HYDRA Success: మోకాలు లోతు తవ్వగా ఉప్పొంగిన గంగ, హైదరాబాద్‌లో ఫలిస్తున్న హైడ్రా చర్యలు - స్థానికులు హర్షం
Hyderabad News | మోకాలు లోతు తవ్వగా అంబర్‌పేట లోని బతుకమ్మ కుంటలో నీళ్లు ఉబికి వచ్చాయి. దాంతో హైడ్రా చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Bathukamma Kunta Lake | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థ చర్యలు ఫలితాలు ఇస్తున్నాయి. మోకాలు లోతు తవ్వగానే పాతాళ గంగ ఉప్పొంగింది. నగరంలోని అంబర్ పేటలో హైడ్రా తవ్వకాల్లో బతుకమ్మకుంట బయటపడింది. కొద్దిలోతు తవ్వగానే నీరు ఉబికి రావడంతో బతుకమ్మ కుంటకు మళ్లీ ప్రాణం పోశారని స్థానికులు అంటున్నారుు. బతుకమ్మ కుంట బతికే ఉందని హర్షం వ్యక్తం చేశారు.
బతుకమ్మ కుంట బతికే ఉంది..
పలువురి చేతిలో కబ్జాలకు గురై, ఎండిపోయి జీవం పోయిందనుకున్నాం. మా బతుకమ్మ కుంట బతికే ఉంది. అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటలో మోకాలు లోతు మట్టి తీయగానే బిరబిరా గంగమ్మ బయటకొచ్చిందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు హైడ్రా తవ్వకాల్లో పైపులైన్లు పగిలి నీళ్లు వచ్చాయని ప్రచారం సైతం జరిగింది. దీనిపై స్పందించిన జలమండలి అధికారులు బతుకమ్మ కుంట వద్దకు వెళ్లి పరిశీలించారు. అవి భూగర్భం నుంచి వచ్చిన నీళ్లు అని, ఎలాంటి పైపులైన్ లేదని స్పష్టం చేసి వదంతులకు చెక్ పెట్టారు.
ఇది బతుకమ్మ కుంట కాదు, తమ స్థలమంటూ ఇప్పటివరకు వాదించిన వారు ఇప్పుడు ఏమంటారు? అని స్థానికులు నిలదీస్తున్నారు. నగరంలోని పలు ఏరియాలలో చెరువులు కబ్జాలు, నాలాలు కబ్జాలు గురయ్యారని ప్రతి సోమవారం హైడ్రా ఆఫీసులో ఫిర్యాదులు ఇస్తున్నారు. వాటిపై స్పందిస్తున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని చెరువు కబ్జాల వద్ద పునరుద్ధరణ పనులు చేపట్టారు. అక్కడ ముల్ల పొదలు తొలగించి, హైడ్రా తవ్వకాలు చేపట్టగానే గంగమ్మ ఉబికివచ్చింది. మట్టి మొత్తం తొలగిస్తే జీవకళ వచ్చి చెరువు కళకళలాడుతుందని స్థానికులు కోరుతున్నారు.
బతుకమ్మ కుంట స్థలం తనదేనని స్థానిక నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టుకు వెళ్లాలని హైకోర్టు సూచించింది. మరోవైపు ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా చర్యలు చేపట్టడంతో ఫలితం వచ్చింది.
చెరువు చరిత్ర ఇదీ
నగరంలోని అంబర్‌పేట మండలం బాగ్ అంబర్‌పేటలో బతుకమ్మ కుంట ఉంది. బాగ్ అంబర్‌పేటలోని సర్వే నంబర్ 563లో 1962-63 లెక్కల ప్రకారం మొత్తం 14.06 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. బఫర్ జోన్‌తో కలిపి మొత్తం వైశాల్యం 16.13 ఎకరాలని సర్వే అధికారులు తేల్చారు. తాజా సర్వే ప్రకారం కేవలం 5.15 ఎకరాల మాత్రమే మిగిలింది. అందులోనే బతుకమ్మ కుంటను పునరుద్ధరించేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. చుట్టుపక్కల నివాసం ఉన్న వారికి ఏ ముప్పు లేకుండా చెరువు తవ్వకానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు ఇచ్చారు.
ఒకప్పుడు ఈ చెరువు ఎర్రకుంటగా ఉండేది. కానీ కాలక్రమంలో బతుకమ్మ కుంటగా మారింది. రెవెన్యూ రికార్డులలో ఇదే విషయం ఉంటుందని స్థానికులు తెలిపారు. గత కొన్ని దశాబ్దాలుగా ఈ బతుకమ్మ కుంటలో చెత్తా చెదారంతో పాటు నిర్మాణ వ్యర్థాలు వేయడంతో పూడుకుపోయి చెరువు ఆనవాళ్లు కోల్పోయింది. ఇటీవల హైడ్రాకు ఫిర్యాదులు రావడంతో గత ఏడాది నవంబర్ లో బతుకమ్మ కుంట చుట్టుపక్కల అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి హైడ్రా కూల్చివేసింది. తాజాగా బతుకమ్మ కుంట పునరుద్ధరణ, సుందరీకరణ పనులు హైడ్రా చేపట్టింది. తమ ఇంటి పక్కన చెరువు లాంటి నీటి లభ్యత ఉంటే భూగర్భ జలాల పెరుగుతాయని, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.






















