Harish Rao On Telangana Rising Global Summit: రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోలా గ్లోబల్ సమ్మిట్.. అట్టర్ ఫ్లాప్ షో! హరీష్ రావు తీవ్ర విమర్శలు
Telangana News | తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 రియల్ ఎస్టేట్ ఎక్స్ పోలా ఉందని, అట్టర్ ఫ్లాప్ షో అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు.

Telangana Rising Global Summit 2025 | హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌ను మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) తీవ్రంగా విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించింది గ్లోబల్ సమ్మిట్ లాగా లేదని, భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో లాగా ఉందని హరీష్ రావు ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ వేదికగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకుందని, ఇది అందాల పోటీల్లాగే, ఏఐ సమ్మిట్ లాగే.. అట్టర్ ఫ్లాప్ షో అయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు.
విజన్ డాక్యుమెంట్‌పై ప్రశ్నలు, హాజరుపై విమర్శలు
విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్‌లో విజన్ లేదు, దాన్ని చేరుకునే మిషన్ లేదు అని హరీష్ రావు విమర్శించారు. విజన్ డాక్యుమెంట్ తయారీలో కమిట్‌మెంట్ లేదని, దానికి శాంటిటీ లేదని ప్రశ్నించారు. ఇది అక్షరాలు, అంకెలు, రంగురంగుల పేజీలతో అర్థం లేకుండా అల్లిన అబద్ధాలు, అర్థసత్యాల 'విజన్ లెస్' డాక్యుమెంట్ అని కొట్టిపారేశారు. ఈ గ్లోబల్ సమ్మిట్, రెండేళ్ల పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి రేవంత్ రెడ్డి చేసిన పీఆర్ స్టంట్ మాత్రమే అని ఆయన ఆరోపించారు.
గ్లోబల్ సమ్మిట్ అని మూడు నెలల నుంచి ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 5 వేల మంది విదేశీ ప్రతినిధులు వస్తారని చెప్పిందని, మంత్రులు స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికలు అందించినా కనీసం ఒక్క ముఖ్యమంత్రి రాలేదని, 5 వేల మంది విదేశీ రిప్రెజెంటేటివ్స్ రాలేదని అన్నారు. ముఖ్యమంత్రి భాగస్వామి డీకే శివకుమార్ తప్ప, చివరకు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ ఎంపీలు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని, ఇది గ్లోబల్ సమ్మిట్ కాదు లోకల్ సమ్మిట్.. అట్టర్ ఫ్లాప్ పొలిటికల్ షో అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఆఖరుకు ఎంబీఏ విద్యార్థులను, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు కోట్ వేసి తెచ్చి కూర్చోబెట్టారని విమర్శించారు.
రియల్ ఎస్టేట్ స్కాం ఆరోపణలు
ఫార్మా సిటీ భూముల్లో ఫ్యూచర్ సిటీ అని, ఆ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల కోసం గ్లోబల్ సమ్మిట్ అని రేవంత్ రెడ్డి ఒక అందమైన కట్టుకథ అల్లి, బయో స్కోప్ సినిమా చూపించారని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటికే భూముల స్కాం, పవర్ స్కాం, లిక్కర్ స్కాం అయ్యిందని, ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్కాం మొదలుపెట్టారని అన్నారు. రేవంతు గ్లోబల్ సమ్మిట్ పెట్టింది ఫోర్త్ సిటీ వైపు రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కోసమే కానీ, పెట్టుబడుల కోసం కాదని అందరికీ అర్థమైందని పేర్కొన్నారు. ఫార్మా సిటీ పక్క భూములను ముందే బినామీలతో కొనిపించి, లే అవుట్లు చేసి రెడీగా పెట్టుకున్నారని, ఇప్పుడు అక్కడ గ్లోబల్ సమ్మిట్ అని పెట్టి, ఆ భూములను తెగ నమ్మడానికి ప్లాన్ వేశారని, గ్లోబల్ సమ్మిట్ పేరిట రియల్ ఎస్టేట్ స్కాంకు తెరతీశారని హరీష్ రావు విమర్శించారు.
గత పెట్టుబడులు, శ్వేతపత్రం డిమాండ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలు, గతంలో నిర్వహించిన సమ్మిట్‌ల గురించి హరీష్ రావు ప్రస్తావించారు. 2024 జనవరిలో దావోస్ సమావేశానికి వెళ్లి రూ. 40,232 కోట్ల పెట్టుబడులు, 2,500 ఉద్యోగాలు వస్తాయని చెప్పారని, 2024 సెప్టెంబర్‌లో ఏఐ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి 100 దేశాల కంపెనీలు, 20 ఒప్పందాలు అన్నారని, జనవరి 2025లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల (1.78 లక్షల కోట్లు) పెట్టుబడుల ఒప్పందాలు, 49,550 ఉద్యోగాలు ప్రకటించారని గుర్తు చేశారు.
