(Source: ECI/ABP News/ABP Majha)
Viral News: అద్దెకు బాల్కనీ, నెలకు రూ.81,000 మాత్రమే - ఇంటి రేటు సెపరేటు
Balcony For Rent: అద్దెకు ఇల్లు కావాలనుకుంటున్న వ్యక్తులు కొన్నిసార్లు వేలంపాటకు దిగుతున్నారు. పోటీలు పడి అద్దెను పెంచుతూ, యజమాని లిస్ట్ చేసినదాని కంటే ఎక్కువ మొత్తాన్ని కోట్ చేస్తున్నారు.
Balcony For Rent In Sydney: ప్రపంచవ్యాప్తంగా పెద్ద నగరాల్లో ఇంటి అద్దెలు ఏ స్థాయిలో ఉన్నాయో, జీవన వ్యయాలు ఏ రేంజ్‌లో పెరిగాయో స్పష్టమైన ఉదాహరణతో చెప్పే కథనం ఇది. ఈ మధ్యకాలంలో, ఫేస్‌బుక్‌లో ఒక విచిత్రమైన ప్రకటన వచ్చింది. సిడ్నీలోని ఒక ఇంటి యజమాని ఆ ప్రకటన ఇచ్చాడు. నెలకు కేవలం 969 డాలర్ల (రూ. 81,003) అద్దె చెల్లించి తన ఇంటి బాల్కనీలో ఉండొచ్చని ఆ ప్రకటనలో వెల్లడించాడు. మీరు చదివింది నిజమే. అతను, తన ఇంటిని కాదు అద్దెకు ఇస్తోంది, కేవలం బాల్కనీని మాత్రమే రెంట్‌కు ఇస్తున్నాడు.
బాల్కనీని మాత్రమే అద్దెకు తీసుకుని ఏం చేస్తారు?. కనీసం ఒక బాత్‌రూమ్, బెడ్‌రూమ్ ఉండాలిగా అనుకుంటున్నారా?. ఇంటి ఓనర్ ఆ ఏర్పాట్లు కూడా చేశాడు. ఆ బాల్కనీని గ్లాస్‌తో మూసేసి, అక్కడో మంచం వేశాడు. అంత రెంట్ కట్టడానికి ఆ ఇల్లేమైనా సిడ్నీ మధ్యలో ఉందా అంటే అదీ కాదు, నగరానికి ఓ మూలన ఉంది.
సన్నీ రూమ్
ఆ ఇంటి ఓనర్ పెట్టిన బాల్కనీ పోస్ట్ వైరల్ అయింది. ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియా వెబ్‌సైట్లలోనూ ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు ఆ బాల్కనీని సన్నీ రూమ్ (sunny room) అని పిలుస్తున్నారు. ఆ బాల్కనీ కేవలం ఒక వ్యక్తి నిద్రించడానికి మాత్రమే సరిపోతుంది. వైరల్ అవుతున్న సన్నీ రూమ్ ఫొటోను చూస్తే... ఒక వ్యక్తికి మాత్రమే సరిపోయే మంచం, అద్దం, బ్లైండ్స్, ఫ్లోరింగ్ మీద కార్పెట్ కనిపిస్తున్నాయి. బాల్కనీని, మిగిలిన ఇంటిని కలుపుతూ గ్లాస్ స్లైడింగ్ డోర్లు ఉన్నాయి. ఆ తలుపులు తీసుకుని ఇంటిలోకి ప్రవేశించొచ్చు.
కావాలంటే, ఆ బాల్కనీకి వారంవారీగా కూడా అద్దె కట్టుకోవచ్చట. మన దగ్గర ఛార్జెస్+జీఎస్‌టీ అన్నట్లుగా, అతను కూడా "రెంట్+బిల్స్" అని ప్రకటన పెట్టాడు. అంటే.. కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు లాంటివి అద్దెకు వచ్చే వ్యక్తే కట్టుకోవాలి. ఈ షరతులకు ఒప్పుకున్న వ్యక్తి అద్దెకు రావచ్చంటూ ఆ ఇంటి ఓనర్ ఆహ్వానించాడు.
బాల్కనీ ఉన్న ఇల్లు రెండు పడకగదుల అపార్ట్‌మెంట్ ఫ్లాట్. ఆ ఫ్లాట్ అద్దె 1300 డాలర్లు. ఇది నెలవారీ అద్దె కాదు, వారపు అద్దె. ఈ అద్దెతో పాటు బిల్లులు కూడా అద్దెకు ఉండే వ్యక్తులే కట్టుకోవాలట. 'రెడీ టు మూవ్' అంటూ ఆ ఇంటి ఓనర్ తన ప్రకటనకు ముక్తాయింపు కూడా ఇచ్చాడు.
ఇంటి సంగతి పక్కనబెడితే, బాల్కనీ వరకే అద్దెకు ఇచ్చే ఐడియాపై జోకులు పేలుతున్నాయి. అక్కడి నుంచి చూడడం అద్భుతంగా ఉంటుందంటూ ఒకరు, ఇంటి యజమానికి పిచ్చి పట్టిందని మరొకరు, లైట్లు అవసరం లేకుండా గొప్ప కాంతి వస్తుందని ఇంకొకరు.. ఇలా తలో విధంగా రియాక్ట్ అవుతున్నారు.
ఇంటి కష్టాలకు ఇదొక ఉదాహరణ
వాస్తవానికి ఇది జోక్‌గా తీసుకోవాల్సిన విషయం కాదు, చాలా సీరియస్ ఇష్యూ. సిడ్నీలో ఇంటి అద్దెలు ఏ స్థాయిలో పెరిగాయన్నదానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే. ఇళ్ల విషయంలో బలమైన డిమాండ్ - పరిమిత సరఫరాను ఇది ప్రతిబింబిస్తుంది. అక్కడి మీడియా కథనాల ప్రకారం, ఈ ఏడాది జూన్ నెలలో సిడ్నీలో సగటు అద్దె వారానికి 750 డాలర్ల రికార్డు స్థాయిలో ఉంది.
తక్కువ వడ్డీ రేట్లు, ఆర్థిక వృద్ధి, జనాభా పెరుగుదల వంటి అంశాలు అద్దెలకు ఆజ్యం పోస్తున్నాయి. అద్దెల్లో వృద్ధి గృహ స్థోమతను మించి పెరుగుతోంది. తక్కువ & మధ్య ఆదాయ కుటుంబాలు అధిక అద్దెలను భరించలేక ఇబ్బందులు పడుతున్నాయి. ఫలితంగా, ప్రజల్లో ఆర్థిక ఒత్తిడి & అభద్రత భావం పెరుగుతున్నాయి.
ఇది ఒక్క సిడ్నీకే పరిమితం కాదు. మన దేశంలోని ముంబై, దిల్లీ, హైదరాబాద్, బెంగళూరు వంటి సిటీలు సహా ప్రపంచంలోని అన్ని నగరాల కథ ఇది.
మరో ఆసక్తికర కథనం: స్టాండర్డ్ డిడక్షన్ రూ.లక్ష, హైదరాబాద్‌లో HRA పెంపు - ఈ బడ్జెట్‌లో సాధ్యమేనా?