
హస్తి ఆసుపత్రిని సందర్శించిన మోదీ, అక్కడ గజరాజులకు ఏర్పాటు చేసిన హైడ్రోథెరపీ ప్రోగ్రామ్‌ను చూశారు. ఏనుగులకు మోకాళ్ళ నొప్పులు, కాళ్ల సమస్యలను తగ్గించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన Jacuzzi లో ఏనుగులు ఎంజాయ్ చేయడాన్ని ప్రధాని ఆసక్తిగా తిలకించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏనుగుల ఆసుపత్రి.

ఇక చివరిగా వంతారా ఆనవాయితీ ప్రకారం.. సంరక్షించిన చిలుకలను ఆయన అడవిలోకి విడిచిపెట్టారు. ఆ తర్వాత వంతరా కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది, కార్మికులతో ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.





















