పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్ కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఓ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ హడావుడి చేయడం కలకలం రేపింది. పవన్ కల్యాణ్ ఇటీవల సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలానికి వచ్చారు. ఆ సమయంలో ఆయన వెన్నంటే ఉండి ఐ.పి.ఏస్ ఆఫీసర్ లా ఓ వ్యక్తి కలియ తిరిగారు. పర్యటన అనంతరం కింది స్థాయి సిబ్బందితో ఫోటోలకు కూడా ఫోజులు ఇచ్చారు. ఆ ఫోటోలు బయటకు రావడంతో మన్యం జిల్లా పోలీసులు ఎంక్వైరీ చేశారు. అతను నకిలీ ఐ.పి.ఏస్ ఆఫీసర్ అని తేలడంతో విజయనగరం రూరల్ పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈ నకిలీ ఐ.పి.ఏస్ ఆఫీసర్ గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్య ప్రకాష్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అతణ్ని ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబడుతున్నారు. డిప్యూటీ సీఎం పర్యటనలో ఇంతటి సెక్యూరిటీ లోపం బయటపడడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.