Telangana Cabinet Decisions : ఉద్యోగ ప్రకటనలు, బడ్జెట్ సమావేశాలు, - తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
Telangana Cabinet Decisions : ఆరు గంటలకుపైగా సమావేశమైన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగ ప్రకటనలు, బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.

Telangana Cabinet Decisions : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ప్రభావం ప్రభుత్వంపై గట్టిగానే పడినట్టు కనిపిస్తోంది. అందుకే సుదీర్ఘంగా సాగిన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, నామినేటెడ్ పదవుల భర్తీ, బడ్జెట్ సమావేశాలు ఇలా అన్నింటిపై మంత్రులు చర్చించారు.
మంత్రిమండలి ప్రారంభంలోనే ఎస్సీ వర్గీకరణ ముసాయిదాకు ఓకే చెప్పింది. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. దీన్ని ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించి కేంద్ర కోర్టులో వేయాలని రేవంత్ సర్కారు చూస్తోంది. బీసీ రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత వస్తే స్థానిక సంస్థల ఎన్నికలు ఇతర జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు లైన్ క్లియర్ అవుతుందని సర్కారు భావిస్తోంది. అందుకే పార్లమెంట్ సమావేశాలు ముగిసే లోపు ఈ బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించాలని చూస్తున్నారు.
Also Read: తెలంగాణలో బీజేపీ పొలిటికల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం - కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం !
2025-26 సంవత్సరానికి చెందిన బడ్జెట్‌పై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశాలు ఎప్పటి నుంచి పెట్టాలనే అంశంపై మంత్రులు చర్చించుకున్నారు. మార్చి 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దాదాపు పదిహేను రోజుల పాటు ఈ సమావేశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకమైన పట్టభద్రుల స్థానంలో ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. దీంతో యువతలో ఆగ్రహం ఉందని గ్రహించిన ప్రభుత్వం వీలైనంత త్వరగా మరిన్ని ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సిద్ధమైంది. రానున్న రోజుల్లో భారీగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. ముందుగా 10,950 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులు నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరు చేయనున్నారు. 10 జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న 55 ఉద్యోగాల భర్తీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇంకా పెండింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాలు వీలైనంత త్వరగా అమలు చేయడంతో పాటు వాటి ప్రచారంపై కూడా దృష్టి పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పథకాల అమలు గురించి ఆలోచించి వస్తున్న విమర్శలు పట్టించుకోలేదని అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విరుద్ధమైన ఫలితాలు వచ్చాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఇకపై విమర్శలకు దీటుగా బదులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.
Also Read: కేసీఆర్‌కూ అనర్హతా వేటు భయం - జగన్ ప్లాన్‌లోనే ఒక్క రోజు సభకు హాజరు?





















