(Source: ECI/ABP News/ABP Majha)
Ambani Wedding: అంబానీ ఇంట పెళ్లంటే మజాకానా? - స్టార్ హోటళ్ల రూములన్నీ 'సోల్డ్ ఔట్', ఒక్క రోజుకు రూ.లక్ష
Ananth Ambani Wedding: బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని స్టార్ హోటళ్లలో అన్ని రూములు నిండిపోయాయి, వెబ్‌సైట్లలో 'సోల్డ్ ఔట్' మెసేజ్‌లు కనిపించాయి. ఒక రాత్రి బస రేటు రూ. 91,350కి పెరిగింది.
Ananth Ambani - Radhika Merchant Wedding: రిలయన్స్ అధిపతి ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, అతని కాబోయే భార్య రాధిక మర్చంట్ వివాహ ముందస్తు వేడుకలు ( Ananth Ambani -Radhika Merchant Pre-Wedding Festivities) ముంబైలోని హోటళ్ల ఆక్యుపెన్సీని, ధరలను అతి భారీగా పెంచాయి. ముంబైలోని ఖరీదైన ప్రాంతం బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) ప్రాంతంలో వివాహం జరగబోతోంది. అదే ప్రాంతంలో ఉన్న రెండు స్టార్ హోటళ్లలో రూములన్నీ ఇప్పటికే బుక్ అయ్యాయి. ట్రావెల్, హోటల్ వెబ్‌సైట్లలోకి వెళితే, ఆ హోటళ్ల రూమ్స్‌కు 'సోల్డ్ ఔట్' మెసేజ్ కనిపిస్తోంది.
రూముల రేట్లకు రెక్కలు
ఈ రెండు హోటళ్లలో ఒకటి, ఈ నెల 14 కోసం, ఒక రాత్రికి రూ. 91,350 వసూలు చేస్తోంది. సాధారణ రోజుల్లో ఈ రేటు రూ. 13,000 ఉంటుంది.
ఈ నెల 12న, బీకేసీలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అంబానీ వారసుడి వివాహం జరుగుతుంది. అతిథులు ఎక్కడ బస చేస్తారనే దానిపై ఇంకా అధికారికంగా నిర్ణయించలేదు. అయినప్పటికీ, BKCతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని హోటల్ రూముల ధరలకు పెద్ద రెక్కలు వచ్చాయి.
ఈ నెల 12-14 తేదీల్లో జరిగే గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు చాలామంది ప్రముఖులు హాజరవుతారు. వారి వినోదం కోసం చాలా ఈవెంట్‌లను ప్లాన్ చేశారు. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహం జులై 12న జరుగుతుంది. జులై 14 వరకు వేడుకలు కొనసాగుతాయి.
బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో హోటల్ రూమ్ బుకింగ్ కోసం ట్రావెల్ బుకింగ్ వెబ్‌సైట్‌లలో సెర్చ్ చేస్తే... ట్రైడెంట్ BKCలో జులై 9న ఒక రాత్రికి రూ. 10,250, జులై 15న రూ. 16,750, జులై 16న రూ. 13,750 చూపిస్తోంది. దీనికి పన్నులు అదనం. జులై 10 నుంచి జులై 14 వరకు గదులు అందుబాటులో లేవు. ఈ తేదీల్లో 'సోల్డ్ ఔట్' మెసేజ్ కనిపిస్తోంది.
BKCలో ఉన్న Sofitel హోటల్‌లో రూం ధర (ఒక్క రాత్రికి) జులై 9న రూ. 13000, జులై 12న రూ. 30,150, జులై 13న రూ. 40,590, జులై 14న రూ. 91,350, జులై 15న రూ. 16560, జులై 16న రూ. 13680 అని చూపించాయి. జులై 10, 11 తేదీల్లో బుకింగ్‌లు అందుబాటులో లేవు.
అయితే, అవే తేదీల్లో గ్రాండ్ హయత్, తాజ్ శాంతాక్రూజ్, తాజ్ బాంద్రా, సెయింట్ రెగిస్ వంటి ఇతర ఫైవ్ స్టార్ హోటళ్లలో గదులు అందుబాటులో ఉంటాయి.
ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో BKC ఒకటి. ఇక్కడ చాలా నేషనల్, మల్టీ-నేషనల్ కంపెనీల ఆఫీస్‌లు ఉన్నాయి. ఇక్కడ ఉన్నవన్నీ గ్రేడ్ A ఆఫీస్ స్పేస్‌లే. ఈ ప్రాంతంలో బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఆయిల్, గోద్రేజ్ BKC, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డైమండ్ బోర్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, వివర్క్ వంటి కంపెనీలు ఇక్కడ పని చేస్తున్నాయి.
BKCలో ట్రాఫిక్ మళ్లింపులు, వర్క్ ఫ్రమ్ హోమ్
అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహం సందర్బంగా BKCలో ట్రాఫిక్ మళ్లింపులకు అవకాశం ఉంది. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడకుండా, ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' ఆప్షన్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది.
మరో ఆసక్తికర కథనం: మీ జీవిత భాగస్వామే మీ పాలిట వరాల మూట - రూ. 7 లక్షల వరకు పన్ను ఆదా!