YS Jagan: మాజీ సీఎం జగన్ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనపై కుట్ర జరుగుతోంది- వైసీపీ ఆరోపణలు
Andhra Pradesh News | మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనపై కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.

YS Jagan visit to Guntur Mirchi Yard | అమరావతి: నిన్న విజయవాడలో పర్యటించి సబ్ జైలులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించిన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు గుంటూరులో పర్యటించనున్నారు. కానీ వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చియార్డు పర్యటనపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మిర్చి యార్డుకు వెళ్లడం, రాజకీయ కామెంట్లు చేయడం, మైకులో మాట్లాడటం నిషేధమని పోలీసులు చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలుంటాయని పోలీసులు వైసీపీ నేతల్ని హెచ్చరిస్తున్నారు.
జగన్ మిర్చి యార్డ్ పర్యటనపై కుట్ర జరుగుతోంది..
గుంటూరు: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనపై కుట్ర జరుగుతోందని పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. మాజీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డ్ పర్యటనకు ఎలాంటి ఎన్నికల కోడ్ వర్తించదు అన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉందని తెలుసు. కానీ మేం ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదు. ఎలాంటి ప్రచారం సైతం చేయట్లేదు. ఇంకా చెప్పాలంటే మిర్చి యార్డులో మైకు కూడా వాడటం లేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
మాజీ సీఎం పర్యటనకు సెక్యూరిటీ ఇవ్వరా..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఇవ్వాల్సిన సెక్యూరిటీ పోలీసులు ఇచ్చి తీరాల్సిందే అన్నారు. ఎన్నికల కోడ్ సాకుతో జగన్ పర్యటనను ఇబ్బంది పెడితే వాళ్లే ఇబ్బంది పడతారని.. పోలీస్ అధికారులు ఇది గుర్తుంచుకోవాలని అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మిర్చి ధర సగానికి సగం పడిపోయింది. దాంతో మిర్చి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లేని పంటల్ని సైతం జగన్ ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయగా, కూటమి ప్రభుత్వంలో రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఆరోపించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

