(Source: ECI/ABP News/ABP Majha)
Budget 2024: స్టాండర్డ్ డిడక్షన్ రూ.లక్ష, హైదరాబాద్‌లో HRA పెంపు - ఈ బడ్జెట్‌లో సాధ్యమేనా?
Budget 2024 Expectations: మధ్యంతర బడ్జెట్‌తో దేశంలోని మధ్య తరగతి ప్రజలు, వేతన జీవులు నిరాశ చెందారు. పూర్తిస్థాయి బడ్జెట్ ద్వారా అయినా ఏళ్ల తరబడి నిరీక్షణకు తెర పడుతుందని ఆశతో ఉన్నారు.
Tax Relief in Union Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఈ నెల 23న (మంగళవారం) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి ఈసారి ప్రకటించేది పూర్తిస్థాయి బడ్జెట్. ఈ పద్దు మీద దేశంలోని జీతభత్యాల వర్గానికి చాలా అంచనాలు ఉన్నాయి. వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇస్తే వారి కొనుగోలు శక్తి పెరుగుతుందని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. తద్వారా వినియోగం (Consumption), ఆర్థిక వృద్ధి పెరుగుతాయి. దీనిపై భారత ప్రభుత్వం కాస్త సీరియస్‌గానే ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బడ్జెట్ ప్రవేశపెట్టే లోపు ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవచ్చు.
దేశ ఆర్థిక ప్రగతి (Economic Growth) శరవేగంగా దూసుకుపోతోంది. జీతభత్యాలపై ఆధారపడే వేతన వర్గాల (Salaried Category) ఆదాయాల్లో వృద్ధి మాత్రం నత్తనడక నడుస్తున్నాయి. ఫలితంగా, మధ్య తరగతి ప్రజలు ఖర్చులు తగ్గించుకుంటున్నారు. మధ్యంతర బడ్జెట్‌లో ఆదాయ పన్ను వంటి పెద్ద అంశంపై నిర్ణయం తీసుకోకూడదని ఆర్థిక మంత్రి సీతారామన్ గతంలో చెప్పారు. ఈ నేపథ్యంలో, ఈ నెలలో ప్రకటించే పూర్తిస్థాయి బడ్జెట్‌లో జీతభత్యాల తరగతికి శుభవార్త వస్తుందనే ఆశ పెరిగింది. పెరుగుతున్న జీవన వ్యయాల నుంచి నిర్మలమ్మ బడ్జెట్ ఉపశమనం కలిగిస్తుందని అందరూ భావిస్తున్నారు.
ప్రామాణిక తగ్గింపు & పన్ను స్లాబ్‌లలో మార్పులపై ఆశలు
జాతీయ మీడియా నివేదికల ప్రకారం, ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ (Standard Deduction) పరిమితిని పెంచవచ్చు. ప్రస్తుతం ఇది రూ. 50,000గా ఉంది, దీనిని రూ. 1,00,000కు పెంచవచ్చని అంచనా. టాక్స్ శ్లాబ్ రేట్లలోనూ (Tax Slab Rates) కూడా మంచి మార్పులు జరగవచ్చని ప్రజలు భావిస్తున్నారు. ప్రస్తుతం, శ్లాబ్ రేట్లు 5 శాతం నుంచి 30 శాతం మధ్య ఉన్నాయి. NPS టాక్స్ విధానంలో కూడా మార్పులను ఉద్యోగులు ఆశిస్తున్నారు. ప్రభుత్వం పాత పన్ను విధానంలోనూ పన్ను శ్లాబ్‌ల్లో మార్పులు చేయవచ్చని తెలుస్తోంది.
హైదరాబాద్‌కు 'మెట్రో సిటీ' హోదా!
కొవిడ్ మహమ్మారి తర్వాత దేశవ్యాప్తంగా ఇంటి అద్దెలు చాలా వేగంగా పెరిగాయి. పెద్ద మొత్తంలో అద్దెలు కట్టలేక మధ్య తరగతి ప్రజల ఇంటి బడ్జెట్ దారుణంగా దెబ్బతింటోంది. కాబట్టి, ఇంటి అద్దె భత్యం (HRA) విషయంలోనూ ఉపశమనం లభిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం, ఉద్యోగి నివాసం ఉంటున్న నగరాన్ని బట్టి HRA ఇస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరుతో సహా మరికొన్ని పెద్ద నగరాలను కూడా "మెట్రో సిటీ" పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం వద్ద ప్రతిపాదన ఉంది. ఈ నగరాలను అధికారికంగా మెట్రో సిటీలుగా గుర్తిస్తే, ఈ నగరాల్లో పని చేసే వ్యక్తులు కూడా దిల్లీ, ముంబైతో సమానంగా HRA ప్రయోజనాలు పొందొచ్చు.
మరో ఆసక్తికర కథనం: అంబానీ ఇంట పెళ్లంటే మజాకానా? - స్టార్ హోటళ్ల రూములన్నీ 'సోల్డ్ ఔట్', ఒక్క రోజుకు రూ.లక్ష