TTD News: 'సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు నమ్మొద్దు' - సమన్వయ లోపం ప్రచారం ఖండించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
Tirumala News: సోషల్ మీడియాలో తిరుమలపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ ఛైర్మన్, ఈవో హెచ్చరించారు. సమన్వయ లోపం వల్లే తిరుపతి తొక్కిసలాట ఘటన అంటూ సాగిన ప్రచారాన్ని ఖండించారు.

TTD Chairman And EO Comments: ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన అత్యంత బాధాకరమని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) స్పష్టం చేశారు. ఘటనలో మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి సీఎం అదేశాల ప్రకారం పరిహారం అందజేశామని.. బోర్డు సభ్యులతో ఏర్పాటు చేసిన రెండు బృందాలు బాధితులకు పరిహారం అందజేశారని అన్నారు. సోమవారం తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి భక్తులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని ప్రసార, సామాజిక మాధ్యమాల్లో టీటీడీపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని.. అవి నమ్మొద్దని ఆయన కోరారు.
'తిరుమల అనేది కోట్లాది మంది హిందువులు మనోభావాలకు సంభందించిన విషయం. వార్త ప్రచురణ, ప్రసారం చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు పరిశీలించండి. మీడియా చేతిలో ఉందని ఇష్టానుసారం అసత్య వార్తలు, ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే 31 మందికి చెక్కులు అందజేశాం. మిగతా 28 మందికి మంగళవారంలోగా చెక్కులు అందిస్తాం. పాలకమండలి, అధికారులకు మధ్య విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాను. అందరూ సమన్వయంతో భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పిస్తున్నాం. ఆ సంఘటన మినహా మిగతా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. భక్తులు ప్రశాంతంగా వైకుంఠద్వార దర్శనం చేసుకుంటున్నారు.' అని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.
ఆ వార్తలు అవాస్తవం: టీటీడీ ఈవో
సామాజిక మాధ్యమాల్లో తిరుమల పై తప్పుడు ప్రచారం జరుగుతోందని.. వైకుంఠ ద్వార దర్శన పని ఒత్తిడి వల్ల ఇలాంటి వార్తలను పట్టించుకోలేదని టీటీడీ ఈవో శ్యామలరావు (Shyamalarao) అన్నారు. 'సమన్వయం లోపం వల్ల ఘటనలు చోటు చేసుకున్నాయనే వార్తలు అవాస్తవం. తిరుపతి తొక్కిసలాట ఘటన అత్యంత దురదృష్టకరం. దీనిపై విచారణ జరుగుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును విభేదించానని వార్తలు పూర్తిగా తప్పుడు ప్రచారం. వైకుంఠ ద్వార దర్శనాలకు అన్ని ఏర్పాట్లు బాగానే చేశాం. కానీ తిరుపతిలో జరిగిన టోకెన్లకు వదిలినప్పుడు తొక్కిసలాట అనుకోకుండా జరిగింది. తిరుమలలో ఆరు నెలల్లో అనేక మార్పులు చేశాం. ప్రక్షాళనలో భాగంగా కల్తీ నెయ్యి వినియోగాన్ని గుర్తించి సరఫరా చేసిన సరఫరాదారులపై చర్యలు తీసుకున్నాం. స్వచ్ఛమైన నెయ్యితో ప్రసాదాల్లో నాణ్యత తీసుకొచ్చాం. దళారీలను అరికట్టాం, వేల సంఖ్యలో ఉన్న ఆన్ లైన్ బ్రోకర్ల బెడదను నివారించాం. సీఎం ఆదేశాల మేరకు భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాం.' అని పేర్కొన్నారు.
లడ్డూ కౌంటర్‌లో అగ్ని ప్రమాదం
మరోవైపు, తిరుమల లడ్డు కౌంటర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.నిత్యం భక్తులతో కిటకిటలాడే లడ్డు ప్రసాదాలను అందచేసే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. 47వ నెంబరు కౌంటర్లో కంప్యూటర్‌కు సంబంధించిన యుపీఎస్‌లో షార్ట్ సర్క్యూట్ రావడంతో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు.





