దావోస్, అమెరికా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్ పర్యటనల ద్వారా తెచ్చిన ఆ పెట్టుబడులు ఏమయ్యాయి? ఆ ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయి? అని హరీష్ రావు ప్రశ్నించారు. నిన్న, మొన్న జరిగిన సమ్మిట్‌లో ఏకంగా 5 లక్షల కోట్ల పై చిలుకు పెట్టుబడులు, వేల సంఖ్యలో ఉద్యోగాలు అంటున్నారని, దీనిపై బహిరంగ సవాల్ విసిరారు. రెండేళ్లుగా కోట్లు ఖర్చు చేసి తిరిగిన దేశాలు, నిర్వహించిన సమ్మిట్స్ ద్వారా మొత్తం ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి? అందులో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయి? ఎంత మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి? అనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అభివృద్ధి వికేంద్రీకరణ, రాజకీయ విమర్శలు
2025-26 బడ్జెట్ ప్రసంగంలో మెగా మాస్టర్ ప్లాన్ 2050 పేరుతో పారిశ్రామిక వికేంద్రీకరణ జరిపి తెలంగాణలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి చేస్తామని అన్నారని, కానీ ఇప్పుడేమో ఫ్యూచర్ సిటీ పేరిట ఒకే ప్రాంతంలో పరిశ్రమల కేంద్రీకరణ చేయాలని చూస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి చెత్త విధానాలను చూసి ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని, ఫ్యూచర్ సిటీ అని ఫార్మాసిటీని బొంద పెట్టినందుకే సిగాచి ఇండస్ట్రీస్, విరూపాక్ష ఆర్గానిక్స్ వంటి హైదరాబాద్ బేస్డ్ ఫార్మా కంపెనీలు ఆంధ్రకు తరలివెళ్లి, కర్నూల్ జిల్లాలోని ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్ లో రూ. 2,315 కోట్ల పెట్టుబడులు పెట్టి, 3,000 ఉద్యోగాలు ఇచ్చే ప్రణాళికలు రూపొందించాయని ఆయన పేర్కొన్నారు.
గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంటే హైదరాబాద్‌లో నడిరోడ్డుపై మర్డర్లు జరుగుతున్నాయని, 'తెలంగాణ అంటే బిజినెస్' అంటూ దిగజారుడు నిర్వచనాలు ఇచ్చే ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రజలు, రైతుల కష్టాలు కనిపించవా అని ప్రశ్నించారు. అంబానీలు, ఆదానీలు దేశాన్ని దోచుకుంటున్నారని రాహుల్ గాంధీ చెబుతుంటే, ఆయన దగ్గర ఉద్యోగం చేస్తున్నానని చెప్పుకునే రేవంత్ రెడ్డి మాత్రం అంబానీ, ఆదానీలకు తెలంగాణను అమ్మేస్తున్నారని తీవ్ర ఆరోపణ చేశారు. గ్లోబల్ సమ్మిట్ లో ఎంఓయూల వెనుక చీకటి ఒప్పందాలు, అంకెల గారడీ తప్ప ప్రజలకు పనికొచ్చే పనులు లేవన్నారు.
కేసీఆర్ పాలనపై టోనీ బ్లెయిర్ ప్రశంసల ప్రస్తావన
సమ్మిట్ ప్రారంభ కార్యక్రమంలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ మరియు ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చేసిన వ్యాఖ్యలను హరీష్ రావు ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి సమక్షంలోనే టోనీ బ్లెయిర్ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన రికార్డు స్థాయి తెలంగాణ అభివృద్ధి గురించి, తెలంగాణ ఒక మోడల్ అని పొగిడారని గుర్తు చేశారు. అదే వేదిక నుండి దువ్వూరి సుబ్బారావు కూడా కేసీఆర్ పాలనలో వృద్ధిరేటులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ప్రశంసించారని తెలిపారు. కేసీఆర్ పదేళ్ల పాలన గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని, తన చెత్త విధానాలు, చిల్లర చేష్టలు, వాటాలు, కమీషన్ల కోసం కేసీఆర్ చేసిన అభివృద్ధిని నాశనం చేయొద్దని హితవు పలికారు. రేవంత్ రెడ్డికి చేతనైతే ఆ అభివృద్ధిని కొనసాగించి చూపాలని డిమాండ్ చేశారు.






















