CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
Sankranti Celebrations: ఏపీ సీఎం చంద్రబాబు ఫ్యామిలీతో కలిసి స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

CM Chandrababu Family Participated In Sankranti Celebrations: చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో (Naravaripalle) సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం నిర్వహించిన భోగి వేడుకల్లో సీఎం చంద్రబాబు (CM Chandrababu), ఆయన కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు, మహిళలకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. మహిళలు వేసిన రంగవల్లులను చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి ఆసక్తిగా తిలకించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ ముగ్గుల పోటీల్లో 126 మంది మహిళలు పాల్గొన్నారు.
సంక్రాంతి కానుక
నారావారిపల్లెలో ప్రజలతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు గారు, కుటుంబ సభ్యులు. మహిళల ముగ్గుల పోటీలు, చిన్నారుల ఆటల పోటీలు తిలకించి, విజేతలకు బహుమతులు అందించిన సీఎం చంద్రబాబు గారు, కుటుంబ సభ్యులు.#ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/OUeMlmuHYI
— Telugu Desam Party (@JaiTDP) January 13, 2025
ఏపీ ప్రజలందరికీ సీఎం చంద్రబాబు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని.. అందరికీ సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. అటు, పోటీల్లో భాగంగా అందంగా రంగవల్లులు తీర్చిదిద్దిన మహిళలకు రూ.10.116 చొప్పున కానుక అందిస్తున్నట్లు సీఎం సతీమణి భువనేశ్వరి తెలిపారు. అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పిల్లలకు నిర్వహించిన వివిధ పోటీలను సీఎం కుటుంబ సభ్యులతో కలిసి తిలకించారు. అనంతరం గ్రామంలో తన స్వగ్రామం వద్ద ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు.
దేవాన్ష్ సందడి
వేడుకల్లో భాగంగా చిన్నారులకు నిర్వహించిన పోటీల్లో సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ సైతం పాల్గొన్నారు. ఎప్పుడూ స్కూల్స్‌లో ఆడటమే తప్ప ఊళ్లో ఆటల పోటీలు ఎలా ఉంటాయో తెలియని తన మనవళ్లను ఆడించాలని చంద్రబాబు కోరగా.. Sack Run (గోని సంచితో వేసుకుని దూకుతూ ఆడే పరుగుపందెం)లో దేవాన్ష్ పాల్గొన్నాడు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు చప్పట్లు కొడుతూ అతన్ని ఎంకరేజ్ చేశారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అనంతరం స్వగ్రామమైన నారావారిపల్లెలో పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.2 కోట్లతో రంగంపేటలో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.కోటితో జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి భూమి పూజ చేశారు. అలాగే, నారావారిపల్లెలో రూ.3 కోట్లతో విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు నాణ్యమైన నిత్యావసరాల చేరవేతకు ఈజీ మార్ట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న మహిళా సంఘాలకు సరుకులు అందనున్నాయి. అనంతరం గ్రామంలో మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు. అటు, అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల్లో ఐక్యూ పెరుగుదలకు కేర్ అండ్ గ్రో సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. 8 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనున్నారు.
అటు, తెలుగు రాష్ట్రాల్లో భోగీ పండుగను ఘనంగా నిర్వహించారు. వేకువ జాము నుంచే పిల్లా పెద్దా అంతా కలిసి రోడ్లపై సందడి చేస్తూ భోగి మంటలు వేశారు. చిన్నారులకు భోగి పళ్లు పోశారు. ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.





















